తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ – 2025 : చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర పురస్కారం  

Telangana Gaddar Film Awards - 2025: Chiranjeevi wins NTR National Film Award
Spread the love

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2025’ విజేతలను ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారం అందజేయనున్నారు. మార్చి 19, 2026న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ పురస్కార వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల  జాబితా ఫైనల్ లిస్ట్ ను అందజేశారు. అనంతరం అవార్డు విన్నర్‌లను ప్రకటించారు. ఈ అవార్డులను ప్రారంభించి రెండో సంవ్సతరమిది. 2025 సంవత్సరానికిగానూ సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు పలు ప్రత్యేక అవార్డులను కూడా ప్రకటించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు మెగాస్టార్‌ చిరంజీవిని వరించింది. పైడి జయరాజ్‌ అవార్డు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ను, బీఎన్‌ రెడ్డి అవార్డు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు నిర్మాత సి.అశ్వినీదత్‌ను, టి.ఎల్‌ కాంతారావు పురస్కారం ఆర్‌.నారాయణమూర్తిను, రఘువెంకయ్య అవార్డు ఎ.రమేశ్‌ ప్రసాద్‌ను వరించాయి. ఈ ఏడాది కొత్తగా రెండు అవార్డులను ప్రకటించారు. వాటిలో ఏయన్నార్‌ అవార్డు సీనియర్‌ నటి జయసుధను, సి.నారాయణరెడ్డి అవార్డు గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజను వరించాయి. ‘తెలుగు సినిమా’స్టేట్‌ అవార్డు మొహం చూసి దాదాపు పదేళ్లు కావొస్తుంది. గతంలో నంది అవార్డుల వేడుకను నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత ఆ వేడక కొనసాగలేదు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రాలో నంది అవార్డులను పునరుద్దరించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం గతేడాది గద్దర్‌ అవార్డులను ప్రారంభించి ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారం ప్రదానం చేసింది. పెండింగ్‌లో ఉన్న అవార్డులను ఒక్కసారిగా క్లియర్‌ చేసింది. గత సంవత్సరం చక్కగా అవార్డు ఫంక్షన్‌ సాగడంతో ఈ ఏడాది మరింత జోరు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. గడిచిన సంవత్సరం చిన్న చిత్రాలకు పెద్ద పీట వేశారు. ఈ ఏడాదీ అదే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆరంభించిన ‘తెలంగాణ గద్దర్ ఫిలిమ్ అవార్డ్స్’ గత సంవత్సరం విజయవంతంగా సాగింది. ఈ సారి కూడా చలనచిత్ర అభిమానుల్లో అధికశాతం హర్షించేలా 2025 సంవత్సరానికి గాను అవార్డులను ఎంపిక చేసి ‘తెలంగాణ గద్దర్ ఫిలిమ్‌ అవార్డ్స్’ కమిటీ ప్రత్యేకతను చాటుకుంది. మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షునిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు- సమీక్షల పరిశీలనకు తనికెళ్ళ భరణి చైర్మన్ గా ఉన్నారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షునిగా వ్యవహరించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అవార్డుల ఫలితాలు అందించిన తర్వాత మీడియాకు వెల్లడించారు. ఎక్కువశాతం అవార్డులు చిన్న చిత్రాలనే వరించాయి. తెలంగాణ జీవితాన్ని, సంస్కృతుల్ని ప్రతిబింబించే సినిమాలకు అగ్ర తాంబూలం దక్కింది. రాజు వెడ్స్‌ రాంబాయి, దండోరా, ది ప్రీ వెడ్డింగ్‌ షో, కోర్ట్‌, లిటిల్‌ హార్ట్స్‌ చిత్రాలు ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాయి.  