ధనుష్ రఘుముద్రి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘తంత్ర’. క్రియేటివ్ ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ రోజే వచ్చింది. మరి సినిమా ఎలావుందో చూద్దాం…
కథ: రేఖ(అనన్య నాగళ్ల)… తల్లిలేని ఓ గ్రామీణ అందమైన యువతి. రేఖ పుట్టగానే తల్లి రాజ్యలక్ష్మి(సలోని) మరణిస్తుంది. కాలేజీలో చదువుకుంటూ తన స్నేహితులైన తేజు(ధనుష్ రఘుముద్రి), శైలు(కుషాలిని), మరొకవ్యక్తి(శరత్ బరిగిలె)లతో చాలా సరదాగా గడిపేస్తూ ఉంటుంది. అయితే ఇంట్లోనూ, కళాశాలకు వెళ్లే సమయంలోనూ తనకు ఎవరికీ కనిపించని కొన్ని శక్తులు కనిపిస్తూ ఉంటాయి. అందుకే రాత్రిళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే తెగ భయపడిపోతూ ఉంటుంది. రాత్రిపూట నిద్రలో నడుచుకుంటూ ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్లిపోవడం, తనను ఎవరో కొన్ని తాంత్రిక శక్తులతో వేధిస్తుండటంతో భయపడిపోతూ ఉంటుంది. చివరకు తన గ్రామంలో ఉండే ఓ ముస్లిం బాబాను కలిసి తనను వేధిస్తున్న క్షుద్ర శక్తుల నుంచి కాపాడాలని వేడుకుంటుంది. తాంత్రిక శక్తులతోనూ, క్షుద్ర శక్తులతోనూ వేధించబడుతున్న రేఖ… చివరకు ఎలా వాటి నుంచి బయటపడింది? అసలు రేఖ నేపథ్యం ఏమిటి? వాళ్ల తల్లి రాజ్యలక్ష్మి ఎందుకు చనిపోతుంది? రేఖ తండ్రి ఎలాంటి వారు? ఇందులో క్షుద్రపూజలు చేసే మాంత్రికుడు విగతి(టెంపర్ వంశీ)కి, రేఖకి సంబంధం ఏమిటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమాలు చూడాల్సిందే.
విశ్లేషణ: సినిమా ఆద్యంతం ఎక్కడా ఆడియన్స్ బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా ఉంటుంది. అనన్య నాగళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో తాంత్రిక విద్యలతో కొన్ని ఎపిసోడ్స్ ను చూపించి… సెకెండాఫ్ లో క్షుద్రపూజలతో రక్తికట్టించారు సినిమాని. అయితే కొన్ని ఎపిసోడ్స్ సాగతీతలా ఉండటంతో అక్కడక్కడ సినిమా కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. కథనాన్ని ఆసక్తిగా చెప్పడానికి కొన్ని ఘటనలను ఆరు(రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, ఛిన్నామస్తా దేవి) విభాగాలుగా ఎంచుకుని సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. ఈ విభాగాలు మీద రాసుకున్న ఎపిసోడ్స్ అన్నీ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ముఖ్యంగా వజ్రోలి రథి.. ఎపిసోడ్ ను టెంపర్ వంశీ, సలోని మీద తీసిన తీరు ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తుంది. రామాయణంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు, క్షుద్రదేవత అయిన నికుంబళ దేవికి పూజ చేస్తున్నపుడు లక్ష్మణుడు… ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేసి ఇంద్రజిత్తు తలపెట్టిన క్షుద్రపూజను భగ్నం చేస్తాడు… ఇలా పురాణాల్లో కూడా క్షుద్రపూజలు చేసేవారని, అప్పట్లోనూ క్షుద్రదేవతలున్నారని చెబుతూ ‘తంత్ర’మూవీలో ప్రధాన ప్లాట్ ఏంటో సినిమా ప్రారంభంలోనే రివీల్ చేసి… సినిమా ఏ పంథాలో సాగుతుందనేది ఆడియన్స్ కి హింట్ ఇచ్చేశారు దర్శకుడు. గ్లామర్ బ్యూటీ అనన్య నాగళ్ల సినిమా మొత్తం అన్నీతానై సినిమాను ముందుకు నడిపించింది. హారర్, గ్లామర్ పాత్రల్లో బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పటి లాగే తనదైన శైలిలో నటించి యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఆమెకు జోడీగా నటించిన ధనుష్ రఘుముద్రి కూడా మొదటి సినిమానే అయినా బాగా నటించి మెప్పించారు. అమాయకమైన పాత్రలో, అనన్యకు పెయిర్ గా ఫర్ ఫెక్ట్ గా సూట్ అయ్యారు. క్షుద్రపూజలు చేసి… అమ్మాయిలను వశం చేసుకునే భయంకరమైన మాంత్రికుడి పాత్రలో టెంపర్ వంశీ ఆక్టుకున్నాడు. ఇప్పటి వరకు రౌడీ పాత్రలను పోషించిన వంశీ… ఇందులో మాంత్రికుడి పాత్ర పోషించి మెప్పించారు. చాలా కాలంత రువాత ‘మర్యాదరామన్న’ బ్యూటి సలోని ఇందులో నటించింది. ఉన్నది కాసేపే అయినా… తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాసుకున్న స్టోరీ దాన్ని ముందుకు నడిపించేందుకు రాసుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తిరంగా ఉన్నాయి. ఎక్కడా ఆడియన్ బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా మెయిన్ ప్లాట్స్ ను రాసుకున్నారు. అలాగే చివరి దాకా సస్పెన్స్ కూడా తీసుకెళ్లి… ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచారు. ఇలాంటి హారర్ సినిమాలకు నేపథ్య సంగీతమే ప్రధాన బలం. అలాంటిది ఈ సినిమాకి సంగీత దర్శకుడు వంద శాతం న్యాయం చేశారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా ఉన్నతంగా నిర్మించారు. మొత్తం మీద సినిమా చూస్తున్న ప్రేక్షకుల ఒళ్లు జలదరించడం ఖాయం. సో.. వాచ్ ఇట్ …
రేటింగ్: 3/5