గోపీచంద్‌-శ్రీనువైట్ల కాంబో.. క్లాప్‌ కొట్టిన దర్శకేంద్రుడు

Gopichand-Srinuvaitla combo.. Director who clapped
Spread the love

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ హిట్టు చూసి చాలా ఏళ్లయింది. దాదాపుగా తొమ్మిదేళ్లుగా సరైన హిట్టు లేక సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రామబాణం’ అల్టా డిజాస్టర్‌గా నిలిచింది. తన కెరీర్‌లో రెండు బిగ్గెస్ట్‌ హిట్లిచ్చిన శ్రీవాస్‌ సైతం ఈ సారి గోపిను కాపాడలేకపోయాడు. దాంతో కొంత గ్యాప్‌ తీసుకుని గోపీచంద్‌ తన కొత్త సినిమాను ప్రారంభించాడు. అది కూడా ఐదేళ్లుగా మెగాఫోన్‌ పట్టని శ్రీనువైట్లతో. ఒకప్పుడు సూపర్‌ ఫామ్‌లో ఉన్న వైట్ల ఇప్పుడు హిట్టు సినిమా తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పిలిచి మరీ ఆఫర్‌ ఇచ్చిన రవితేజకు ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ రూపంలో డిజాస్టర్‌ సినిమా ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పటివరకు శ్రీనువైట్ల మరో సినిమా చేయలేదు. అయితే చాలా మంది ఈ దర్శకుడి సినిమాలను విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడంటే టైమ్‌ బాలేక సరైన సినిమాలు పడట్లేదు కానీ.. ‘దూకుడు’ వరకు ఆయన సినిమాలు జనాలకు ఓ ఎంటర్‌టైన్ మెంట్‌ ఫార్ములా. కేవలం పోస్టర్‌ పైన ఆయన పేరు కనిపిస్తే అప్పట్లో థియేటర్‌లకు పరిగెత్తిన జనాలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి డైరెక్టర్‌ ఇప్పుడు పతాళంలోకి పడిపోయాడు. ఆ మధ్యన ఢీ సీక్వెల్‌ అంటూ ప్రకటించినా.. అది కార్య రూపం దాల్చలేదు. ఇక ఎట్టకేలకు మ్యాచో స్టార్‌ను ఒప్పించి ఓ ఫ్యామిలీ కథను చేయబోతున్నాడు. కేవి గుహన్‌, గోపి మోహన్‌ వంటి స్టార్‌ టెక్నిషియన్ లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా శనివారం ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ వేడుకకు దర్శకేంద్రడు రాఘవేంద్రరావుతో పాటు మైత్రీ నిర్మాత నవీన్‌ ఎర్నేని గెస్ట్‌లుగా వచ్చారు. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్‌ స్టార్ట్‌ చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Related posts

Leave a Comment