విశ్వసనీయతే జర్నలిస్టుకు అసలైన ఆస్తి : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Credibility is a journalist's true asset: Deputy Chief Minister Mallu Bhatti Vikramarka
Credibility is a journalist's true asset: Deputy Chief Minister Mallu Bhatti Vikramarka
Spread the love

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రెస్ క్లబ్‌ల ప్రతినిధులతో నూతనంగా ఏర్పాటైన ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో లాంఛనంగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ, జర్నలిజం విలువలు, ఆధునిక సాంకేతిక సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో, విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండటం కూడా అంతే ముఖ్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్వాతంత్ర్యోద్యమం కాలం నుండి నేటి వరకు మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, లోకమాన్య తిలక్ వంటి ఎందరో మహనీయులు జర్నలిజాన్ని సామాజిక మార్పు కోసం ఒక బలమైన ఆయుధంగా మలిచారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.ప్రస్తుత సమాజంలో సమాచార కొరత లేదని, కానీ ‘నమ్మకం’ కొరత తీవ్రంగా ఉందని డిప్యూటీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), తప్పుడు సమాచారం వేగంగా విస్తరిస్తున్న ఈ ఆధునిక కాలంలో.. విశ్వసనీయతే ఒక జర్నలిస్టుకు ఉన్న అసలైన ఆస్తి అని ఉద్ఘాటించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులు నిరంతరం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, ప్రభుత్వానికి ఒక ‘అత్యుత్తమ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’గా అండగా నిలుస్తున్నారని కొనియాడారు.