‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా : హీరో శ్రీకాంత్

'Mr. Middle Class' is a film that connects with everyone: Hero Srikanth
Spread the love

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ని ఈ రోజు లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కృష్ణారెడ్డి రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి గారికి థాంక్స్. చాలా రోజుల తర్వాత హీరోగా నా సినిమా టీజర్ లాంచ్‌కు రావడం ఆనందంగా వుంది. కమలాకర్ గారు ఫోన్ చేసి ఒక మంచి ఎంటర్‌టైనర్ చేద్దామని చెప్పారు. నేను వెంటనే ఖచ్చితంగా చేద్దామని చెప్పాను. నాగేశ్వర్ రెడ్డి గారు దర్శకుడు అని తెలిసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేసి చాలా రోజులైంది. చాలా కాలం తర్వాత అలాంటి చక్కని సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చేస్తున్నంతసేపూ చాలా ఎంజాయ్ చేశాను. మురళీధర్ గారు అద్భుతమైన టైమింగ్ ఉన్న నటుడు. ఆయన ఈ సినిమాలో నా తండ్రి పాత్రలో నటించారు. లయతో నేను చాలా మంచి సినిమాలు చేశాను. ‘స్వరాభిషేకం’ సమయంలో ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆమెతో మళ్లీ కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. సాయి కార్తీక్ చాలా మంచి సంగీతం అందించారు. సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, అలీ వంటి అద్భుతమైన నటీనటులతో చాలా రోజుల తర్వాత కలిసి పనిచేయడం ఆనందాన్ని ఇచ్చింది. చందు, జీకే ఈ చిత్రాన్ని చక్కగా నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ఎన్నో సినిమాలు చేశాను. మళ్లీ ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను ఆయన ఎంతో నిజాయితీగా, అంకితభావంతో పోషించారు. డైమండ్ రత్నబాబు గారు చాలా చక్కని సంభాషణలు రాశారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ లయ మాట్లాడుతూ.. ఈ సినిమా చేస్తుంటే ఇంట్లో వాళ్లతో కలిసి పనిచేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందే వీరందరితో కలిసి పని చేశాను. అచ్చిరెడ్డి గారు, ఎస్.వి. కృష్ణారెడ్డి గారు వచ్చి ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గారు కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. కథ వింటూనే నవ్వుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. సినిమా చాలా హిలేరియస్‌గా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించి చాలా రోజులైంది. మళ్లీ అలాంటి సినిమా చేయడం ఆనందంగా ఉంది. శ్రీకాంత్ గారు అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం మారలేదు. ఈ సినిమాలో ఆయన అద్భుతంగా నటించారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… కృష్ణారెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన దగ్గరే నేను అన్నీ నేర్చుకున్నాను. ఆయన లేకపోతే నేను దర్శకుడిగా ఎదిగేవాడిని కాదు. శ్రీకాంత్ గారికి ఇది ఒక గొప్ప కమ్‌బ్యాక్ సినిమా అవుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను ఎప్పుడూ నిర్మాతల గురించి ఆలోచిస్తాను. అనుకున్న బడ్జెట్‌లో మంచి సినిమా తీయాలని ప్రయత్నిస్తుంటాను. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ సహకరించడంతో సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా ఇంత వేగంగా పూర్తవడానికి శ్రీకాంత్ గారు ముఖ్య కారణం. ఇది భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. ఇందులో కర్మ ఫలితం గురించి చెప్పాం. సినిమా హిలేరియస్‌గా ఉంటుంది. ప్రతి సన్నివేశాన్ని నవ్వుతూ ఆస్వాదించేలా ఉంటుంది. ఇది చాలా మంచి సినిమా. ఎవరూ మిస్ అవ్వొద్దు.
నిర్మాత చందూ మాట్లాడుతూ… నాగేశ్వర్ రెడ్డి గారు కథ చెప్పగానే మాకు చాలా నచ్చింది. చాలా ఫ్రెండ్లీగా, పాజిటివ్ వాతావరణంలో ఈ సినిమాను పూర్తి చేశాం. నాగేశ్వర్ రెడ్డి గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. శ్రీకాంత్ గారు, లయ గారి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందరికీ ధన్యవాదాలు.
దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ… నాగేశ్వర్ రెడ్డి గారు ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారు అద్భుతంగా నటించారు. నేను శ్రీకాంత్ గారితో ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను. అయినప్పటికీ ఇంకా చేయాలనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు మా కుటుంబ సభ్యుడిలాంటి వారు. అలాంటి కాంబినేషన్‌లో సినిమా రావడం గొప్ప విషయం. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అద్భుతంగా పనిచేశారు. నిర్మాతలు కూడా ఎంతో శ్రద్ధతో నిర్మించారు. ఇలాంటి మంచి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాను ఎవరూ మిస్ అవ్వకూడదు. అందరికీ ధన్యవాదాలు.
నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ… నాగేశ్వర్ రెడ్డి మా కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి. ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే భవిష్యత్తులో దర్శకుడు అవుతాడని మేము అనుకున్నాం. ప్రతి విషయంలో ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్ అద్భుతంగా ఉంటుంది. ఆయన విజయవంతమైన దర్శకుడిగా ఎదిగారు. ప్రతి ఎమోషన్‌ను అద్భుతంగా ఆవిష్కరించగలరు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే మనం ఏమి కోరుకుంటామనే ఆసక్తికరమైన అంశం ఈ సినిమాలో ఉంటుంది. సినిమా పూర్తయ్యేలోపు ప్రతి ఒక్కరూ పైకి చూసి, సినిమాలో కనిపించే ఆ డబ్బా మన ఇంట్లో పడాలని కోరుకుంటారు. అంత ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతంగా నటించారు. శ్రీకాంత్ గారి నటన ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది. నేను రీ-రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమాను చాలాసార్లు చూశాను. ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని బలంగా చెబుతున్నాను.
రచయిత డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ మన దేశంలో ఉన్న ప్రతి మధ్యతరగతి వ్యక్తి జీవితానికి అద్దం పట్టే సినిమా. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు శ్రీకాంత్ గారి పాత్రలో తమను తాము చూసుకుంటారు. మనం ప్రతిరోజూ దేవుడితో మాట్లాడే మాటలను డైలాగుల రూపంలో రాసే అవకాశం ఈ సినిమాతో వచ్చింది. శ్రీకాంత్ గారు అద్భుతంగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారు నిజంగానే వెంకటేశ్వర స్వామి అవతరించినట్టుగా కనిపిస్తారు. ఈ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుందని మేమంతా బలంగా నమ్ముతున్నాం. ఈ వేడుకలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Related posts