ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భారతీరాజా కన్నుమూత

Renowned director Bharathiraja passes away.
Spread the love

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు భార‌తీరాజా (84) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యం, వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధప‌డుతున్న‌ ఆయ‌న బుధ‌వారం ఉద‌యం ప‌రిస్థితి విష‌మించడంతో చెన్నై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1941 జులై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు. ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ‘మంగమ్మగారి మనవడు’కు కథను, ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడురమ్’ సినిమాలో భారతీరాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. గతేడాదిలో ఆయన తనయుడు, నటుడు మనోజ్‌ భారతీరాజా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుంగిపోయారు. ఈ విషాదం తర్వాత చాలామంది ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. కుమారుడు మ‌నోజ్ హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డం భార‌తీరాజాను తీవ్రంగా క‌లిచి వేసింది. ఆపై రెండు మూడు నెల‌ల్లోనే ఆ ఆవేద‌న‌తో అనారోగ్యం బారిన ప‌డిన ఆయ‌న హాస్పిటల్‌‌లో నెల రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని మూడు నెల‌ల క్రిత‌మే ఇంటికి వ‌చ్చి అక్క‌డే చికిత్స పొందుతున్నారు. స‌డ‌న్‌గా బుధవారం ఉద‌యం స‌మ‌స్య తీవ్రం కావ‌డంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. త‌మిళ, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన భారతీరాజా అధికంగా తమిళ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా తెలుగులో చాలావ‌ర‌కు రీమేక్ అయ్యాయి. అంతేగాక కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని చిత్రాలు స్ట్రెయిట్‌గా తెలుగులో తీసి ఇక్క‌డా అదే ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నారు. ఆయ‌న శిష్యులు అనేక‌మంది ద‌ర్శ‌కులుగా మారారు. వారిలో తెలుగు నుంచి సీనియ‌ర్ వంశీ వంటి వారు ఉన్నారు. రాధ, రాధిక, రేవతి, ముచ్చర్ల అరుణ, కార్తీక్ వంటి న‌టులను చిత్ర ప‌రిశ్ర‌మ‌కు పరిచయం చేశారు. నాటి వర్ణ వివక్షను ఎదురొడ్డి చిత్రసీమలో నిలిచిన భారతీరాజా అనతి కాలంలోనే దేశం గర్వించే దర్శకుడిగా ఎదిగారు. కొన్నాళ్ల క్రితం ద‌ర్శ‌క‌త్వానికి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఆయ‌న ప‌లు చిత్రాల్లోనూ న‌టించారు. చివ‌ర‌గా మోహ‌న్ లాల్ ‘తుడ‌రుమ్’ చిత్రంలో న‌టించారు. స‌డ‌న్‌గా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో త‌మిళ‌, సినీ ప‌రిశ్ర‌మ షాక్‌ కు గురైంది. ఆయ‌న అభిమానులు, సినీ సెల‌బ్రిటీలు సామాజిక మాధ్య‌మాల ద్వారా సంతాపం తెలియ‌జేస్తున్నారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్
ప్రముఖ దర్శకులు భారతీరాజా కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపాన్ని ప్రకటించారు. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య శ్రీ చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది…’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పేర్కొన్నారు.

Related posts