ఆడలేక మద్దెల ఓడు!

press club hyderabad
Spread the love

ప్రెస్ క్లబ్ ఎన్నికలు అనంతర పర్యవసనాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయిన టీం తమ ఓటమిని అంగీకరించలేక బాలెట్ బాక్సుల్లో నీళ్లు పోసి, రిటర్నింగ్ ఆఫీసర్ ను అనేకగంటల పాటు నిర్భందించి దౌర్జన్యంగా తమకు కావలసినట్లుగా లెటర్ తీసుకున్నారు. బాత్ రూంకి కూడా పోనీయకుండా తనపై చేసిన దౌర్జన్యంనుంచి కాపాడుకోవడానికి వాళ్లకు కావలసినట్లుగా ఉత్తరం రాసిచ్చి బయటపడిన రిటర్నింగ్ ఆఫీసర్ బయటకు రాగానే ఆ విషయం పోలీసుస్టేషన్ లో రిపోర్ట్ చేసి గుండెనొప్పితో హాస్పిటల్ లో చేరారు. యాంజియో చేసి స్టెంట్ వేసుకున్న స్థితిలో ఆయన అనుమతితో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరునాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.
కానీ దొంగే దొంగ దొంగ అన్నట్లుగా గత దశాబ్దంగా ప్రెస్ క్లబ్ ను జలగలా పట్టిపీడిస్తున్న ఇంకో వృక్తితో కలిసి చేసిందంతా చేసిన మహానుభావుడు ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అక్రమాలు అంటూ అరుస్తున్నాడు. తన చేలాతో కోర్టులో కేసుకూడా వేశాడట.
ఇంతకూ వారు చేసిన ప్రధానమైన ఆరోపణలు రెండు. ఒకటి గల్లంతైన ‘తన ఓట్లు’. రెండు ఎన్నికలకు రెండు రకాల గుర్తులు వాడటం.
మొత్తం ఎన్నికల్లో పోల్ అయినవి 1114 ఓట్లు కాగా అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసిన ముగ్గురికీ వచ్చిన ఓట్లు ఇవి. వేణుగోపాల్ నాయుడు 489
సతీష్ కమాల్ 204
సూరజ్ భరధ్వాజ్ 409
చెల్లని ఓట్లు 11.
అయితే ఇవన్నీ కలిపితే 1113 మాత్రమే వస్తున్నాయి. అంటే ఎవరో ఒక ఓటరు వివిధ పదవులకోసం తనకు ఓటు వేయడానికి విడివిడి గా ఇచ్చిన ఎనిమిది బాలట్ పేపర్ల లో ప్రెసిడెంట్ పదవి కోసం ఇచ్చిన దానిమీద ఓటు వేసో, వెయ్యకుండానో దాన్ని చింపివేసో లేక తనతో పాటు తీసుకుని పోయో ఉండాలి. అది ఎలానో మిస్ అయింది. మొదటి ఇద్దరు అభ్యర్దుల మధ్య తేడా 80 ఓట్లు ఉన్నప్పటికీ ఆ ఒక్క ఓటు కోసం పట్టుపట్టి రెండుసార్లు రీకవుంటింగ్ చేయించాడు రెండో స్థానంలో ఉన్న వ్యక్తి. ఆ మిస్ అయిన ఓటు ఇప్పుడు గలభా చేస్తున్న వ్యక్తి కి తనదే అయిఉంటుందని నమ్మకం. వాదనకోసం కాసేపు అదే నిజం అనుకున్నా, గెలిచిన వ్యక్తికీ తనకూ ఇంకా 79 ఓట్లు తేడా ఉంది. ఇక్కడ గల్లంతయిందని భావిస్తున్న ఓటు ఒక్కటే. ఆయన అరుస్తున్నట్లుగా ‘ఓట్లు’ కావు.
ఓటమితో ఆగం ఆగం అయి కాసేపు రీకౌంటింగ్ డ్రామా నడిపిన వ్యక్తి హఠాత్తుగా ఎన్నికల గుర్తు అంటూ కొత్త వివాదం లేవనెత్తాడు.
ఏడుగంటలకు కౌటింగ్ మొదలయి పదకొండు కల్లా 16 పొజిషన్లకు కవుంటంగ్ పూర్తయి వరసగా తన వాళ్లంతా ఓడిపోయినప్పుడు 16 లో ముగ్గురు మాత్రమే గెలిచినప్పుడు కౌంటింగ్ రూంలోనే ఉండి పర్యవేక్షించి అంగీకరించిన వ్యక్తి తను ఓడిపోగానే, గంటకు పైగా రీకౌంటింగ్ డ్రామా నడిపి హఠాత్తుగా రెండు గుర్తులు వాడడం తప్పని కొత్తరాగం మొదలు పెట్టాడు. ఎన్నికల్లో బాలెట్ మీద వేయడానికి స్వస్తిక్ తో పాటుగా సరిపోయినన్ని ముద్రలు లేక ఒక రౌండ్ గుర్తు కూడా పెట్టారు. అది పెట్టటం తప్పట. ముద్ర అనేది ఒక డివైస్ మాత్రమే అని తను ఎన్నుకోదలిచిన వ్యక్తికి టిక్ కొడితే కూడా దాన్ని అంగీకరించవచ్చని అనేక కోర్టు తీర్పులు ఉన్నాయి. ఒకవేళ అది సరైంది కాదనిపిస్తే మొదటి ఈసీ లెక్కింపు అప్పుడే అభ్యంతరం చెప్పిఉండాలి. అది పరిష్కారం అయ్యాకే లెక్కింపు జరిగేది. అంత సేపు ఊరుకుని 16 మంది ఫలితాలు ప్రకటించే దాకా ఊరుకుని అప్పుడు ఆ విషయం లేవదీయటం అంటేనే ఓటమిని తట్టుకునే సంస్కారం, హుందాతనం లేవని అర్థం. గెలిచిన వాళ్లు, ఓడినవాళ్లు షేక్ హాండ్ ఇచ్చుకుని కలిసి బీరు తాగే సాంప్రదాయం ఉన్న ప్రెస్ క్లబ్ లో ఇలాంటి పరిణామాలు ఎంత దురదృష్ట కరం.
అయితే ఇది కేవలం ఉక్రోషమా? గత కమిటీలో తాను ట్రెజరర్ గా మరో జలగతో కలిసి చేసిన తప్పుడు ఆర్థిక వ్యవహారాలు బయట పడతాయన్న భయమా? ఇద్దరి వ్యక్తుల స్వార్ధానికి, చిల్లర రాజకీయాలకు మొత్తం జర్నలిస్టు కమ్యూనిటీకి చెందిన ప్రెస్ క్లబ్ ను బలి చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా?

Related posts

Leave a Comment