తెలంగాణ సినిమా అభివృద్ధి చేయడమే లక్ష్యం!

The goal is to develop Telangana cinema!
Spread the love

అవార్డులు అక్కడ ఇక్కడ పంచుకోవడానికి కాదు!
ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులు ఇస్తే ఇంకో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలనేది సీనియర్ నటులు మురళీమోహన్ మాట. ఒకే సినిమాకు ఒకే ఏడాదిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇస్తే బావుండదనేది ఆయన మాట!
ఎందుకు బావుండదు? ఇది నామాట!
‘పుష్ప’ అర్జున్ కు జాతీయ పురస్కారం వచ్చింది! పుష్ప 2కు తెలంగాణ గద్దర్ సినిమా అవార్డు వచ్చింది! అయితే తప్పేంటి? జాతీయ పురస్కారం వచ్చిన సినిమా రాష్ట్ర పురస్కారం తీసుకోకూడదా? తెలంగాణ పురస్కారం తీసుకున్న సినిమా ఆంధ్రప్రదేశ్ సినిమా అవార్డుకు పనికి రాదా?
అసలు తెలంగాణ సినిమాలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమిటనేదేగా అసలు సమస్య! ఒక సంవత్సరం ఇక్కడ, ఒక సంవత్సరం అక్కడ పంచుకోవడానికి కాదు తెలంగాణలో సినిమా అవార్డులు ప్రవేశ పెట్టింది! తెలంగాణలో తెలంగాణకు సంబంధించిన సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలనేది లక్ష్యం! రెండు ప్రభుత్వాల అవార్డులు పంచుకోవడానికి కాదు! చిన్న సినిమా అయినా సరే, తెలంగాణ సినిమాను ప్రోత్సహించి తెలంగాణ వారిని ఎక్కువ మందిని ఆకర్షించాలనే ప్రయత్నం!
ఇప్పటికే తెలంగాణ సినిమాను ప్రోత్సహించకుండా కెసిఆర్ పదేళ్లు వృధా చేశారు! ఒక మంచి సినిమాను ప్రోత్సహించడంలో భాగంగా మధ్యప్రదేశ్ లో ఇస్తున్నట్లుగా ఇక్కడ కూడా భారీ సబ్సిడీ ఇచ్చి ఉంటే ఇప్పటికే బలగం, మల్లేశం లాంటి సినిమాలు ఇంకా వచ్చి ఉండేవి! తెలంగాణ సినిమా అంటే ఫిదాలో మాదిరిగా ఒక పాత్రతో తెలంగాణ యాస పలికించడం కాదు! తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూనే 24 క్రాఫ్ట్స్ లో తెలంగాణ వారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యం! పూణే తరహా ఒక పెద్ద సినిమా ఇన్-స్టిట్యూట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది!
చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి బి.నరసింగరావు గారి లాంటి మహా దర్శకుడ్ని పురస్కారాల విషయంలో విస్మరించడం దారుణం కదా అన్నారు! నిజమే మాభూమి, రంగుల కల లాంటి తెలంగాణ సినిమాలను 40 ఏళ్ల క్రితమే తీసి చూపించిన మహా దర్శక రచయిత కవి బి.నరసింగరావు! ఆయన్ని జ్యూరీ సభ్యులు ప్రత్యేకంగా పైడి జైరాజ్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే రఘుపతి వెంకయ్య పురస్కారం కోసం మురళీ మోహన్ ను ఎంపిక చేశారు. జ్యూరీ చైర్మన్ గా వున్న తాను పురస్కారం తీసుకోకూడదు అని మురళీ మోహన్ నిరాకరించారు! అసలు గద్దర్ సినిమా పురస్కారాల విధి విధానాల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించిన బి.నరసింగరావు ఈ ఏడాది తాను పురస్కారాలకు దూరం అని ఎప్పుడో ప్రకటించారు. కమిటీలో ఉండి పురస్కారం తీసుకోకూడదనేది వారి ఆలోచన! ఆనాటి కాలపు నైతిక విలువలు పాటించే పెద్దలు వారు! ఎక్కడా ఏ విషయంలోనూ రాజీ పడలేరు!
సినిమాలు చూడకుండా అవార్డులు పంచిపెట్టారని నేను రాసిన మాటలకు కొందరు జ్యూరీ సభ్యులు నొచ్చుకున్నారు! లాటరీ ప్రకారం వారికి కేటాయించిన ఆయా సంవత్సర సినిమాలను ఎవరికి వారు ఇళ్లల్లో చూసి ఒక్కొక్కరు పది సినిమాలను ఎంపిక చేస్తే, అందరూ సభ్యులు కూర్చుని తర్జన భర్జనల మధ్య సంవత్సరానికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసినట్లు కొందరు వివరించారు. మొత్తానికి చూసే ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇక, 2024వ సంవత్సరానికి స్క్రీనింగ్ జరిగింది కాబట్టి ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు! ఇక అవార్డులు అనేవి ఎవరికి వస్తాయో ఎవరికి రావో అది జ్యురీ సభ్యుల ఇష్టం! దానిపై వాదన ఏదీ లేదు! కొన్ని తెలంగాణ సినిమాలను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శ అయితే గట్టిగానే వినిపిస్తోంది!
– డా. మహ్మద్ రఫీ

Related posts

Leave a Comment