‘నర్తనశాలచిత్రం నుండి అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ ఫస్ట్‌లుక్ విడుదల. నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన పౌరాణిక చిత్రం
నర్తనశాల`. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను విజయదశమి కానుకగా శ్రేయాస్ ఈటి ద్వారా ఎన్బికె థియేటర్ లో ఈ నెల 24న తిలకించే అరుదైన అవకాశం కల్పిస్తున్నారు నటసింహ బాలకృష్ణ .
తాజాగా నర్తనశాల
నుండి నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఇందులో అర్జునుడిగా బాలయ్య లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. మరో పౌరాణిక పాత్రలో బాలయ్యని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
‘‘నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అర్జునుడిగా నేను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది.
మీ
నందమూరి బాలకృష్ణ’’