ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది : గురువు భాగ్యరాజాపై చిన్నికృష్ణ భావోద్వేగ వ్యాఖ్యలు

This tragedy has left me deeply shocked: Chinni Krishna's emotional comments on his mentor Bhagyaraja.
Spread the love

ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ మృతి పట్ల ప్రముఖ కథా రచయిత చిన్నికృష్ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు మాటలు రావడం లేదు’ అంటూ తన గురువు భాగ్యరాజాపై ఉన్న గురుభక్తిని చాటుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. నటుడు, దర్శకుడు భాగ్యరాజ్‌ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక్క ఫ్లాప్ కూడా లేని నెంబర్ వన్ రైటర్‌గా తాను నిలబడటానికి గురువు భాగ్యరాజా గారి శిష్యరికమే కారణమని చిన్నికృష్ణ స్పష్టం చేశారు. దర్శకత్వం చేయాలనే సంకల్పంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన చిన్ని కృష్ణ తొలుత రచయితగా మారాల్సి వచ్చింది. నరసింహనాయుడు, నరసింహ, ఇంద్ర, గంగోత్రి వంటి విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన ఆయన రచయితగా ప్రయాణం మొదలుపెట్టి దాదాపు 15 ఏళ్లు కావొస్తోంది. చిన్ని కృష్ణ రాసింది తక్కువ సినిమాలకే అయినా… తన రచనల ద్వారా మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. తనలోని దర్శకత్వ కోరిక త్వరలోనే ఖచ్చితంగా తీరుతుందన్న నమ్మకంతో ఉన్న ఆయనకు గురువు భాగ్యరాజ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలోనే ఒక్క ఫ్లాప్ లేని ఏకైక రచయితను కావడానికి నా గురువు భాగ్యరాజా గారే కారణమంటూ చిన్నికృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. టాలీవుడ్‌లో సంచలన విజయాలు నమోదు చేసిన ప్రముఖ స్టార్ రైటర్ చిన్నికృష్ణ తన గురువు, కోలీవుడ్ దిగ్గజం కె. భాగ్యరాజాపై ఉన్న అపారమైన భక్తిని, గౌరవాన్ని చాటుకున్నారు. భాగ్యరాజ గారికి తమిళనాడులో ఎంతో మంది శిష్యులు ఉన్నప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఆయనకు ఉన్న ఏకైక శిష్యుడిని తానేనని చిన్నికృష్ణ గర్వంగా ప్రకటించారు.
తల్లిదండ్రుల కంటే మిన్నగా గురుభక్తి..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వకుండా నెంబర్ వన్ రైటర్‌గా కొనసాగుతుండటం వెనుక ఉన్న రహస్యాన్ని చిన్నికృష్ణ బయటపెట్టారు. “నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం కేవలం భాగ్యరాజా గారి శిష్యరికం మాత్రమే. ఆయన దగ్గరే నేను కథ, స్క్రీన్‌ప్లే, మాటలలోని మెళకువలను నేర్చుకున్నాను. నా కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయనను గురువుగా భావిస్తాను. ఆయన ముందు కూర్చోవడానికి కూడా నా మనసు ఒప్పదు, అంతటి గౌరవం ఆయనపై ఉంది అని చిన్నికృష్ణ పేర్కొన్నారు.
ప్రపంచంలో చార్లీ చాప్లిన్.. సౌత్ ఇండియాలో భాగ్యరాజా!
సినిమాలోని విభిన్న రంగాలపై పట్టు సాధించిన ప్రపంచ స్థాయి దిగ్గజాలతో తన గురువును పోల్చారు చిన్నికృష్ణ. కంటిన్యూస్‌గా నెంబర్ ఆఫ్ హిట్స్ ఇస్తూ.. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం అందిస్తూ, తానే హీరోగా, నిర్మాతగా మెప్పించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో చార్లీ చాప్లిన్ అయితే, భారతదేశంలో రాజ్‌కపూర్, సౌత్ ఇండియాలో ఓన్లీ భాగ్యరాజా మాత్రమేనని కొనియాడారు. అలాంటి మహానుభావుడికి శిష్యుడిని కావడం తన పూర్వజన్మ సుకృతమని, ఆ సరస్వతి దేవి అనుగ్రహమని భావోద్వేగానికి లోనయ్యారు.
నిత్యం గురువు చిత్రపటానికి పూలమాలలు..
గడిచిన ఐదేళ్ల కాలంలో భాగ్యరాజా గారు అనేకసార్లు తన ఇంటికి వచ్చి, తమ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ తమతోనే గడిపారని చిన్నికృష్ణ గుర్తుచేసుకున్నారు. ఒకవేళ ఆయన గనుక దూరం అయితే అది తనకు తీరని లోటని, భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప రచయితను, మేధావిని కోల్పోయినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు భాగ్యరాజ్‌ ఇకలేరని విషయం నమ్మలేకపోతున్నా. గొప్ప దర్శకుడు, అసాధారణ నటుడు. సామాజిక సందేశాలున్న ఎన్నో సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. తమిళ చిత్రసీమ గొప్ప మేధావుల్లో ఒకరిని కోల్పోయింది. అందుకే ఈ రోజు నుంచి నిత్యం తన గురువు చిత్రపటానికి (ఫోటోకు) పూలమాలలు వేస్తూ, పూజిస్తూ తన శేష జీవితాన్ని (బ్యాలెన్స్ లైఫ్) గడుపుతానని చిన్నికృష్ణ ప్రతిజ్ఞ చేశారు.
కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలి..
అద్భుతమైన దర్శకుడిగా, అసాధారణమైన స్క్రీన్‌ప్లే రచయితగా, గొప్ప నటుడిగా భారతీయ సినీ పరిశ్రమకు భాగ్యరాజ్ అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన భార్య పూర్ణిమకు, కుమారుడు శాంతనుకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన గురువా.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అని ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. భాగ్యరాజ్ సృష్టించిన కళాఖండాలు భాషా సరిహద్దులను దాటి కోట్లాది మంది హృదయాలను స్పృశించాయి. రచయితగా, సహాయ నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన భాగ్యరాజ్ గారు తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన, కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి విజయవంతం అయ్యాయి. ప్రేమ, కుటుంబ కథలను ఆయన మలచిన విధానం ఒక తరం ప్రేక్షకులను మెప్పించింది. చివరగా భాగ్యరాజా గారి కుటుంబ సభ్యులకు, ఆయన పిల్లలకు ఆ సరస్వతి మాత, భగవంతుడు ఎల్లప్పుడూ కొండంత మనోధైర్యాన్ని ఇవ్వాలని చిన్నికృష్ణ ప్రార్థించారు. భాగ్యరాజా గారు ఏదో ఒక రూపంలో మళ్లీ పుట్టి, ఇంకొక యాభై సంవత్సరాల పాటు ఈ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినిమా రంగానికి తన సేవలు అందించాలని, ఇండస్ట్రీని పెద్ద దిక్కుగా నడిపించాలని చిన్నికృష్ణ ఆకాంక్షించారు.

-ఎం.డి అబ్దుల్

Related posts