ఆలేరు, అక్టోబర్ 25: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం 73వ సీనియర్ ఉమెన్స్ జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ జరిగాయి. ఈ కబడ్డీ సెలక్షన్స్ లో యాదాద్రి భువనగిరి జిల్లా నలుమూలల నుండి సుమారుగా 60 మంది క్రీడాకారులు ఎంతో హుషారుగా పాల్గొన్నారు. ఈ సెలక్షన్స్ కి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ బుర్ర మహేందర్ యాదవ్ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. నేడు జరిగిన ఈ సెలక్షన్స్ అయినటువంటి క్రీడాకారులు ఈనెల 28 , 29 30 తేదీలలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరుగే 73వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారని జిల్లా కబడ్డీ ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య తెలిపారు. కబడ్డీ ఆడటం వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మన సంప్రదాయ క్రీడ అయిన కబడ్డీ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇది శరీరానికి మరియు మనస్సుకు ఎంతో మేలు చేసే ఒక పూర్తి స్థాయి వ్యాయామం. కబడ్డీ ఆడటం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నారు. కబడ్డీలో పరుగెత్తడం, దూకడం, పట్టుకోవడం వంటివి నిరంతరం చేయడం వల్ల కండరాలు బలంగా మారుతాయి మరియు శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీ (వశ్యత) వస్తుంది. కబడ్డీ రైడర్స్ “కబడ్డీ కబడ్డీ” అంటూ ఒకే శ్వాసతో పాడుతూ వెళ్లడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస వ్యవస్థ మెరుగవుతుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుండి తప్పించుకోవడానికి లేదా వారిని పట్టుకోవడానికి క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. దీనివల్ల మెదడు చాలా చురుగ్గా మారుతుంది. ఆట ఆడేటప్పుడు శరీరం నుండి ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) విడుదలవుతాయి. ఇది రోజంతా ఉన్న ఒత్తిడిని, అలసటను దూరం చేసి మనసును ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంచుతుంది. అందరితో కలిసి ఆడటం వల్ల జట్టు స్ఫూర్తి పెరుగుతుంది. అలాగే ఆటపై పూర్తి ఏకాగ్రత నిలపడం అలవాటవుతుంది. వారంలో కనీసం ఒక రోజైనా కబడ్డీ లేదా ఏదైనా శారీరక శ్రమ గల ఆటలు ఆడటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి రోజంతా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండవచ్చు అని పూల నాగయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గంధ మల్ల కుమార్, జాయింట్ సెక్రటరీ సింగం విజయ్ , పూల చంద్రకుమార్ , మంగళగిరి నరేష్ , నేషనల్ రిఫరి మరాటి లింగస్వామి , ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు పారానంది రాహుల్ , రవితేజ తదితరులు పాల్గొన్నారు.


