పరిపాలనాదక్షుడు నీలం సంజీవరెడ్డి : నా పుస్తకం లక్ష కాపీల రికార్డు

Administrative genius Neelam Sanjeeva Reddy: My book has a record of one lakh copies
Spread the love

ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ముచ్చట! నేను అప్పుడు ప్రభుత్వ సాంస్కృతిక మండలిలో PRO/OSD గా పని చేస్తున్న రోజులు! సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా అవధాని డా. రాళ్లబండి కవితా ప్రసాద్, సలహాదారులుగా డా. కె.వి.రమణాచారి, చైర్మన్ గా నిర్మాత ఆర్.వి.రమణమూర్తి వున్న కాలం! ఇప్పటిలా అప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వమే! ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ గా హృదయంతో మాట్లాడే ఎన్.రఘువీరా రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రిగా వట్టి వసంత్ కుమార్ వైభవం నడుస్తున్న రోజులవి!
నాకు బాగా గుర్తు… 2013 మే 12వ తేదీ! రాళ్లబండి కవితా ప్రసాద్ పిలిచి “19వ తేదీ రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా పూర్వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి నిర్వహిస్తున్నాం, ఏం చేస్తే బావుంటుంది” అనడిగారు! పది నిముషాల ఎవి చేద్దాం అన్నారు! అది ఉందన్నారు! అలా చర్చల్లో “ఆయన గురించి ఈతరానికి తెలియచేస్తూ క్లుప్త సుందరం గా ఒక పుస్తకం రాస్తే బావుంటుంది, అది కూడా మీరు రాస్తే బావుంటుందని” సలహా ఇచ్చాను. “సమయం లేదు మిత్రమా… ఒక పని చేయండి మీరే రాసేయండి” అని ఆయన బాంబు పేల్చారు! “నేనా… పుస్తకమా” అన్నాను! “అవును మీరే రాస్తున్నారు” అంటూ ఆయన లేచి భోజనానికి వెళ్లిపోయారు!
అప్పటి వరకు ఆంధ్రజ్యోతి, వార్త పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాశాను. కానీ, ఒక్క పుస్తకం రాయలేదు! “ఇదేంటీ ఇంత పెద్ద టాస్క్” అని ఇక ఆరోజు రాత్రి నిద్ర పట్టలేదు! ఉదయాన్నే వచ్చి రాళ్లబండి కవితా ప్రసాద్ ను కలసి, “జస్ట్ ఇక అరు రోజులే ఉంది, ఇందులో రెండు రోజులు ప్రింటింగ్ పోతే కేవలం నాలుగు రోజులే, నా వల్ల కాదని” చేతులెత్తేశాను! “ఇక ఆ పుస్తకం గురించి డిస్కషన్ వద్దు, మీరు రాస్తున్నారు, నాకు కూడా చూపించవద్దు, రైతు నేస్తం వెంకటేశ్వరరావు కు పంపించేయండి, చెప్పేశాను ప్రింట్ చేసేస్తారు” అని ఆయన ఫోన్ అందుకున్నారు. ఇక నేను నా ఛాంబర్ లోకి వచ్చాను!
రెండు రోజుల్లో రాసేయడం, ఒకరోజు డీటీపీ చేయించేయడం, ఒకరోజు అచ్చు తప్పులు, ఫోటోలు సెలెక్ట్ చేసి స్కాన్ చేయించడం, అయిదవ రోజు ప్రింటింగ్ కు పంపించేయడం… ఇక అదే పనిలో నేను! ఎందుకు చెబుతున్నానంటే ఇంత ఇదిగా… నేను రాసిన తొలి బయోగ్రఫీ, పైగా కాకలు తీరిన జనం నేత, రాజనీతిజ్ఞ నీలం సంజీవరెడ్డి చరిత్ర! ఐదు రోజుల్లో పూర్తి చేయడం ఒక రికార్డు అయితే, తొలి ప్రింటింగ్ రెండు వేల కాపీలు అయితే, ఆ తరువాత అనేక సార్లు ప్రింట్ అయి కేవలం ఆ శత జయంతి సంవత్సరంలో లక్ష కాపీలు ప్రింట్ అవడం, రాష్ట్రం మొత్తం ఉచితంగా పంపిణీ చేసేయడం, నా జీవితం ధన్యం, ఇది రాళ్లబండి కవితా ప్రసాద్ నాకు ఇచ్చిన మధురమైన బహుమానం, అంతకు మించి నన్ను వెంటాడే అద్భుతమైన జ్ఞాపకం!
