టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాల్లో ‘పెద్ది’ ఒకటి. రెండో సినిమానే రామ్‌చరణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం బుచ్చిబాబుకు రావడం, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కథానాయికగా నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం, జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివ రాజ్‌కుమార్ సహా చాలామంది నటీనటులు ఇతర కీలక పాత్రలలో నటించడం.. ఇలా అన్నీ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. సోలో హీరోగా రామ్‌చరణ్ హిట్టు అందుకొని ఎనిమిదేళ్లు దాటిపోయింది. కమర్షియల్ ఫార్ములాతో చేసిన ‘గేమ్ ఛేంజర్’తో పాటు గత సినిమాలు అంతగా ఈ మెగా హీరోకు అచ్చి రాలేదు. సక్సెస్ కోసం తన మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి రామ్‌చరణ్ చేసిన పాన్ ఇండియా చిత్రమిది. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్‌తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ ఏడాది టాలీవుడ్‌లోనే మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో ఒకటిగా జూన్ 4న పెద్ది ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్లింప్స్‌తోనే అంచనాలు పెంచేసిన చిత్రం ‘పెద్ది’. మరి ఆ అంచనాలను అందుకుందా? ‘పెద్ది’తో రామ్‌చరణ్‌కు బుచ్చిబాబు హిట్టు ఇచ్చాడా? బుచ్చిబాబు మేకింగ్ ఎలా ఉంది? తెలుసుకుందాం…
కథ : విజయనగరం జిల్లాలోని కొండ కింద ఉన్న ఊరిలో పుట్టి పెరిగిన వాడే పెద్ది (రామ్‌చరణ్). రోజూ విజయనగరం వెళ్లి కూలి పనులు చేసుకుంటుంటాడు. పేరుకి కూలీ అయినా క్రికెట్‌లో మాత్రం రాటు దేలిన ఆటగాడు. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగలిగిన మొనగాడైన పెద్దిని అంతా ఆట కూలీ అని పిలుస్తుంటారు. వందల మంది జీవనం సాగిస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో అతడి ఊరికి గుర్తింపు అన్నదే ఉండదు. అందుకే ఆ ఊరు అన్నా, అక్కడి నుంచి వచ్చిన మనుషులన్నా అందరికీ చిన్న చూపు. పెద్ది రాటు దేలిన ఆటగాడు కావడం వల్ల విజయనగరం, బొబ్బిలి క్రికెట్ జట్లు వేలంలో పెద్దిని కొనేందుకు పోటీపడుతుంటాయి. అలాంటి ఆటగాడు క్రికెట్‌ని వదిలి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? కొండకింద ఊరు, అక్కడి మనుషుల కోసం పెద్ది చేసిన పోరాటంలో అతను ఏం కోల్పోయాడు? ఏం సాధించాడు? పెద్ది ప్రయాణంపై అప్పలసూరి (జగపతిబాబు), గౌర్‌నాయుడు (శివరాజ్‌కుమార్) ఎలాంటి ప్రభావం చూపించారు? ఈ కథలో అచ్చియమ్మ (జాన్వీ కపూర్) ఎవరు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే..
విశ్లేషణ: కన్నతల్లిలాంటి తన ఊరికి, అక్కడ పుట్టి పెరిగిన మనుషులకూ గుర్తింపే లక్ష్యంగా పెద్ది ఎంత దూరం వెళ్లాడు? రెండు ఆటల్ని కలిపి ఆడే క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా ఎలా అవతరించాడన్నది ఇందులో కీలకం. 2016 ఒలింపిక్స్ క్రీడలు ముగింపు తర్వాత నుంచి ఈ కథ మొదలవుతుంది. కోల్‌కతా నుంచి విజయనగరం మీదుగా కొండ కింద ఊరికి ప్రయాణం చేస్తుంది. లోయలు, జలపాతాలు దాటి మరీ వెళ్లాల్సిన ఆ ఊరిని పరిచయం చేసిన తీరే కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఆట కూలీగా పెద్ది పరిచయంతో అసలు సిసలు సందడి మొదలవుతుంది. అతను ఆడే క్రికెట్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. క్రికెట్ చరిత్రలోనే లేని సరికొత్త షాట్స్ ఆడుతూ రక్తికట్టిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ప్రవేశం, ఆమె రాజకీయ ఎత్తుగడలు, ఆమె వెనక హీరో పడే సన్నివేశాలతో కథ నుంచి సినిమాని కాస్త పక్కకు తీసుకెళ్లాయి. అయితే, అప్పలసూరి చుట్టూ అల్లిన సన్నివేశాలతో కథలోని అసలైన సంఘర్షణ ఆవిష్కృతమవుతుంది. భావోద్వేగాలకు కావాల్సిన బలమైన పునాదిని ఆ సన్నివేశాలతోనే వేశాడు దర్శకుడు. గుర్తింపే తమ ఆత్మగౌరవం అని నమ్మి పోరాటం చేసిన ఓ క్రీడాకారుడి స్ఫూర్తిదాయక ప్రయాణమే ఈ చిత్రం. ఈ మధ్య అగ్ర తారల సినిమాలు అనగానే మితిమీరిన హీరోయిజం, ఎలివేషన్స్‌కే పెద్దపీట