బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీలు ప్రచారం చేశారు తప్పే! నేను సమర్ధించడం లేదు! కానీ, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక్క రాజకీయ నాయకులు మాత్రమే డబ్బులు సంపాదించాలన్న మాట! ఇంకెవరు సంపాదించినా కుదరదన్న మాట! చట్టం అంగీకరించదన్న మాట! ఒకసారి ఎమ్మెల్యే అయి ఒక సంవత్సరం పాటు వున్నా అతనికి పెన్షన్ తో పాటు అన్ని రాయితీలు వస్తాయి! గెలిచిన ప్రతిసారి పెన్షన్లు యాడ్ అవుతూ పెరుగుతూ ఉంటాయి! ఇక ఆ కాంట్రాక్టు పనులు, ఈ అభివృద్ధి పనులు అంటూ దోచుకోవడం షరా మామూలే! కానీ అడగకూడదు! వాటికి లెక్కలు కూడా ఉండవు! కమిషన్ లు, పిఅర్సీ కమిటీలు అంటూ ఏమీ లేకుండానే అప్పుడప్పుడు వాళ్ళకు వాళ్ళు శాసనసభలో జీతాలు పెంచేసుకుంటారు! రాయితీలు చట్ట రూపంలో మార్చేసుకుంటారు! అది రాజకీయ నాయకుల హక్కు!
ఇక ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఏ కొంతమందినో మంచివాళ్ళుగా నిజాయితీపరులుగా భావించాలి! మిగిలిన వాళ్లలో చాలామంది ఎంతో కొంత గిల్లుకుని ఇంట్లో ఏదొక మూల దాచుకునే వాళ్లే ఉంటారు! అప్పుడప్పుడు పట్టుబడటాలు, సస్పెండ్ అవడాలు మనం చూస్తూనే ఉన్నాం! వింటూనే ఉన్నాం! కొంతలో కొంత నయం! రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఉద్యోగులు నయం! కొద్దో గొప్పో భయం భయంగా సంపాదించుకుంటారు! గుడ్డిలో మెల్ల!
ప్రభుత్వ ఉద్యోగాలు లేని వాళ్ళలో చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాలు లాగిస్తూ ఉంటారు అతి కష్టంగా! తాతల నాటి క్షేత్రములతో కొనసాగే వాళ్ళు ఏదొక వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళుతుంటారు! సెలబ్రిటీలు తమ స్థాయిలో కష్టపడుతూనే ఉంటారు! ఏ రంగంతో పోల్చుకున్న ఈ దేశంలో రాజకీయ రంగమే సంపాదనకు భలే సుగమమైన రంగం!
ఇక అసలు విషయానికి వద్దాం! మన దేశంలో పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం! అయినా సరే ప్రభుత్వ అనుమతులతోనే బీడీలు, సిగరెట్లు, చుట్టలు అమ్ముతూనే ఉంటారు! సినిమా హాళ్ళలో యాడ్స్ వేస్తూనే ఉంటారు! కానీ, కొనుగోళ్లు ఏమాత్రం ఆగవు! అసలు నిషేధించి పడేయచ్చు! కానీ చేయరంతే! మద్యం అంతే! వాళ్లే అమ్మడానికి అనుమతి ఇస్తారు! మళ్ళీ వాళ్లే “ఊదు ఊదు” అంటూ చెక్ చేస్తూనే ఉంటారు! అదే కోవలో డ్రగ్స్, ప్లాస్టిక్, బెట్టింగ్స్, కోళ్ల పందేలు, గుట్కాలు ఇంకా ఇలాంటి చెత్త చెదారం అంతా!