2025′ అవార్డ్స్ లో ప్రథమ ఉత్తమ చిత్రంగా ‘రాజు వెడ్స్ రాంబాయ్’, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎన్నికయ్యారు. జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా ‘తండేల్’ నిలచింది. ఉత్తమ పర్యావరణ చిత్రంగా ‘ఈజీడబ్ల్యూఏ’, బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిలిమ్ గా ‘లిటిల్ హార్ట్స్’ గెలిచాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రం కేటగిరీలో ఇచ్చే డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి అవార్డును ‘సంక్రాంతికి వస్తున్నాం’ దక్కించుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిలిమ్ గా ‘మిరాయ్’, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిమ్ గా ‘అనగనగా’ నిలిచాయి. రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్రం ద్వారా సాయిలు  కంపాటి ఉత్తమ దర్శకునిగా ఎన్నికయ్యారు. ఉత్తమ నటునిగా ‘తండేల్’ కథానాయకుడు నాగచైతన్య, ఉత్తమ నటిగా ‘ద గర్ల్ ఫ్రెండ్’ నాయిక రష్మిక మందన్న ఎంపికయ్యారు. ఉత్తమ సహాయనటులు కేటగిరీలో ‘దండోరా’ నుండి శివాజీ, ‘యుఫోరియా’ ద్వారా భూమిక విజేతలుగా నిలిచారు. బెస్ట్ కమెడియన్ గా ‘జిగ్రీస్’లో నటించిన కృష్ణతేజ రెడ్డి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో నటించిన మాస్టర్ రోహన్ నిలిచారు.
‘ఛాంపియన్’ తడాఖా…  దండోరా’ చిత్రానికి సంగీతం సమకూర్చిన మార్క్ కె.రాబిన్ ఉత్తమ సంగీత దర్శకునిగా నిలిచారు. ఉత్తమ గాయకునిగా ‘రాజు వెడ్స్ రాంబాయ్’ ద్వారా అనురాగ్ కులకర్ణి గెలవగా, ఉత్తమ గాయనిగా ‘కన్నప్ప’ నుండి సాహితీ చాగంటి గెలిచారు. ‘కుబేర’ చిత్రం ద్వారా నందకిషోర్ ఉత్తమ గీత రచయితగా ఎన్నికయ్యారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో అనిల్ రావిపూడి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నిలవగా, ‘యుఫోరియా’తో గుణశేఖర్ బెస్ట్ స్టోరీ రైటర్ గా గెలిచారు. ‘మిరాయ్’ చిత్రం ద్వారా కార్తిక్ ఘట్టమనేని బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా ఎన్నికయ్యారు. ‘మిరాయ్’తోనే శ్రీకర్ ప్రసాద్ బెస్ట్ ఎడిటర్ గా నిలిచారు. బెస్ట్ ఆడియో గ్రాఫర్ గా ‘కిష్కింధపురి’కి పనిచేసిన ఎమ్.ఆర్.రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ‘ఛాంపియన్’ తో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా తోట తరణి, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పీటర్ హెయిన్స్, బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్ గా చంద్రకాంత్, అజయ్ కుమార్ విజేతలుగా నిలిచారు.  ఫీచర్ ఫిలిమ్స్ ద్వారా రోషన్ మేకా, చైతూ జొన్నలగడ్డ, అనంతిక, రాజ్ రాచకొండ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కు ఎన్నికయ్యారు. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ గా ‘యూనిటీ’, ‘ద ఫస్ట్  యాక్షన్ హీరో పైడి జైరాజ్’, ‘మహామనీషి డాక్టర్ ఎ.యస్.రావ్’ ఎంపికయ్యాయి. బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో “వనజీవి రామయ్య, మౌనమే నీ భాష, సైబర్ స్లేవరీ” ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. చలనచిత్రాలకు సంబంధించిన ఉత్తమ పుస్తకంగా ప్రభు రాసిన ‘శూన్యం నుండి శిఖరాగ్రాలకు’ ఎన్నికయింది. బెస్ట్ ఫిలిమ్ క్రిటిక్ గా హెచ్.రమేశ్ బాబు నిలిచారు.

