అర్ధనారీశ్వర తత్వం.. సమాజానికి గొప్ప ఆదర్శం

The philosophy of Ardhanarishvara is a great ideal for society.
The philosophy of Ardhanarishvara is a great ideal for society.
Spread the love

– ఘనంగా ముగిసిన జాతీయ నృత్యోత్సవాలు
శివ పార్వతుల సాంగత్యం, విడదీయలేని బంధం ఈ సృష్టికి ఆదర్శం స్ఫూర్తిదాయకం అంటూ బెంగళూరు జంట కళాకారులు నిధగా కరుణాద్, రచనా కరణిక్ ప్రదర్శించిన “ఏకత్వం” అర్ధనా రీశ్వర తత్వానికి నిలువుటద్దం పట్టింది. లక్నో ఘరానా కథక్ నృత్య శైలిలో మురిపించి మైమరపించే మెరుపు కదలికలతో లయ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మూడు రోజులుగా జరుగుతున్న అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాలు బుధవారం ఘనంగా ముగిసాయి. కథక్, భరత నాట్యం, కూచిపూడి నృత్య శైలులలో ఉత్కృష్ట అర్ధనారీశ్వర తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. బెంగళూరులో కరుణాద్ గురుకుల నృత్యాలయం నిర్వహిస్తున్న కళాకారుల జంట నిధగా, రచన కలసి కథక్ లోని తాల్ లయ సౌందర్యంతో కాశ్మిక్ రిథమ్ మొత్తం సృష్టిని నియంత్రిస్తుందని చాటిచెప్పారు. శివుడిలో అర్ధభాగమైన శక్తి స్వరూపిణి దైవత్వాన్ని లాలిత్యాన్ని ధీరత్వాన్ని ప్రదర్శించి కరతాళ ధ్వనులు అందుకున్నారు. అలాగే మహాదేవుడి అనేక కోణాలను ఆవిష్కరిస్తూ శంకర గిరిజాపతే అంశాన్ని రమ్యంగా ప్రదర్శించారు. శివ మహిమలు, శివ రహస్యాలు, ధర్మాన్ని నిలబెట్టడంలో సృష్టిని కాపాడటంలో శివ పార్వతుల శక్తి యుక్తులు, కరుణ కాఠిన్యం, ప్రేమ దయ ఆయా నృత్యాంశాల్లో ప్రదర్శించారు. అనంతరం బెంగళూరుకు చెందిన అద్భుత ప్రతిభ కలిగిన భరత నాట్య కళాకారుడు సూర్య ఎన్.రావు రామాయణంలోని ప్రతి నాయకుడు రావణాసుర ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మహా శివ భక్తుడు రావణుడు శివుడి అంశ అని చాటి చెబుతూ ప్రదర్శించిన ఘట్టం అలరించింది. ఎంతటి శక్తివంతుడైనా ధర్మం పాటించకపోతే అధోగతి అని సందేశం ఇస్తూనే, రావణుడిలోని రాజనీతి లక్షణాలను కూడా ప్రదర్శించి ఆలోచనలు రేకెత్తించారు. ముఖ్యంగా సూర్యారావు ప్రదర్శనలో రంగోద్దీపనం మరింత రక్తి కట్టించింది. చివరగా న్యూఢిల్లీకి చెందిన పద్మవిభూషణ్ రాజా రాధా కౌశల్యా రెడ్డి వారస ద్వయంలో ఒకరైన హైదరాబాద్ కోడలు యామిని రెడ్డి తన నాట్య తరంగిణి బృందంతో కలసి “ఇషాని” పేరిట ప్రదర్శించిన కూచిపూడి నృత్యాంశాలు ఈ నృత్యోత్సవాల్లో గొప్ప హైలెట్ అని చెప్పుకోవాలి. మహాశక్తి స్వరూపిణి పార్వతీదేవి అంటే ప్రకృతి అని చెబుతూ అమ్మ వారి అద్భుత శక్తిని వివరిస్తూ సాగిన ప్రదర్శన ఆద్యంతం ప్రేక్షకుల కళ్ళను కట్టిపడేసింది. స్త్రీ పురుష సమానత్వం, సమగ్రత సామరస్యం అంశాలను అత్యద్భుతంగా ఆవిష్కరించి అర్ధనారీశ్వర తత్వం ఆదర్శనీయం అంటూ గొప్ప సందేశాన్ని లయబద్ధంగా చక్కని కొరియోగ్రఫీలో ప్రదర్శించడంతో ప్రేక్షకులు తన్మయులై లేచి నిలబడి కరతాళ ధ్వనులతో గౌరవ వందనం చేశారు. ముగింపు ఉత్సవంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ అనూరాధ జొన్నలగడ్డ, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు దీపికారెడ్డి, ఉమా మహేశ్వరి, జైళ్లు నిర్వహణ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ కళాకృష్ణ, డాక్టర్ వనశ్రీరావు, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, ఎ.కె.ఖాన్ తదితరులు పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. అర్ధనారీశ్వరం కాన్సెప్ట్ తో వివిధ రాష్ట్రాలకు చెందిన యువ ప్రతిభ కళాకారులతో జాతీయ స్థాయి నృత్యోత్సవాలు నిర్వహించడం అద్భుతంగా ఉందని కొనియాడారు. సభాధ్యక్షత వహించిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ అర్ధనారీశ్వర తత్వాన్ని తొమ్మిది నాట్య బృందాలు పోటాపోటీగా వైవిధ్యంగా ఆవిష్కరిస్తూ చేసిన ప్రదర్శనలు యువ కళాకారులకు కళాప్రియులకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. మురళీకృష్ణ వ్యాఖ్యాతగా రక్తి కట్టించారు. అకాడమీ అధికారులు ఆర్. వినోద్ కుమార్, అశోక్, రేఖ సమన్వయం చేశారు.