ఇవాళ ఒక పాతిక మంది మీద కేసులు పెట్టారు! వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేశారు! అంటే వాళ్ళు ప్రచారం చేయగానే జనం ఎగబడ్డారన్న మాట! ఆ పాతిక మందిలో ఐదుగురు మినహా మిగిలిన వాళ్లంతా అంత జనాన్ని ఇన్-ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు అయితే కాదు! వాళ్ళ మాటలు నమ్మి జనం డబ్బులు పోగొట్టుకుంటారంటే నేను అయితే నమ్మడం లేదు! బెట్టింగ్స్ ఆడటం అలవాటు పడిన వాళ్ళు వారి జీవితాలను బలి చేసుకున్నారు! వీళ్ళు చెప్పారని మాత్రం దిగరు! జనం బాగా తెలివి మీరారు! బ్రాండ్ ప్రచారకర్తను చూసి ఫాలో అయ్యే రకాలు ఇప్పుడు చాలా తక్కువ ఉండొచ్చు!
నిజానికి ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను మన దేశంలో నిషేధించవచ్చు! కొన్ని బూతు సైట్స్ పై నిషేధం విధించిన మాదిరిగానే! కానీ చేయదు! ఆదాయం కావాలి! సిగరెట్ల నుంచి చెత్త అంతా కొనసాగించాలి! చట్టరీత్యా ఇలాంటివి నిషేధం అని చెబుతూనే వ్యాపారాలు జరిగిపోతుండాలి! బెట్టింగ్ యాప్స్ కు చిన్న చితక సెలబ్రిటీలు ప్రచారకర్తలుగా మారి కాస్త డబ్బులు సంపాదించుకున్నది నిజమే! అది అక్రమ సొమ్మే! అదే తప్పు అన్నమాట! రాజకీయ నాయకులు చేసే అవినీతి పై మాత్రం ఎవ్వరూ ప్రశ్నించలేం! పెద్ద పెద్ద స్కాముల్లో మునిగి తేలి వేలాది కోట్లు ఎగేసిన వాళ్ళను పట్టించుకోరు! బ్యాంకుల్లో వేలాది కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగగొట్టి ఏదొక ఎమ్మెల్యే గానో, ఎంపి గానో ఉంటే ఎవ్వరూ పట్టించుకోరు! ఒక సంస్థ సర్వే చేసి దేశం మొత్తం రాజకీయ నాయకుల్లో 66 శాతం మంది రౌడీలు, గూండాలు, స్కాముల వీరులు, వివిధ కేసుల్లో ఉన్నవారే అని తేల్చినా ఎవ్వరికీ పట్టదు! సెలబ్రిటీకి నోటీసులు ఇచ్చి విచారణ నిమిత్తం రెండు మూడు సార్లు స్టేషన్ కు పిలిపిస్తే అది ఉదయం నుంచి రాత్రి వరకు న్యూస్ మనకు! కళ్ళ ముందు జరిగే రాజకీయ దోపిడీ ని మాత్రం ప్రశ్నించలేం! అది ప్రజా సేవ! ఇది మాత్రమే అక్రమ సంపాదన!
నిజానికి ఇవి ఎవరికి వారు ఆలోచించుకుని స్వీయ నియంత్రణ పాటించాల్సిన విషయాలు! స్వచ్ఛందంగా కుటుంబంలో పెద్దలు పిల్లలను గమనిస్తూ మంచి చెడు చెబుతూ సక్రమ దారి చూపించాల్సిన అవసరం వుంది! ఇదంతా పెంపక లోపమే! ఇదంతా సెల్ ఫోన్ ఆడిస్తున్న గేమ్ మాత్రమే! బంధాలు అనుబంధాలు ఎప్పుడో మాయమైపోయాయి! అందరికి లక్జరి కావాలి! Eఈజీ మనీ కావాలి! ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకోవాలి! విపరీతంగా డబ్బు సంపాదించాలి! ఇదే ఇప్పుడు చాలామంది మైండ్ సెట్! ఈ మైండ్ సెట్ మారాలి! ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉండాలి! అప్పుడే న్యూసెన్స్ కు ఫుల్ స్టాప్!
-డా.మహ్మద్ రఫీ
ఇదంతా నాన్-సెన్స్ న్యూసెన్స్!
