లేడీ కమెడియన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కోవై సరళ. అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, తనదైన బాషతో డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు కోవై సరళ అందరినీ మెప్పించింది. అయితే కారణాలు ఏవైనా ఆమె కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది. తెలుగు అని కాదు తమిళంలో కూడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. అలా తెలుగులో డబ్ అయి వచ్చిన సినిమాలను మాత్రమే తెలుగు వాళ్ళు చూసి ఆనందించాల్సి వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు కోవై సరళ ఓ తెలుగు వెబ్ సీరిస్ లో ఎంట్రీ ఇస్తోందట. యంగ్ హీరోయిన్ రీతూ వర్మ, శివ కందుకూరి జంటగా నటిస్తున్న వెబ్ సీరీస్ ‘దేవిక అండ్ డానీ’. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ అయింది. రీతూవర్మ కు ఇదే మొదటి వెబ్ సీరిస్. ‘శ్రీకారం’ మూవీ ఫేమ్ బి. కిశోర్ ఈ వెబ్ సీరిస్ ను డైరెక్ట్ చేశాడు. అతనితోపాటు.. ఇందులో సూర్య వశిష్ఠ, సుబ్బరాజు, మౌనికా రెడ్డి, సోనియా సింగ్, చాగంటి సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జయ్ క్రిష్ దీనికి మ్యూజిక్ అందించాడు. త్వరలో ఈ వెబ్ సీరిస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి కోవై సరళ కామెడీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలుగువారికి ఆమె ఈ వెబ్ సీరిస్ తో ఎలాంటి వినోదాన్ని పండిస్తుందో చూడాలి.
తెలుగు వెబ్ సీరిస్‌లోకి కోవై సరళ!