నా మొదటి పుస్తకాన్ని రవీంద్రభారతిలో ఆవిష్కరించింది ఎవరెవరో తెలుసా? గవర్నర్ ESL నరసింహన్, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ సి. చక్రపాణి, కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, మంత్రులు జానారెడ్డి, పితాని సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, నీలం సంజీవ రెడ్డి కుటుంబ సభ్యులు, మర్రి శశిధర్ రెడ్డి ఆరోజు వేదికపై ఉన్నారు! ప్రేక్షకుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఎందరో ఉన్నారు! కార్యక్రమంలో భాగంగా నా పుస్తకం ఆవిష్కరణ సమయం వచ్చింది! రాళ్లబండి కవితా ప్రసాద్ అందంగా ప్యాక్ చేసిన ఆ కవర్ ను గులాబీ పూల రెమ్మల మధ్య ఉంచి ఆ ప్లేట్ ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అందించారు! అక్కడే అప్పుడే ఆ క్షణమే నా అదృష్టం తలుపు తట్టింది! “రచయితను కూడా పిలవండి” అని కిరణ్ కుమార్ రెడ్డి అనడం, వెంటనే నాపేరు మైక్ లో అనౌన్స్ చేయడం, ఆ పక్కనే వున్న నేను సిగ్గుతో సంతోషంతో అలా నడుచుకుంటూ వేదికపైకి రావడం, జానారెడ్డి పనబాక లక్ష్మి ల మధ్యన నేను నిలబడినప్పుడు నా పుస్తకం విడుదలైంది! తొలి కాపీ గవర్నర్ నరసింహన్ అందుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నన్ను అభినందించి నాకు శాలువా కప్పారు. నరసింహన్ నాకు చెయ్యి కలిపారు. అలా అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వేదిక పక్కకు వచ్చేసాను. రాళ్లబండి కవితా ప్రసాద్ ను అలింగనం చేసుకున్నాను! నా తొలి పుస్తకానికి పట్టాభిషేకం! అతిరధ మహామహులు పాల్గొనడం నా జీవితంలో మరచిపోలేని మధురమైన రోజు! అదే నీలం సంజీవరెడ్డి జయంతి రోజు!
ఇంతటితో అదృష్టం ఆగలేదు! ఆ మరుసటి రోజు మళ్ళీ రాళ్లబండి కవితా ప్రసాద్ పిలిచారు. “మీ పుస్తకం అందరికి నచ్చింది. ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారు. నీలం సంజీవరెడ్డి గారి శత జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున సంవత్సరం పొడవునా నిర్వహించాలని, ప్రతి వేదిక పై ఈ పుస్తకం విడుదల చేసి ఉచితంగా పెద్ద మొత్తంలో పంపిణీ చేయాలని ఆదేశించారు! నీ అదృష్టం తిరిగింది పో” అని అభినందించారు. రెండు లక్షల చెక్ బహుమతిగా ఇచ్చారు. ఇక నా ఆనందానికి అవధులు లేవు!
అనంతపురం, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, ఢిల్లీ లలో జరిగిన నీలం సంజీవరెడ్డి జయంతి ఉత్సవాల్లో ఎప్పటికప్పుడు అచ్చు వేయించడం, ఉచితంగా పంచేయడం, అలా అ ఏడాదిలో లక్ష కాపీలు వేసి పంచేశాం! నా జీవితం మహా ధన్యం! ఇవాళ నీలం సంజీవ రెడ్డి జయంతి సందర్భం! ఆనాటి వెంటాడే జ్ఞాపకం మీతో పంచుకోవాలని అనిపించింది!

– డా. మహ్మద్ రఫీ

Related posts

Leave a Comment