దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూత

Director P C REDDY No More
Spread the love

ప్రఖ్యాత సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉదయం 8.30 లకు చెన్నై లో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. యన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలను ఆయన దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు.. ఎక్కువగా దర్శకత్వం వహించారు. పీసీ రెడ్డి మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. గ్రామీణ కథాంశాల మీద ఎక్కువ పట్టు ఉన్న దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి. పి.సి.రెడ్డిగా ఎక్కువ పాప్యులర్. రీమేక్ చిత్రాల దర్శకుడుగా ఎక్కువ హిట్స్ ఇచ్చిన వి.మధుసూదనరావు వద్ద శిష్యరికం చేసిన ఈయన రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి గ్రామ మున్సబుగా చేసేవారు. మద్రాసులో బి.ఏ.చదివిన తరువాత చిత్ర రంగంలో సహాయ దర్శకుడుగా ప్రవేశించారు. కృష్ణ, విజయ నిర్మల హీరో హీరోయిన్లుగా నటించిన ‘ అనూరాధ ‘ ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం. అయితే ఉషశ్రీ పతాకాన శోభన్ బాబు,విజయనిర్మల నటించిన ‘ విచిత్ర దాంపత్యం ‘ మొదటి చిత్రంగా 16-4-1971 న విడుదలైంది. అనూరాధ 23-7-1971 న ద్వితీయ చిత్రంగా విడుదలైంది. ఎన్.టి.రామారావు, అంజలీదేవి ప్రభృతులతో పి.సి.రెడ్డి దర్శకత్వంలో 30-11-1972 న విడుదలైన బడిపంతులు ఒక ఆణిముత్యంగా నిలచి మంచి పేరు తెచ్చింది.ఆత్రేయ రాసిన భారతమాతకు జేజేలు…,నీ నగుమోము నా కనులారా…, బాలనటిగా శ్రీదేవితో చిత్రీకరించిన బూచాడమ్మా బూచాడు బుల్లి పెట్టెలో దాగాడు తదితర పాటలు హిట్ సాంగ్స్. శోభన్ బాబు శారద నటించిన మానవుడు దానవుడు కూడ మంచి పేరు తెచ్చింది. రజనీకాంత్ ఈ సినిమాను 14సార్లు చూసారు. కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఇల్లు ఇల్లాలు, పాడిపంటలు, భోగ భాగ్యాలు తదితర చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. 2014లో విడుదలైన జగన్నాయకుడు పి.చంద్రశేఖర రెడ్డి ఆఖరి చిత్రం. సుమారు 80 సినిమాలకు దర్శకత్వం వహించారు.

Related posts

Leave a Comment