* దర్శకుడు భారతీరాజా (1941-2026)
* తెలుగులోనూ తనదైన ముద్ర * సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం
సినిమాకు కథ, కథనాలు ఎంత ముఖ్యమో ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలన్న విజన్ కూడా అంతే ముఖ్యం. దర్శకుడి ప్రతిభ బయటపడేది ఇక్కడే. ప్రతి చిత్రం పైనా తనదైన ముద్ర వేసే భారతీరాజా భారతీయ సినీ ప్రపంచంలో గ్రామీణ జీవితానికి కొత్త భాషను నేర్పిన దర్శకుడు. పల్లె అందం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధాలు – ఆనందాలు, బాధలు – భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మట్టివాసనతో నిండిన ఓ జీవనరాగంలా అనిపిస్తుంది. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృద్యంగా, ప్రకృతిని పాత్రగా మలిచిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అందుకే భారతీరాజా కేవలం ఒక దర్శకుడు కాదు… భావోద్వేగాలకు దృశ్యరూపమిచ్చిన ఓ గొప్ప కథకుడు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోలను చూపించడం, ఎలాంటి అదనపు సొగసుల జోలికి వెళ్లకుండా సహజంగా ఉన్న అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేయడంతో అప్పటి సినీ సంప్రదాయాలను తిరగరాశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారతీరాజా (84) బుధవారం ఉదయం చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1941 జులై 17న తేని జిల్లా అల్లి నగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్. చిన్నప్పటినుంచే కళలపై ఆసక్తి ఉన్నప్పటికీ, సినిమా రంగంలోకి రావడం సులభం కాలేదు. కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కనగల్, పి.పుల్లయ్య వంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి సినిమాలో మెలకువలు నేర్చుకున్నారు. అలా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1977లో వచ్చిన ‘16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ అయ్యింది) సినిమాతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటివరకు కేవలం స్టూడియో సెట్టింగులకే పరిమితమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి లొకేషన్లలోకి తీసుకెళ్లి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
భారతీరాజా భారతీయ సినీ ప్రపంచంలో ‘సీతాకోక చిలుక’లోని ఒక షాట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ట్రాలీ షాట్స్ ఎప్పటి నుంచో ఉన్నా, రౌండ్ ట్రాలీ అనేది తర్వాత వచ్చింది. అది లేని రోజుల్లోనే భారతీరాజా తీసిన షాట్ ఒకటి ప్రత్యేకం. రఘు(కార్తిక్), కరుణ (అరుణ) తమ పేర్లు ఉన్న చెట్టు దగ్గర కలుస్తారు. ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా..’ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఆ షాట్ తీసేటప్పుడు లొకేషన్‌లో కెమెరామెన్, హీరో, హీరోయిన్ తప్ప ఎవరినీ ఉండనీయలేదు. దుప్పటిపై కెమెరామెన్‌ను పడుకోబెట్టి, నలుగురు బలమైన వ్యక్తులతో అతడిని పైకి లేపి, హీరో, హీరోయిన్ చుట్టూ తిరుగుతూ షాట్ తీయించారు. ఇలాంటి ప్రయోగాలు భారతీరాజా కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి.
తమిళంలో అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన.. తెలుగులోనూ తనదైన ముద్ర వేశారు. ప్రేక్షకులకు మర్చిపోలేని క్లాసిక్స్‌ను అందించారు. హరి ప్రసాద్, సుహాసిని కీలక పాత్రల్లో ‘కొత్త జీవితాలు’ మూవీతో తెలుగులో మెగాఫోన్ పట్టిన ఆయన.. సుహాసినిని ఇక్కడి చిత్రసీమకు పరిచయం చేశారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘పుదియ వార్పుగళ్’కు ఇది రీమేక్. ఇక ఆ తర్వాత ఆయన తీసిన ‘సీతాకోక చిలుక’ ఎవర్‌గ్రీన్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే క్లాసిక్. మాస్ హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవితో ‘ఆరాధన’ తీసి ఆయనలోని ఓ కొత్త నటుడిని వెండితెరపై ఆవిష్కరించారు. సీనియర్ నటుడు కృష్ణతో ‘జమదగ్ని’ తీశారు. 80వ దశకంలో సినీ సంగీత ప్రియులను ఓ ఊపు ఊపేసిన సినిమాల్లో ‘సీతాకోక చిలుక’ స్పెషల్. కార్తిక్, అరుణ, శరత్‌బాబు, సిల్క్ స్మిత కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రేమకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకు, కులం, మతం అడ్డుకావని చెబుతూ నాటి సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు దాటి ఓ ప్రేమ జంట ఎలాంటి నిర్ణయం తీసుకున్నదన్నది ఈ చిత్రం. జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా పాటలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ‘సాగర సంగమమే.. ప్రణయ సాగర సంగమమే..’, ‘మాటే మంత్రము, మనసే బంధము’, ‘అరె ఏమైందీ.. ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..’ ఈ పాటలన్నీ వింటుంటే మనకు ఇళయరాజా గుర్తొస్తారు. కానీ, ఇలాంటి క్లాసిక్ సాంగ్స్ ఇవ్వాలంటే, ప్రకృతి అంత రమణీయమైన మనసు.. ప్రేమపై ‘ఆరాధన’ భావం.. వాటిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించేతత్వం కలిగిన దర్శకుడికే అది సాధ్యం. అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులకు వాటిని అందించిన సృజనాత్మక దర్శకుడు భారతీరాజా. ‘16 వయతినిలే’ తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి, చంద్రమోహన్, మోహన్‌బాబు కీలక పాత్రల్లో నటించారు. కమల్, శ్రీదేవి నటించిన ‘సిగప్పు రోజక్కల్’, ‘ఎర్ర గులాబీలు’గా అనువాదమై, ఇక్కడా విజయం సాధించింది. తమిళంలో భారతీరాజా తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయి, హిట్ కొట్టాయి. ‘కిళక్కే పోగుం రైల్’ను తెలుగులో బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్ళే రైలు’గా తీశారు. శివాజీగణేశన్, రాధతో రూపొందించిన ‘ముదల్ మారియాదై’ తెలుగులో ‘ఆత్మబంధువు’గా అలరించింది. ‘మన్ వాసనై’ చిత్రం తెలుగులో బాలకృష్ణ హీరోగా కోడిరామకృష్ణ తీసిన ‘మంగమ్మగారి మనవడు’గా, శిష్యుడు భాగ్యరాజ్ అందించిన ‘ఒరు ఖైదియన్ డైరీ’ కథను తెలుగులో కమల్ ‘ఖైదీ వేట’గా వచ్చి అలరించాయి. ఇదే కథను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా ‘ఆఖరీ రాస్తా’గా తీసి, విజయం సాధించారు. భారతీరాజా తన ప్రయోగాత్మక చిత్రం ‘నిళల్గళ్’ (1980), యాక్షన్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’ (1981) లతో తన బహుముఖ ప్రజ్ఞను, ఒకే శైలికి పరిమితం కాకపోవడాన్ని నిరూపించుకున్నారు . కానీ నిస్సందేహంగా, గ్రామీణ ఇతివృత్తాలే ఆయనకు ప్రధాన బలం. ఎందుకంటే 1980లలో ఆయన అతిపెద్ద విజయాలైన ‘అలైగళ్ ఓవతిల్లై’ (1981), ‘మన్న వాసనై’ (1983), ‘ముత్తల్ మరియతై’ (1985) వంటి చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో సాగే బలమైన ప్రేమకథలే. కేవలం గ్రామీణ చిత్రాలకే పరిమితం కాకుండా, ‘సిగప్పు రోజాక్కల్’ (తెలుగులో ఎర్ర గులాబీలు) వంటి సైకో థ్రిల్లర్ చిత్రాలతో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ (1981) చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన తీసిన ‘వేదం పుదిదు’ సినిమా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. రాధిక, రాధ, రేవతి, కార్తీక్, విజయశాంతి వంటి ఎందరో నటీనటులను ఆయనే వెండితెరకు పరిచయం చేశారు. భారతీరాజా తన సినిమాల్లో ఎక్కువగా పల్లెటూరి కథలనే చూపించేవారు. మట్టివాసనను వెండితెర పైకి తెచ్చిన దర్శకుడిగా ఆయనకు పేరుంది. భారతీరాజా ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. ఆయన తన కెరీర్‌లో దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించి, ‘ఇయక్కునార్ ఇమయం (దర్శక శిఖరం)’ అనే బిరుదును పొందారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఇందులో తెలుగు చిత్రం ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు కూడా ఉంది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2004లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. వీటితో పాటు 4 ఫిలింఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా నటుడిగానూ అలరించారు. ‘ఆయుధ ఎళుతు’, ‘పాండియనాడు’, ‘తిరుచిత్రంబలమ్’ (తిరు), గతేడాది వచ్చిన విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మోహన్‌లాల్ ‘తుడరుమ్’లో చివరిసారి తెరపై కనిపించారు. అలాగే ఆయన నటించిన ‘పులవర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సిఉంది. ఇదే నటుడిగా ఆయనకు చివరి సినిమా. భారతీరాజా తర్వాతితరం చిత్రనిర్మాతలకు శిక్షణ ఇవ్వడానికి ‘భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సినిమా’ని స్థాపించారు. అందులో ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నారు. ఎప్పుడు ఏ వేదిక పైకి వచ్చినా ‘నా ప్రియమైన తమిళ ప్రజలారా’ అంటూ పలకరించే ఆయనను కోల్పోవడంతో చిత్రసీమలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసినట్లైంది. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన భారతీరాజా అధికంగా తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించగా తెలుగులో చాలావరకు రీమేక్ అయ్యాయి. ఆయన శిష్యులు అనేకమంది దర్శకులుగా మారారు. వారిలో తెలుగు నుంచి సీనియర్ వంశీ వంటి వారు ఉన్నారు. రాధ, రాధిక, రేవతి, ముచ్చర్ల అరుణ, కార్తీక్ వంటి నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. నాటి వర్ణ వివక్షను ఎదురొడ్డి చిత్రసీమలో నిలిచిన భారతీరాజా అనతి కాలంలోనే దేశం గర్వించే దర్శకుడిగా ఎదిగారు. కొన్నాళ్ల క్రితం దర్శకత్వానికి రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆయన పలు చిత్రాల్లోనూ నటించారు. చివరగా మోహన్ లాల్ ‘తుడరుమ్’ చిత్రంలో నటించారు. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. సృజనాత్మక చిత్రాల సృష్టికర్త భారతీరాజా కన్నుమూయడంతో తమిళ, సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా గారి మరణం భారతీయ సినిమాకు తీరని లోటు.

