– అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాలు శుభారంభం
– కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కార విజేతలకు ఘన సత్కారాలు
విలక్షణ కార్యక్రమాలతో గుర్తింపు పొందిన తెలంగాణ సంగీత నాటక అకాడమి జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించి తెలంగాణ ఖ్యాటిని చాటి చెప్పడం అభినందనీయం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ నృత్యోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధనారీశ్వరం పేరిట నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతిభ కలిగిన కళాకారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన మల్లు భట్టి విక్రమార్క జ్యోతి ప్రకాశనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కళాకారులను గౌరవించుకోవడం అంటే సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రోత్సాహించడమే అని ఆయన అన్నారు. విశిష్ఠ అతిధిగా విచ్చేసిన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఇలాంటి నృత్య నాటకోత్సవాలు జిల్లాల్లో కూడా నర్వహించాలని సూచించారు. తెలంగాణ కళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి ఈ ఉత్సవాలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సభాధ్యక్షత వహించిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలుఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ
వంద రోజుల ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్నెన్నడూ జరగని రీతిలో అత్యంత వైభవోపేతంగా జాతీయ స్థాయి నృత్యోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వైవిధ్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇప్పుడు జాతీయ స్థాయిలో తొలిసారిగా అర్ధనారీశ్వరం కాన్సెప్ట్ తో మూడు రోజుల నృత్యోత్సవాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
కేంద్ర సంగీత నాటక అకాడమీ తాజాగా ప్రకటించిన తెలంగాణ అవార్డు విజేతలు వోలేటి రంగమణి (వివిధ నృత్య కళల సేవ), రాజేశ్వరి సాయినాథ్ (భరతనాట్యం), దురిశెట్టి రామయ్య (జానపదం – కడ్డీ), డి. శ్రీనివాస్ (సంగీతం – వీణ), ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార విజేతలు సాత్విక పెన్నా (ఆంధ్రనాట్యం), పేరి త్యాగరాజు (సంగీతం – వయోలిన్), అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి (కూచిపూడి) లను ఘనంగా సన్మానించారు. అనంతరం హైదరాబాద్ యువ కళాకారులు సురేంద్రనాథ్ డాక్టర్ బిజినా దంపతులు “ద్వయం” కూచిపూడి నృత్యంతో అర్థనారీశ్వరానికి సంపూర్ణత చేకూర్చారు. న్యూఢిల్లీ కళాకారులు లాయర్ వసీమ్ రాజా కూచిపూడి శైలిలో ప్రదర్శించిన “సమర్పణం” ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. చివరగా హైదరాబాద్ కళాకారులు ఆయానా మనోజ్ఞ బాలరాజు బృందం “అధర్వ” ప్రదర్శించి మంత్రముగ్ధలను చేశారు. ప్రకృతి ప్రత్యేకతను, స్త్రీ పురుష సమానత్వాన్ని చాటి చెబుతూ అర్ధనారీశ్వరం కళ్ళను కట్టి పడేసింది. రెండవరోజు 23వ తేదీ సాయంత్రం ముంబయి కళాకారులు పవిత్ర భట్, అపర్ణ శాస్త్రి “ఏకమ్ దేవయామ్”, బెంగళూరుకు చెందిన డాక్టర్ వసంత్ కిరణ్ “సభాపతి”, హైదరాబాద్ కు చెందిన వైష్ణవి సాయినాథ్ నృత్య కదంబం భరత నాట్య ప్రదర్శనలు జరుగుతాయని వ్యాఖ్యాన బ్రహ్మ మురళీకృష్ణ ప్రకటించారు. మూడు రోజులు ఆయా ప్రదర్శనల గురించి విద్యార్థులకు సమీక్ష వ్యాసరచన పోటీలు నిర్వహించి తగిన బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.

