– సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు
– ఘనంగా నటరాజ రామకృష్ణ 102వ జయంతి ఉత్సవాలు
పేరిణి నృత్య వికాసం కోసం జీవితం అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వం పద్మశ్రీ నటరాజ రామకృష్ణ అని తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. తారామతి బారాదరిని నటరాజ రామకృష్ణ ఆలోచనలతోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన గుర్తు చేశారు. పేరిణి, ఆంధ్ర లాస్య నృత్యాలను పునః సృష్టించి జాతికి అంకితం చేశారని, వారి సేవలు అజరామరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రనాట్యం సృష్టికర్త, పేరిణి పునరుద్ధరణ నాట్య గురు పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ 102వ జయంతి ఉత్సవాలు శుక్రవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు డా. అలేఖ్య పుంజాల కళాకారులను, పత్ర సమర్పకులను, పరిశోధకులను సత్కరించారు. నటరాజ రామకృష్ణ కు ఘన నివాళులు అర్పించారు. ఉత్సవాల ముగింపు సభకు విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు రవీంద్రభారతిలోకి ప్రవేశించగానే డా. రమా భరద్వాజ్ “అవతరణ” ప్రదర్శన జరుగుతోంది. తన కోసం ప్రదర్శన ఆపవద్దు అని చెప్పి ప్రేక్షకుల్లో కూర్చుని కాసేవు తిలకించారు. కళాకారులను అభినందించి మీడియాతో మాట్లాడి వెళ్ళారు.
కళాప్రపూర్ణ డా. నటరాజ రామకృష్ణ జయంతి ఉత్సవాలను ఉదయం 11 గంటలకు తారామతి బారాదరి రూపకర్త, పర్యాటక శాఖ మెంటార్ డా.చెన్నూరి ఆంజనేయరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. విశిష్ఠ అతిధిగా విచ్చేసిన తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ మాట్లాడుతూ కాలగర్భంలో కనుమరుగైన కాకతీయుల కాలం నాటి కళను ఆనాటి శిల్పాలను పరిశోధించి, నృత్త రత్నావళి గ్రంథాన్ని నిరంతరం అధ్యయనం చేసి అపురూప కళారూపం పేరిణి నాట్యాన్ని పునఃసృష్టించిన మహా నాట్య గురు నటరాజ రామకృష్ణ అని నివాళులు అర్పించారు. వారి స్ఫూర్తితోనే పేరిణి నృత్య వ్యాప్తికి అనేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక సిలబస్ తయారు చేయించి ప్రభుత్వ సంగీత కళాశాలల్లో ప్రామాణికంగా పేరిణి నాట్య కోర్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సభాధ్యక్షత వహించిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ ఆచార్య డా.అలేఖ్య పుంజాల మాట్లాడుతూ నిరంతరం అలుపెరుగని నాట్య సేవకు జీవితాన్ని అంకితం చేసిన గురుదేవులు నటరాజ రామకృష్ణకు సంగీత నాటక అకాడమీ సమర్పించిన ఘన నివాళి అని వివరించారు. వారి ప్రేమపూరిత నిండైన మానవీయ హృదయం, నాట్యం పట్ల అంకితభావం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం నటరాజ రామకృష్ణ పై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.
నటరాజ రామకృష్ణ నృత్య రీతుల వికాసం
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డా. కళాకృష్ణ శిష్యులు కుంభ హారతి నృత్యం ప్రదర్శించారు. అనంతరం డా. జొన్నలగడ్డ అనురాధ “పునరుజ్జీవనం – పునర్ వికాసం తెలుగు నాట నృత్య రీతులు – నటరాజ రామకృష్ణ చేసిన కృషి” అంశం పై కీలకోపన్యాసం చేశారు. శబ్దం నుంచి రసోత్పత్తి ఎలా పొందాలో నటరాజ రామకృష్ణ అద్భుతంగా పరిశోధనలు చేశారని, సంస్కృతం, సంగీతం నేర్చుకుంటేనే నాట్యంలో రాణి స్తారని తనకు అమూల్య సలహాలు అందించారంటూ తన అనుబంధాన్ని పంచుకున్నారు. పేరిణి వికాసం పై ఆర్.ఎల్.ఎన్.రమేష్, నటరాజ రామకృష్ణ పేరిణి శిక్షణా విధానం పై డా.పేరిణి కుమార్ ప్రసంగించారు. పేరిణి శబ్ద తరంగాలు అంశం పై డా.కళాకృష్ణ చేసిన అభినయ పూర్వక ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. ఆంధ్ర నాట్యం ఆవిర్భావ వికాసం గురించి డా. గంధం శంకరరావు పత్ర సమర్పణ చేయగా, నటరాజ రామకృష్ణ నృత్యరూప కల్పనల గురించి సాత్విక పెన్నా వివరించారు. నటరాజ నృత్యారామం మీర్ పేట పేరిణి శ్రీనివాస్ శిష్యులు నవగ్రహ స్తోత్రం ప్రదర్శించి అలరించారు. వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ, చైతన్యపురికి చెందిన నాట్యగురు పవన్ కుమార్ తన శిష్యులతో కలసి అర్ధనారీశ్వరం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. చిరంజీవి వేదాంత్ పేరిణి నృత్యం అబ్బురపరచింది. బెంగళూరు కు చెందిన ప్రముఖ నాట్య గురు డా.రమా భరద్వాజ్ “అవతరణ – ది స్టోరీ ఆఫ్ నాట్య” సోలో ప్రదర్శన కళ్ళను కట్టిపడేసి ఆలోచనలు రేకెత్తించింది. అంబడిపూడి మురళీకృష్ణ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణ. సంగీత నాటక అకాడమీ కార్యదర్శి బి.మనోహర్, ఆర్.వినోద్ కుమార్ పర్యవేక్షించారు.
– డా. మహ్మద్ రఫీ