SPARK Telugu Movie Review in Telugu: సరికొత్త అనుభూతిని పంచే ‘స్పార్క్’

SPARK Telugu Movie Review in Telugu:
Spread the love

(చిత్రం: స్పార్క్, నటీనటులు : రేటింగ్ : 3.5/5, విక్రాంత్ రెడ్డి , మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ ధిల్లాన్, వెన్నెల కిశోర్, నాజర్, సుహాసిని, సత్య, అన్నపూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. దర్శకత్వం : డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్, నిర్మాత : లీలా రెడ్డి, సంగీత : హేషమ్ అబ్దుల్ వాహాబ్ , సినిమాటోగ్రఫీ : ఏ.ఆర్.అశోక్ కుమార్).

ఈ దీపావళి కానుకగా అనేక చిత్రాలు థియేటర్లలోకి అడుగుపెట్టాయి. అలా విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా సందడి చేసింది లేదు. ఫలితంగా రాబోయే సినిమాల మీద ప్రేక్షకులు దృష్టిసారించారు. అలా ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడానికి ఈ వారం ‘స్పార్క్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలకు ముందే వచ్చిన పాటలకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ‘ఏం అందం’ అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. టీజర్, ట్రైలర్లు కూడా చాలా కొత్తగా అనిపించాయి. మరి ఈ ‘స్పార్క్’ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం….

కథ: లేఖ (మెహరీన్)కి నిత్యం ఓ కల వస్తూ ఉంటుంది. తన కలలోకి వచ్చిన వ్యక్తిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధాలు ససేమిరా అంటూనే క్యాన్సిల్ చేసే పనిలో ఉంటుంది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి తన కలల రాకుమారుడిని వెతికే పనిలో పడుతుంది. ఈ నేపథ్యంలో ఓ హాస్పిటల్ లో అనుకోకుండా అతడ్ని చూస్తుంది. అతను మరెవరో కాదు తన ఎదురింట్లో ఉంటున్న ఆర్య (విక్రాంత్ రెడ్డి) అని తెలుస్తుంది. అతనికి తన ప్రేమ గురించి చెప్పగా.. అతను వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా రిజెక్ట్ చేస్తాడు. మరోపక్క లేఖ స్నేహితులు ఊహించని విధంగా తమకి అయిన వాళ్ళని చంపేసుకుని..తరువాత వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. అయితే ఈ చావులకి కారణం హీరో అని లేఖ తండ్రి ఆరోపిస్తాడు.అలాగే పోలీసులు కూడా ఇతని కోసం గాలిస్తూ ఉంటారు. నిజంగా ఆర్య ఈ మర్డర్స్ చేశాడా? లేదంటే వారిని చంపింది ఎవరు? అసలు ఆర్య గతం ఏంటి? అతని ప్రియురాలు అనన్య(రుక్సార్ ధిల్లాన్) కథేంటి? చివరికి ఆర్య ఈ మర్డర్ కేసుల నుండి ఎలా బయటపడ్డాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…!!

విశ్లేషణ : ఈ సినిమా కోసం తీసుకున్న పాయింట్ కొత్తగా అనిపించింది. అంతే గాకుండా ఆసక్తికరమైన ట్విస్టులతో ఆద్యంతం సినిమా సాగిపోయింది. కథ, కథనాలకు కూడా ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. ఓ మంచి సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. అన్నీ సమపాళ్లలో మేళవించిన వినోదాత్మకంగా చిత్రమిది. ఈ ‘స్పార్క్’ ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచుతుంది. ఎంచుకున్న కథ, కథనాలను అంతే అందంగా తెరకెక్కించడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ప్రతీ సన్నివేశంలోనూ ఆసక్తికరమైన ఆలోచన కలుగుతుంది. ఈ సినిమా హీరోకి డెబ్యూ మూవీ అయినప్పటికీ విక్రాంత్ చాలా బాగా నటించాడు. రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలను ప్రేక్షకులు మెచ్చేలా నటించి మంచి మార్కుల్ని కొట్టేశాడు. ప్రతీ సన్నివేశంలోనూ ఈజ్ కనిపించింది. హీరోగా తన క్యారెక్టర్ ని సమర్ధవంతంగా పోషించడమే కాకుండా… ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించి మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు.ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం అంటే మాటలు కాదు.చేతలు కావాలి. ఆ చేతలు అన్నీ హీరోలో కనిపించాయి. ఇక మెహరీన్ స్క్రీన్ పై గ్లామర్ గా కనిపించింది. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. పాటల్లో ఆమె కాస్ట్యూమ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇతర పాత్రల్లో నటించిన రుక్సర్ ధిల్లాన్ .. అనన్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆయా పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ.. కథలో కీలక పాత్ర వారిదే అని చెప్పాలి. ఇక విలన్ గా చేసిన గురు సోమసుందరం పాత్ర అయితే చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగించింది. స్టైలిష్ గా ఉంటూనే వినోదాన్ని పంచింది. అలాగే నాజర్, అన్నపూర్ణ, సుహాసిని, శ్రీకాంత్ అయ్యంగార్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. వెన్నెల కిషోర్,సత్యలు తమ నటనతో థియేటర్లో నవ్వులు పూయించారు. మిగిలిన నటీనటులు ఫరవాలేధనిపించారు.

సాంకేంతిక నిపుణుల విషయానికొస్తే… ఈ సినిమాకు అన్నీ తానై చేశాడు విక్రాంత్ రెడ్డి. అతను ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా కొత్తగా.. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంత మంచి పాయింట్ ను ఎంపిక చేసుకున్నా.. దానిని తెరపై ఆవిష్కరించే టైంలో చాలా మంది తడబడతారు. కానీ విక్రాంత్ అలాంటి పొరపాటు చేయలేదు. మంచి స్క్రిప్ట్.. పక్కాగా ఈ కథని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంది. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం సినిమాకి ఆయువు పట్టుగా నిలిచింది. పాటలు వినడానికి చూడటానికి కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి పేరు పెట్టనవసరం లేదు. సెకండ్ హాఫ్ లో విక్రాంత్ – మెహరీన్..ల మధ్య వచ్చే డ్యూయెట్.. కన్నుల విందుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువల విషయంలో లీలా రెడ్డి ఎక్కడా రాజీపడలేదు . స్థాయికి తగ్గట్టే ఉండి.. సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దారు. మొత్తం మీద ఈ ‘స్పార్క్’ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.

(చిత్రం: స్పార్క్, నటీనటులు : రేటింగ్ : 3.5/5, విక్రాంత్ రెడ్డి , మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ ధిల్లాన్, వెన్నెల కిశోర్, నాజర్, సుహాసిని, సత్య, అన్నపూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. దర్శకత్వం : డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్, నిర్మాత : లీలా రెడ్డి, సంగీత : హేషమ్ అబ్దుల్ వాహాబ్ , సినిమాటోగ్రఫీ : ఏ.ఆర్.అశోక్ కుమార్).

Related posts

Leave a Comment