వేస్తుంటారు దర్శకులు. అందుకు భిన్నంగా గుర్తింపు లేని ఓ ఊరి కథని, అలాంటి ఊళ్లో పుట్టి పెరిగి తరాలకు స్ఫూర్తిని నింపిన ఓ క్రీడాకారుడి ప్రయాణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. క్రీడా నేపథ్యం లో ఇందులోనూ కొన్ని ఎలివేషన్స్ ఉన్నప్పటికీ అవన్నీ కథలో భాగంగానే అనిపిస్తాయి తప్ప ఎక్కడా తెచ్చిపెట్టినట్టు అనిపించవు. తన ఊరితో పాటు జాతిని గెలిపించడం కోసం ఓ ఆటగాడు సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చాలా వరకు లాజిక్‌లకు దూరంగా సాగుతాయి. క్లైమాక్స్‌లో హీరో గెలవడం ఈ జానర్ సినిమాల్లో కామన్‌గా కనిపిస్తుంది. వాటికి భిన్నంగా రియలిస్టిక్‌గా పెద్ది సాగుతుంది. ఇందులో ఒకే ఆటను కాకుండా క్రికెట్, రెజ్లింగ్‌తో పాటు రన్నింగ్ గేమ్‌ను చూపించాడు. ఈ గేమ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్లు ఫ్యాన్స్‌ను మంచి కిక్ ఇస్తాయి. ముఖ్యంగా రెజ్లింగ్ సీన్లలో చరణ్‌లోని హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించాడు డైరెక్టర్. ఇద్దరు రెజ్లర్లతో ఒకేసారి ఫైట్ చేసే యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయింది. పెద్ది క్లైమాక్స్ గురించి అందరూ మట్లాడుకుంటారని చిత్రబృందం పలు ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చెబుతూ వచ్చింది. బుచ్చిబాబు కూడా క్లైమాక్స్‌నే ఎక్కువగా నమ్ముకున్నట్లుగా కనిపించింది. పతాక ఘట్టాలను ఎమోషనల్‌గా రాసుకున్న తీరు బాగుంది. రీసెంట్ టైమ్‌లో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ ఇదే అని చెప్పవచ్చు. దర్శకుడు బుచ్చిబాబు సానా మితిమీరిన మాస్ ఎలివేషన్ల జోలికి వెళ్లకుండా, కథలోని అంతర్లీన భావోద్వేగాలను నమ్ముకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2016 ఒలింపిక్స్ ముగింపు ఘట్టంతో ప్రారంభమయ్యే ఈ కథ, కోల్‌కతా నుండి విజయనగరం లోయల మీదుగా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఫస్టాఫ్ లో పెద్ది ఆడే సరికొత్త క్రికెట్ షాట్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తాయి. హీరోయిన్ ట్రాక్ వల్ల కథ కాస్త పక్కదారి పట్టినట్లు అనిపించినా, అప్పలసూరి (జగపతిబాబు) పాత్ర ప్రవేశంతో కథలో అసలైన సంఘర్షణ మొదలై ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయే రేంజ్‌లో పేలుతుంది. విరామానికి ముందు వచ్చే రెండు బలమైన ఘట్టాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. విరామానికి ముందు వచ్చే రెండు బలమైన ఘట్టాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళతాయి. ఆట మారిన తీరు చాలా సహజంగా కుదిరింది. విరామం తర్వాత కుస్తీ నేపథ్యంలో సన్నివేశాలు సినిమాకి మరింత కీలకం. ఆ పోరాట ఘట్టాల్ని కొరియోగ్రఫీ చేసిన విధానమూ ప్రత్యేకంగా ఉంది. క్రాస్ ఓవర్ అథ్లెట్ నేపథ్యం గురించి అక్కడ పరిచయం చేయడం, క్రికెట్‌నీ, కుస్తీని కలిపి మైదానంలో హీరో చెలరేగిపోయే తీరు పైసా వసూల్. ఇక కుస్తీ నేపథ్యంలో డ్రామా, ఆస్పత్రి సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. కమర్షియల్ సినిమా చేయడానికి చాలా మంది హీరోలున్నారు.. కానీ కథ నడిపించే సినిమా చేయాలంటే కమర్షియల్ హీరోకు ధైర్యముండాలి. ఆ ధైర్యం చేసాడు రామ్ చరణ్.. పెద్ది సినిమా కాదు ఓ ఎక్స్‌పీరియన్స్. బుచ్చిబాబు సినిమా తీయలేదు.. ఓ అద్భుతమైన ఎమోషనల్ కథ చెప్పాడు. సినిమాలో హై మూవెంట్స్ కోసం వెతకొచ్చు కానీ కథలో ఎత్తులు పల్లాలు రెండూ ఉంటాయి. పెద్ది అలాంటి ఓ అందమైన కథ. ఇందులో ఎత్తులే ఉన్నాయని చెప్పలేము.. పల్లాలు కూడా ఉన్నాయి. కానీ ఆ లోతుల్ని మరిపించేలా పెద్దిని చివర్లో పై ఎత్తులో కూర్చోబెట్టాడు బుచ్చిబాబు. తీసుకున్న కథ పాతదే.. గుర్తింపు కోసం ఓ కుర్రాడు చేసే పోరాటమే ఈ సినిమా. తన పోరాటానికి ఆటను ఆయుధంగా, అస్త్రంగా వాడుకుంటాడు. పెద్ది గాడు తన ఆటతో ఏం చేసాడు.. ఊరి భవిష్యత్తు ఎలా మార్చేసాడు అనేది ఈ చిత్ర కథ. చెప్పడానికి చాలా సింపుల్ కానీ.. బుచ్చిబాబు దీన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది.

