JNJ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డికి Team JNJ విజ్ఞప్తి
హైదరాబాద్: జే ఎన్ జే హెచ్ ఎస్ స్థలాల విషయంలో మీకు సలహా ఇస్తున్నటువంటి కోటరీ మాటలు నమ్మకండి.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే కోటరీ ఇచ్చిన సలహాల కారణంగా ఆ ప్రభుత్వము అబాసుపాలయ్యింది. ఇప్పుడు మీకు కూడా ఆ కోటరీ సలహాలు ఇవ్వటం వలన మీరు కూడా అభాసుపాలయ్యే పరిస్థితి ఉన్నదని సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించడం జరిగింది. జర్నలిస్టుల స్థలాల విషయంలో మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని వారి బాధలను తొలగించి మానసిక స్థైర్యాన్ని కల్పించాల్సిందిగా జేఎన్జీహెచ్ఎస్ మహాధర్నాలో పాల్గొన్న పలువురు వక్తులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఈ సూచన చేశారు. ఈ సందర్భంగా నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాలలనే జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల సొసైటీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద టీమ్ జేఎన్జీ నిర్వహించిన మహా ధర్నా తీర్మానం ఆమోదించారు. న్యాయపరంగా వెసులుబాటు ఉన్నందున ఈ రెండు స్థలాలు విషయంలో ప్రభుత్వము పునరా ఆలోచన చేసి కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని ఈ తీర్మానంలో ప్రభుత్వాన్ని కోరారు.
జే ఎన్ జే హెచ్ ఎస్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించి చివరికి వీధుల పాలుచేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అయిన విషయమని ఆంధ్రభూమి మాజీ సంపాదకులు ఎం.వి ఆర్ శాస్త్రి అన్నారు. ఎలాంటి సౌకర్యాలు, సౌలభ్యం లేని జర్నలిస్టులు అవసాన దశలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని అభిప్రాయపడ్డారు ..జే ఎన్ జే హెచ్ ఎస్ సభ్యులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. జే ఎన్ జే హెచ్ ఎస్ సభ్యులు చేసే ఆందోళనకు తన పూర్తి మద్దతు ఉంటుందని శాస్త్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి డబ్బు చెల్లించి గత 20 ఏళ్లుగా స్థలాలు దక్కకుండా దీనస్థితికి చేరుకున్న జేఎన్జీఎస్ సభ్యుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతితో వ్యవహరించి తక్షణమే స్థలాల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ధర్నా చేయడం లేదని తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ధర్నా చేయడం జరుగుతుందని జే ఎన్ జే హెచ్ ఎస్ డైరెక్టర్లు పి.వి రమణ రావు కే.అశోక్ రెడ్డిలు స్పష్టం చేశారు. నిజాంపేట్ పెట్, బషీరాబాద్ స్థలాలు మాత్రమే జే ఎన్ జే హెచ్ ఎస్ సభ్యులకి ఇవ్వాలని సొసైటీ డైరెక్టర్ పివి రమణ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు తాము న్యాయ సలహా తీసుకొని అందచేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు: కే అశోక్ రెడ్డి సొసైటీ డైరెక్టర్
ఇందిరా పార్కులో నిర్వహించిన ధర్నా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని సొసైటీ డైరెక్టర్ అశోక్ రెడ్డి అన్నారు . కొంతమంది గిట్టని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మరాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం స్థలాల సాధన కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలు సర్వసాధారణమైన విషయమని అన్నారు. మేము కొనుగోలు చేసిన నిజాంపేట, బషీరాబాద్ స్థలాలని ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సొసైటీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించి సభ్యులందరికీ స్థలాలు ఇచ్చి న్యాయం చేయాలన్నారు.
తెలంగాణ హౌస్ ఫెడ్ వైస్ చైర్మన్ , జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు బ్రహ్మానంద బేరి మాట్లాడుతూ జర్నలిస్టుల ఇల్లు కట్టుకునేందుకు ఇంటి రుణాలు మంజూరు చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. జే ఎన్ జే హెచ్ ఎస్ సభ్యులకు స్థలాలు వస్తే మిగతా సొసైటీ లోని జర్నలిస్టులకు కూడా స్థలాలు వస్తాయన్న ఆశాభావంతో పలువురు జర్నలిస్టులు ఉన్నారని ఆయన అన్నారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఐక్యమత్యంగా పోరాడదామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య పేర్కొన్నారు. ఫెడరేషన్ ఉపాధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల విషయంలో జేఎన్జీహెచ్ఎస్ సభ్యులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. జేఎన్జే సభ్యులు సంఘటితంగా పోరాటం చేయడం ద్వారా తమ స్థలాలు సాధించుకోవాలని అందుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలంగాణ రక్షణ సేన మీడియా విభాగం అధ్యక్షుడు మహేంద్ర రెడ్డి ప్రకటించారు.
దేశంలోనే తీవ్ర అన్యాయం గురైన వారు ఎవరంటే జె హెచ్ ఎస్ జర్నలిస్టులేనని మామిడి సోమయ్య అన్నారు. 150 గజాల స్థలం కూడా జర్నలిస్టులకు ఇవ్వకపోవడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనంగా సోమయ్య అన్నారు.
ధర్నా సందర్భంగా
“మాట తప్పకండి..
మడమ తిప్పకండి..
మా స్థలాలు మాకు ఇవ్వండి
మాది ఆశ కాదు రెండు.. రెండు దశాబ్దాల అక్రోషం
సీఎం అంకుల్
మాకు న్యాయం చేయండి
ప్రాణం పోశారు.. కానీ, వాటిని తీయకండి.. ముఖ్యమంత్రి గారు
మా ప్రాణాలు పోతున్నాయి.. మా జాగాలు మాకు ఇవ్వండి
మేము డబ్బులు చెల్లించిన స్థలాలు మాకే ఇవ్వండి
పేట్ బషీరాబాద్, నిజాంపేట స్థలాలు మావే
మరణించిన సభ్యుల ఆత్మలకు శాంతి చేకూర్చండి
1000 మంది జర్నలిస్టుల కుటుంబాల ఘోష
వినండి … అంటూ నినాదాలు చేయడం జరిగింది.
సభ్యులు తాత శ్రీనివాసరావు, రామచంద్రరావు, అస్మా అంజుం, శివరామకృష్ణ ,డి వెంకటేశ్వర్లు, సముద్రాల సురేందర్, శ్రీదేవి, రమ తదితరులు మాట్లాడారు.
మహిళల ఆక్రోశం
“ముండ మోసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే స్థలాలు తమకు అవసరం లేద”ని జే ఎన్ జే కు చెందిన ఒక సభ్యుడి సతీమణి రమ ఎంతో బాధతో అన్నారు. 20 ఏళ్లుగా కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని కోరారు.




