గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల విషయంలో విమర్శలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఉగాదికి అవార్డులు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించినప్పటి నుంచి విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. నోటిఫికేషన్ లేకుండా స్క్రీనింగ్ కమిటీ వేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తాయి! ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి గద్దర్ అవార్డుల విధి విధానాలకు ఆమోదం తెలిపారు. ఇవాళ నోటిఫికేషన్ వెలువడింది. గురువారం నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దిల్ రాజు బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దయచేసి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను వివాదం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 2014-15లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నంది సినిమా అవార్డులను సింహ అవార్డ్స్ గా మార్చి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు 10 వేల రూపాయల ఫీజు కూడా వసూలు చేసింది. దాదాపు వందకు పైగా సినిమాల నిర్మాతలు దర్శకులు నటులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం అవార్డులు ఎంపిక చేయకుండా చేతులెత్తేసింది! సినిమా నటులు నిర్మాతల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే ఉన్నారు. “ఆంద్రోళ్లకు అవార్డులేమిటి” అని అప్పట్లో విమర్శలు రావడంతో కెసిఆర్ పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇన్నాళ్లకు నంది, సింహ పక్కన పెట్టేసి గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి యేటా ఉగాదికి గద్దర్ సినిమా అవార్డులు, అక్టోబర్ దసరా పండుగకు టివి అవార్డులు, డిసెంబర్ లో ప్రజా పాలన ఉత్సవాల్లో తెలంగాణ నాటకోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. గద్దర్ సినిమా అవార్డుల విధి విధానాల రూపకల్పనకు ప్రముఖ కవి దర్శక రచయిత బి.నర్సింగరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. జయసుధ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. 2014-’15 లో సింహ అవార్డులకు దరఖాస్తులు చేసుకున్న వారిలో అయోమయం ఆందోళన నెలకొంది. కొందరు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు ముఖ్యమంత్రితో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారి డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. 2024 సంవత్సరానికి గద్దర్ అవార్డులు ఇవ్వనున్నారు. ఈసారి దరఖాస్తు కు 5900 రూపాయల ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. అలాగే 2013 నుంచి 2023 వరకు విడుదలైన చిత్రాల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్స్ కు కూడా గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఈసారి ఉగాదికి కాకుండా ఏప్రిల్ నెలలో అవార్డులు ఇస్తామని, వచ్చే ఏడాది నుంచి ఉగాది రోజునే జరుగుతాయని దిల్ రాజు తెలిపారు.
గద్దర్ సినిమా అవార్డుల కోసం…
గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల కోసం అందరూ దరఖాస్తు చేసుకోనక్కర లేదు! 2024 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు తీసి విడుదల చేసిన సినిమాలకు సంబంధించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 2013 నుంచి 2023 లో తీసిన చిత్రాల్లో ఒక్కో ఏడాది ఒక్కో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ మాత్రమే ఎంపిక చేయనున్నారు. కాబట్టి ఆయా సంవత్సరాలకు సంబంధించి ఎవ్వరూ దరఖాస్తు చేసుకోనక్కరలేదు. గద్దర్ సినిమా అవార్డుల కమిటీ నిర్ణయిస్తుంది. 2014-15లో దరఖాస్తు చేసుకుని 10 వేల రూపాయలు ఎంట్రీ ఫీజు గా కట్టిన వారికి ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. 2024వ సంవత్సరపు దరఖాస్తుదారులు 5900 రూపాయలు ఎంట్రీ ఫీజుగా నిబంధనల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.
– డా. మహ్మద్ రఫీ