* ఏప్రిల్24 ఉత్తమ చిత్రాల నిర్మాత ఏడిద నాగేశ్వరావు 92 వ జయంతి
శంకరాభరణం, సీతాకోకచిలక, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి చిత్రాలంటే పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ గుర్తుకువస్తుంది. కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు . ఉత్తమాభిరుచి గల నిర్మాత.. తెలుగు సినిమా కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపిన నిర్మాత, తెలుగు సినిమాకు పూర్ణోదయ వెలుగులు పంచిన ఏడిద నాగేశ్వరరావు 92 వ జయంతి నేడు. నటన మీద మక్కువతో.. నాటకాల్లో నటుడిగా, అనంతరం సినీనటుడిగా,తన సినీ ప్రస్థానం ప్రారంభించారు. సినీచిత్ర నిర్మాణరంగంపై దృష్టి సారించి 1976లో స్నేహితులతో కలిసి మొదటి ప్రయత్నంగా ‘సిరిసిరిమువ్వ ‘ చిత్రాన్ని నిర్మాణ నిర్వాహకుడిగా నిర్మించారు. హిరోయిన్ జయప్రద మూగది, హీరో చంద్రమోహన్ డప్పు కొట్టుకునేవాడు. పెద్ద తారాగణమేమీ లేదు. అందరూ పెదవి విరిచారు. ఫైట్లు లేవు…భారీ సెట్టింగులు లేవు… ప్రముఖ తారాగణం అంతకన్నా లేరు… కొనడానికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు. కానీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వీళ్లనెవరినీ నమ్ముకోలేదు కేవలం… కథను నమ్ముకున్నారు, సంగీతాన్ని నమ్ముకున్నారు, విశ్వనాథ్ ప్రతిభను నమ్ముకున్నారు. ఫలితం… మొదటి సినిమాయే బంపర్ విజయం సాధించింది. మూగపిల్లగా జయప్రద అభినయం, చంద్రమోహన్ అభినయ కౌశలం.. చిత్రాన్ని విజయపథంలో నడిపించాయి. శ్రావ్యమైన సంగీతం, సిరిసిరిమువ్వ పాటలు జనరంజకాలయ్యాయి. అంతేకాదు ‘మాస్కో ఫిలిం ఫెస్టివల్’ లో ప్రదర్శనకు ఎంపికయింది. ఈ చిత్రం సాధించిన విజయంతో, ఏడిద తన సొంత సంస్థ ‘పూర్ణోదయా’ స్థాపించి
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని కీర్తిని ఆర్జించారు.1976 నుంచి 1992 వరకు చిత్ర నిర్మాణంలో ఉన్నారు.
1) సిరిసిరిమువ్వ (1976), 2) తాయారమ్మ-బంగారయ్య (1979), 3) శంకరాభరణం (1980), 4) సీతాకోకచిలుక (1981), 5) సాగరసంగమం (1983), 6) సితార (1984), 7) స్వాతిముత్యం (1986), 8) స్వయంకృషి (1987), 9) స్వరకల్పన(1989), 10) ఆపద్భాందవుడు (1992) ఆయన నిర్మించిన ఈ పది సినిమాలూ కూడా సాహిత్య, సంగీత ప్రధానమైనవే… కళాత్మకమైనవే… ఈ పది సినిమాల్లో కళాతపస్వి విశ్వనాథ్ ఆరుచిత్రాలకు దర్శకత్వం వహించారు. విలక్షణ దర్శకుడు వంశీ రెండు చిత్రాలకు, ప్రసిద్ధ తమిళ దర్శకుడు భారతీరాజా ఒక చిత్రానికి, శ్రీ కొమ్మినేని శేషగిరిరావు
ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు.
పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ : కళాతపస్వి కే. విశ్వనాధ్ దర్శకత్వంలో శంకరాభరణం తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకు వెళ్లిన అద్భుత కావ్యం . ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు , బాక్సాఫీస్ కలెక్షన్స్గాని , జాతీయ – అంతర్జాతీయ – రాష్ట్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే , అతిశయోక్తి కాదు. ఏ దేశమెళ్లినా శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో . ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలక చిత్రమే ఇన్స్పిరేషన్ . ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కే.విశ్వనాధ్ కాంబినేషన్ లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . అవార్డులతో పాటు రివార్డులు సొంతం చేసుకున్నదీ చిత్రం . తెలుగు, తమిళం.. మలయాళంలో ఒకే సారి విడుదలయ్యి అప్పట్లోనే పాన్ ఇండియా చిత్రంగా సూపర్ హిట్ అయ్యింది . తదుపరి చిత్రం మరో క్లాసిక్ – సితార. ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘సితార’కి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది. ఇక స్వాతిముత్యం – కే.విశ్వనాధ్ కమలహాసన్ రాధికల కలయికలో వచ్చిన ఆణిముత్యం. 1986లో విడులయిన ఈ చిత్రం , అప్పటికి బాక్సాఫీస్ రికార్డ్స్ ని బీట్ చేసింది. జాతీయ అవార్డు , రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకొన్న మొట్ట మొదటి తెలుగు చిత్రం .
ఇక ‘స్వయంకృషి’ : మెగాస్టార్ చిరంజీవితో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా , ఓ సాధారణ చెప్పులు కొట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే. అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద . మంచి విజయం సాధించిన ఈ చిత్రం , చిరంజీవి కి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది.
ఆయన కుమారుడు శ్రీరాం హీరో గా చేసిన ‘స్వరకల్పన’ ఓ మంచి చిత్రంగా మన్ననలు పొందినా, విజయం సాధించలేదు.
1992లో శ్రీ నాగేశ్వరరావు నిర్మించిన సినిమా ‘ఆపద్బాంధవుడు‘ లో కూడా చిరంజీవే కథానాయకుడు, మీనాక్షిశేషాద్రి హీరోయిన్. చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ . రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు.
తెలుగు సినిమా కీర్తిని జాతీయస్థాయికి తీసికెల్లగలిగిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావుగారు. దక్షిణ భారత ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా 3 సార్లు , తెలుగు సినీ నిర్మాతల కౌన్సిల్ కార్యదర్శిగా, రాష్ట్ర నంది అవార్డుల కమిటీ అధ్యక్షునిగా, జాతీయ చలనచిత్ర, అవార్డుల కమిటీ సభ్యునిగా తన సేవలనందించారు. నాలుగు జాతీయ అవార్డులను, అనేక నంది అవార్డులను గెలుచుకున్న చిత్రాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు చిరస్మరణీయుడు. ఇంత సాధించిన ఏడిద వారికి ప్రభుత్వాల తరపున ఇచ్చే పద్మ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు రాకపోవటం చాలా బాధ కలిగే విషయం. వీరు చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’కు నామినేట్ అయ్యారు. తెలుగు చలనచిత్ర కీర్తిబావుటా రెపరెపలాడించిన ఏడిద నాగేశ్వరరావు, కళనే ఊపిరిగా నమ్ముకుని, అన్నీ కళాత్మక చిత్రాలనే నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు అన్ని చిత్రాలకూ రాష్ట్ర ప్రభుత్వ నందులు గానీ, జాతీయస్థాయి అవార్డులు గాని పొందాయి. ఏడిద నాగేశ్వరరావు తన 81 ఏళ్ల వయస్సులో 4.10.2015న స్వర్గాస్తులైనప్పటికీ, తెలుగు చలనచిత్రరంగంలో ఆయనో ధృవతార.