ఎవరెలా చేశారేంటే …రామ్ చరణ్ మరోసారి కథని బలంగా నమ్మి చేసిన సినిమా ఇది. రెండు మూడు కోణాల్లో కనిపిస్తూ ఆయన ఇందులో ఒదిగిపోయిన తీరు బాగుంది. ముఖ్యంగా కుస్తీ క్రీడాకారుడిగా కనిపించేందుకు శారీరకంగా తనని తాను మార్చుకున్న తీరు, పోరాట సన్నివేశాల్లో ఆయన పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఇది. క్రికెటర్‌గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్‌గా మూడు విభిన్నమైన పాత్రలతో కనిపించిన చరణ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. బలమైన అభిమానగణం ఉన్న ఓ కమర్షియల్ హీరో ఇలాంటి కథని నమ్మి చేయడం అరుదు. మూడో ఆట నేపథ్యంలో సన్నివేశాలు చేయడం రిస్క్ అనుకునే హీరోలే ఎక్కువ. కానీ, చరణ్ బలంగా కథను నమ్మారు . నిజానికి రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నాడు అంటే, కచ్చితంగా అది కమర్షియల్ హంగులు ఉన్న పక్కా కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైనర్ అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఇదే విషయాన్ని ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి దర్శకుడు బుచ్చిబాబు చెబుతూ వచ్చాడు. అయితే కొంతవరకు కమర్షియల్టీ కోసం పాటలు లాంటివి పెట్టినా సరే, ఇది పూర్తిస్థాయిలో ఒక స్టార్ హీరో చేయదగ్గ రొటీన్ సినిమా అయితే కాదు. కానీ ఇలాంటి కథను ఎంచుకోవడంలోనే రామ్ చరణ్ ధైర్యం కనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ ప్రకారం పెద్ద పెద్ద దర్శకులతో, హీరో ఎలివేషన్లతో ఎన్నో భిన్నమైన సినిమాలు చేయవచ్చు. కానీ ఒక క్రీడా నేపథ్యంతో యువతలో స్ఫూర్తిని కలిగిస్తూ సాగే ఇలాంటి కథను ఎంచుకోవడంలోనే రామ్ చరణ్ తొలుత సక్సెస్ అయ్యాడు అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాకి అందాన్ని తీసుకొచ్చింది. ప్రథమార్ధంలోనే ఆమె సందడి. ‘చికిరి’ పాటతో ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. జగపతిబాబు అప్పలసూరి పాత్ర, గెటప్ సినిమాకున్న ఆకర్షణల్లో ఒకటి. గౌర్‌నాయుడు పాత్రని డిజైన్ చేసిన తీరు, అందులో శివరాజ్‌కుమార్ చూపించిన హుందాతనం ఆకట్టుకుంటుంది. రావు రమేశ్, దివ్యేందు శర్మ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పేరున్న నటులు చాలామందే ఉన్నారు కానీ, ఆ పాత్రల ప్రభావం తక్కువే.

టెక్నికల్ టీం: సాంకేతికంగా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో ఉంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా, రత్నవేలు విజువల్స్ అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. ఆయన కెమెరా పనితనం సినిమాకి ప్రాణం పోసింది. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ తదితర విభాగాల పనితీరులోనూ ప్రమాణాలు కనిపిస్తాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా భావోద్వేగాలతో కూడిన ఓ మంచి కథని చెప్పారు. వాణిజ్యాంశాలకూ లోటు చేయలేదు. తెలుగు తెరపై అరుదుగా చూసే ఈ తరహా కథను ఆయన రాసుకోవడం ఎంత ప్రత్యేకమో, చరణ్ నమ్మి నటించడం కూడా అంతే ప్రత్యేకం. బుచ్చి రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. తెలుగు తెరపై అరుదుగా వచ్చే ఈ తరహా స్పోర్ట్స్ డ్రామాను నమ్మి తెరకెక్కించిన బుచ్చిబాబు సానాకు, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్‌కు అభినందనలు తెలపాల్సిందే. అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయినా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక మంచి హార్ట్ టచింగ్, స్ఫూర్తిదాయకమైన మూవీ చూడాలనుకునే వారికి ‘పెద్ది’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. (రేటింగ్ : 4.5/5)

‘పెద్ది’ మూవీ రివ్యూ.. స్ఫూర్తిదాయక ప్రయాణమే..!
