శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

Dil Raju Attends Sri Pattabhiramachandra Swamy Temple Consecration Ceremony as Chief Guest
Dil Raju Attends Sri Pattabhiramachandra Swamy Temple Consecration Ceremony as Chief Guest
Spread the love

వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని J.S.R. నగర్‌లో నిర్మించిన శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారి ఆలయ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్‌రాజు సతీసమేతంగా హాజరయ్యారు. ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, శ్రీరాములు, హీరో వంశీకృష్ణ అందరి సమక్షంలో దిల్ రాజుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దిల్ రాజు ఆలయాన్ని సందర్శించి స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు.
నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ.. పోరుమామిళ్లలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరాములు ఆహ్వానం మేరకు కుటుంబంతో వచ్చినట్లు తెలిపారు. తమ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అంటే శ్రీరాముడే కదా అంటూ ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాల క్రితం ఆయన ప్రొద్దుటూరు, కడప, పోరుమామిళ్ల తదితర ప్రాంతాల్లో వ్యాపారం చేసినట్లు గుర్తు చేసుకున్నారు. శ్రీరాములు కుటుంబం గుడిని నిర్మించారు ఇక రాములవారి సేవను, భక్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత గ్రామస్తుల మీద ఉందని చెప్పారు. ఇంత పెద్ద మహత్తర కార్యాన్ని నిర్వర్తించిన శ్రీరాములు కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.
హీరో వంశీకృష్ణ మాట్లాడుతూ.. పిలవగానే హైదరాబాద్ నుంచి పోరుమామిళ్ళకు వచ్చిన దిల్ రాజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. సొంతూరులో ఆలయాన్ని నిర్మించడం మహాభాగ్యంగా భావిస్తూ ఇలాంటి ప్రోత్సాహం ఎల్లప్పుడూ గ్రామస్తులు నుంచి ఉండాలి అని కోరారు. భక్తి మార్గంలో వెళ్తూ అందరితో ప్రేమాభిమానాలతో ఉంటూ జీవించాలని ఈ సందర్భంగా ఆలయ ప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ఆలయ స్థలధాత శ్రీరాములు మాట్లాడుతూ… మనసున్న మారాజు దిల్ రాజు అంటూ.. ఎంత బిజీ పనులున్నా, అమెరికా వెళ్లాల్సి ఉన్నా కూడా అన్ని పనులు క్యాన్సల్ చేసుకొని, పిలవగానే పోరుమామిళ్లలోని రామాలయ ప్రతిష్టకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మహోన్నత కార్యక్రమంలో తనను ముందుండి నడిపించిన చెన్నకృష్ణకు, రామచంద్ర తదితరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. దిల్ రాజు చెప్పినట్టు ఆలయం నిర్మించడమే కాదు ప్రతిరోజు నిష్టగా పూజలు చేసి స్వామివారి భక్తిని చూరగొనుటమే మన విధి అని తెలియజేశారు. బద్వేల్ నియోజకవర్గంలో ఎక్కడ ఇంత పెద్ద రామాలయం లేదని అందరూ చెబుతున్నారు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
విశ్వంత రెడ్డి మాట్లాడుతూ..ఆలయ ప్రతిష్టకు విచ్చేసిన దిల్ రాజు, ఆలయానికి స్థలాన్ని ఇచ్చి నిర్మించిన శ్రీరాములు, యువ కథానాయకుడు వంశీకృష్ణ, ఆలయ చైర్మన్ ఓరయ్య, కమిటీ సభ్యులు రామచంద్ర అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రామాలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు, భక్తులకు నమస్కారాలు తెలియజేశారు.
ఈ సందర్బంగా ఈ ప్రతిష్ఠా మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులందరికీ ఉచిత అన్నదాన సేవ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలోని పెద్దలు, కుటుంబాలు, యువతతో పాటు రాబోయే తరాలను కూడా ఒకచోట కలిపే ఆధ్యాత్మిక వేదికగా శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారి ఆలయం అని, ఇలాంటి గొప్ప ఆలయాన్ని నిర్మించిన దాతలు జడపోలు శ్రీరాములు- హైమావతి, వంశీకృష్ణతో పాటు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం వహించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.