విజేతలు వీరే…


ప్రత్యేక అవార్డులు:
చిరంజీవికి ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు
అశ్వినీదత్‌కు నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు
సింగీతం శ్రీనివాసరావుకు బీఎన్‌రెడ్డి అవార్డు
కమల్‌హాసన్‌కు పైడి జయరాజ్‌ అవార్డు
జయసుధకు అక్కినేని స్పెషల్‌(ఫిమేల్‌) అవార్డు
సుద్దాల అశోక్‌ తేజకు సి.నారాయణ రెడ్డి అవార్డు
రమేష్‌కు ప్రసాద్‌కు రఘపతి వెంకయ్య అవార్డు
ఆర్‌. నారాయణమూర్తికి కాంతారావు అవార్డు వరించాయి.

అవార్డు విజేతలు :
ఉత్తమ నటుడు  – నాగ చైతన్య (తండేల్‌)
ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్‌ షో
బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ – తండేల్‌
ఉత్తమ పర్యావరణ చిత్రం  – ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ – లిటిల్‌ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం  – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం – కోర్టు
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్‌
ఉత్తమ బాలల చిత్రం  – అనగనగా
ఉత్తమ డెబ్యూ దర్శకుడు  – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు – శివాజీ
ఉత్తమ సపోర్టింగ్‌ నటి – భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు  – మార్క్ కె రాబిన్‌ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు  – అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు  – కృష్ణ తేజ  (జిగ్రీస్‌)
ఉత్తమ బాలనటుడు –  రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)
ఉత్తమ కథా రచయిత  – గుణశేఖర్‌ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ – అనిల్‌ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత  – నందకిశోర్‌ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ – ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ – కిష్కిందపురి
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – ఆట సందీప్ – గిర గిర గిర
ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ – తోట తరణి (ఛాంపియన్‌)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ – గోవింద్‌ (అఖండ 2)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – చంద్రకాంత్‌ (చాంపియన్‌)
ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ – 23
ఉత్తమ మేల్‌ యాక్టర్‌ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
స్పెషల్‌ జ్యూరీ హీరోయిన్ – అనంతిక (8 వసంతాలు)
స్పెషల్‌ జ్యూరీ హీరో – రోషన్‌ (చాంపియన్‌)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌
మహామనిషి డాక్టర్‌ ఏఎస్‌ రావు – బాలబ్రహ్మచారి పూసపాటి
యూనిటి (మ్యాన్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌) – చిరందాస్‌ శ్రీకాంత్‌
ది ఫస్ట్‌ యాక్షన్‌ హీరో పైడి జయరాజ్‌ ప్రస్థానం – పొన్నం రవిచంద్ర

ఉత్తమ లఘు చిత్రాలు
వనజీవి రామయ్య – భూసం రవీంద్రనాథ్‌
మౌనమే నీ భాష – రవీంద్రవర్మ ఇందుకూరి, విశ్వాస్‌ హనుకర్‌
సైబర్‌ స్లేవరీ – కె.నీలిమ
ఉత్తమ సినీ విమర్శకుడు – హెచ్‌. రమేష్ బాబు
బెస్ట్‌ బుక్‌ ఇన్‌ తెలుగు – శూన్యం నుంచి శిఖరాగ్రాలకు (ప్రభు)

దటీజ్… మెగాస్టార్!


2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిలిం అవార్డు పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డులలో భాగంగా ప్రకటించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవంతో సత్కరిస్తున్నారు. తెలుగు కమర్షియల్ సినిమాకు కొత్త దిశ చూపించిన హీరోగా చిరంజీవి ప్రత్యేక గుర్తింపు పొందారు. తన అద్భుతమైన నటన, డ్యాన్స్, మాస్ అప్పీల్‌తో ఆయన తరతరాల ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన సినీ వారసత్వం భారతీయ సినిమాపై గొప్ప ముద్ర వేసింది. ఈ అవార్డుకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఇది దిగ్గజ కథానాయకుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరు మీద ఇవ్వనున్నారు. భారతీయ సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తులను గౌరవించేందుకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. చిరంజీవి కెరీర్‌లో ఇది మరో గొప్ప ఘట్టం. 2024లో ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం లభించడంతో పాటు, నటుడిగా సాధించిన అద్భుత విజయాలకుగాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు కూడా దక్కింది. చిన్న చిన్న పాత్రలతో మొదలైన చిరంజీవి ప్రయాణం భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన నటుల్లో ఒకరిగా ఎదిగే వరకు అద్భుతంగా సాగుతోంది. ఆయన ప్రయాణం ఎంతోమంది కొత్త నటులు, దర్శకులకు ప్రేరణగా నిలుస్తోంది. ఇటీవల చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం రిజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం దర్శకుడు బాబీతో ఒక కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. అలాగే భారీ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌ గా శివాజీ

హీరో శివాజీకి తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డుని ప్రకటించింది. తాజాగా గద్దర్ అవార్డుల లిస్ట్‌ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ‘దండోరా’ చిత్రం పలు అవార్డుల్ని కైవసం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘దండోరా’ చిత్రం అవార్డుల్ని కొల్లగొట్టింది. శివాజీ కనబర్చిన అత్యుత్తమ నటనకు ఈ అవార్డు దక్కింది. ‘దండోరా’ చిత్రంలో శివాజీ పలు రకాల లేయర్స్, ఎమోషన్స్ ఉన్న పాత్రను ఎంతో గొప్పగా పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేలా శివాజీ పాత్రను తీర్చారు. ఇక కుల వ్యవస్థ గురించి శివాజీ చెప్పే డైలాగ్స్ కూడా ఆడియెన్స్‌ని ఆలోచింపజేశాయి. ‘దండోరా’లో శివాజీ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచిందని విమర్శకుల ప్రశంసలు, ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. శివాజీకి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా గద్దర్ అవార్డుని ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తమ నటిగా రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్ లో మరో ఘనతను దక్కించుకుంది. తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో “ది గర్ల్ ఫ్రెండ్” చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డ్ గెల్చుకుంది. ప్రేమికుడి షరతులన్నీ పక్కనపెట్టి తనదైన స్వేచ్ఛను కోరుకునే యువతిగా రష్మిక నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. బాక్సాఫీస్ వద్ద “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా మంచి వసూళ్లను సాధించింది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు.

Related posts