18 ఏళ్ల సమస్యను సాక్ష్యాధారాలతో వివరించిన JNJHS సభ్యులు
హైదరాబాద్ , నవంబర్ 3: గత 18 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న JNJHS సభ్యుల సమస్య పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి హామీ ఇచ్చారు. సమస్య తీవ్రతను, సభ్యులు సూచించిన పరిష్కార మార్గాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ మేరకు JNJHS సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిసి తమ సమస్యలను వివరించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను సాక్ష్యాధారాలతో కలెక్టర్‌కు అందజేశారు. సుప్రీంకోర్టు తుది తీర్పును ఉల్లంఘించకుండా, చట్టబద్ధమైన పద్ధతుల్లో ప్రభుత్వం JNJHS సమస్యను ఎలా పరిష్కరించవచ్చో అవసరమైన డాక్యుమెంట్లు, ఆధారాలతో వివరించినట్లు సభ్యులు తెలిపారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న కలెక్టర్.. సభ్యులు సూచించిన పరిష్కార మార్గాలను పరిశీలించి, వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. నిజాంపేట్‌లోని సర్వే నంబర్ 332లో JNJHSకు కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ సందర్శించి క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించి, సభ్యులకు మేలు జరిగేలా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తానని హామీ ఇచ్చారు. 18 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్య పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించడం పట్ల JNJHS సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

