లండన్ పార్లమెంట్ లో అంతర్జాతీయ గౌరవం అని వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి ఆవేదన మిగిల్చింది! సహజంగా లండన్ పార్లమెంట్ లో అధికారికంగా ఎవరికైనా అవార్డు ఇవ్వాలంటే కార్యక్రమం బట్టి 2.40 లక్షల నుండి 5 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది. 40 మంది కన్నా ఎక్కువ మంది పాల్గొనడానికి వీలు కుదరదు. పార్లమెంట్ లో చిన్న కాన్ఫరెన్స్ హాల్ కేటాయిస్తారు. ఇద్దరు ఎంపి లు హాజరు కావాల్సి ఉంటుంది! ఆ ఎంపి పేరిట ఆ హాలును కేటాయిస్తారు! చిరంజీవి తీసుకున్న అవార్డు కూడా అలాంటిదే! లండన్ పార్లమెంట్ హౌస్ కు అక్కడి ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు!
పద్మవిభూషణ్ చిరంజీవి అభిమానుల పేరిట లండన్ లో స్థిరపడిన కొందరు మిత్రులు పక్కా స్కెచ్ వేశారు. బ్రిడ్జ్ ఇండియా పేరిట కొణిదెల చిరంజీవికి అంతర్జాతీయ గౌరవం ఆశ కల్పించారు. ఆయన అంగీకరించారు. నిజానికి ఆయనకు లండన్ పార్లమెంట్ హౌస్ నిబంధనలు తెలియవు! ఆయన్ని ఆహ్వానించిన వాళ్లే రెండు నెలల ముందే పార్లమెంట్ హౌస్ కు డబ్బులు చెల్లించేసారు. అంతేకాదు “మీట్ మిస్టర్ చిరంజీవి” అంటూ దుకాణం తెరిచారు. చిరంజీవి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కు హాజరైతే ఇంత రేటు, కలసి ఫోటో తీసుకోవాలంటే ఇంకో రేటు, ఆయన చేతుల మీదుగా శాలువా జ్ఞాపిక స్వీకరించాలంటే మరో రేటు… ఇలా ఫిక్స్ చేసి భారీ మొత్తం సంపాదించినట్లు సమాచారం! అన్నీ అనుకున్నట్లు జరిగిపోయాయి!
చిరంజీవి వెళ్లారు వచ్చేసారు! వచ్చిన తరువాత ఆయనకు తెలిసింది! ఇదంతా వ్యాపారం అని! ఇవాళ చిరంజీవి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరిట అభిమానుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నిర్వాహకులకు తేల్చి చెప్పారు.
ప్రియమైన అభిమానులారా!
UK లో నన్ను కలిసేందుకు మీరు చూపించిన అభిమానం, ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని తాకింది. ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తన ను నేను సమర్ధించను. నేను ఖండిస్తున్న! ఫ్యాన్ పేరిట వసూల్ చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేయండి. ఇలాంటి వారిని నేను ప్రోత్సహించను. మన మధ్య వున్న ప్రేమ అనుబంధం వెల కట్టలేనిది! ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటిని అంగీకరించను.
– ఎక్స్ వేదికగా చిరంజీవి
సెలబ్రిటీలను పిలిచి పైసా వసూల్ చేయడం ఇదేం కొత్త కాదు! ఇదే మొదటి దందా కాదు! ఎవ్వరూ ఎవ్వరి కోసం ఎంత అభిమానం వున్నా సొంత ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహించరు! కొందరు ఆ కార్యక్రమానికి సరి పడా సౌజన్యం తెచ్చుకుని చేస్తారు! కొందరు దాన్ని వ్యాపారంగా మలచి లాభం చేకూర్చుకుంటారు! ఇక్కడ నుంచి ప్రతి యేటా విదేశాల్లో జరిగే ప్రోగ్రాములకు వెళ్లే సినీ స్టార్స్ కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు! ఎవ్వరూ సొంత ఖర్చులు పెట్టరు! వీళ్లకు ఫ్లైట్ ఖర్చులు పెట్టి, స్టార్ హోటల్స్ లో వసతి కల్పించి కాస్టలీ కార్లు పెట్టి వున్నన్ని రోజులు విఐపి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి చూసుకోవడానికి తడిసి మోపెడు కాదు, భారీ ట్రక్ అవుతుంది! పైగా అభిమానంతో వీళ్ళను ఆహ్వానించి అతిధ్యం ఇచ్చి సన్మానించినందుకు పెద్ద మొత్తంలో ఎదురు రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటారు! అందుకే స్పాన్సర్ల పై ఆధార పడతారు కొందరు! కొందరు ఇలా టికెట్లు పెట్టి, డొనేషన్లు వసూల్ చేసి మమ అనిపిస్తారు! మిగుల్చుకునే వాళ్ళు కూడా ఉంటారు! అదే వ్యాపారంగా ఉపాధిగా మలచుకునే వాళ్ళు ఉంటారు! ఈవెంట్స్ పలు రకములు! ఇండియాలోనే ఇక్కడ స్థాయిని బట్టి వ్యాపారం జరుగుతోంది! ఇక విదేశాల్లో జరగడంలో ఆశ్చర్యం ఏముంది! ఇదంతా షరా మామూలే! లైట్ తీసుకోండి చిరంజీవి గారు!
– డా. మహ్మద్ రఫీ
చిరంజీవి లండన్ టూర్ .. పైసా వసూల్ ఫ్యాన్ పై ఆగ్రహం
