భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్ల మంది ప్రేక్షకులను మైమరపించిన లెజెండరీ సింగర్, గానకోకిల ఎస్. జానకి ఇకలేరు అంటే నమ్మశక్యం కావడం లేదు అని తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాద్ రావు, కార్యదర్శి సురేష్ కొండేటి సంతాపం ప్రకటించారు. దక్షిణ భారత గానకోకిలగా పేరుగాంచిన జానకి అన్ని భాషల్లో కలిపి దాదాపు 50 వేలకు పైగా పాటలను పాడారు. తెలుగు చలన చిత్రసీమలో ఆణిముత్యాల్లాంటి పాటలకు ఆమె ప్రాణం పోశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అద్భుతమైన పాటలను ఆలపించారు. ఆమె గాన మాధుర్యానికి నాలుగు జాతీయ అవార్డులు సహా, వివిధ సినీ అవార్డులు వరించాయి. సంగీత ప్రపంచానికి జానకి చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 2013లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. లెజెండరీ గాయకులు ఘంటసాల నుంచి బాలసుబ్రహ్మణ్యం వరకూ ఎంతో మంది గాయనీ గాయకులతో కలిసి ఎస్.జానకి అద్భుత గీతాలతో అలరించారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని పాటలను ఎస్.జానకి ఆలపించారు. సిరిమల్లె పువ్వా (పదహారేళ్ల వయసు), మౌనమేలనోయి (సాగర సంగమం), వేణువై వచ్చాను (మాతృదేవోభవ), ప్రియతమా నా హృదయమా (ప్రేమ) అబ్బనీ తియ్యనీ దెబ్బ (జగదేకవీరుడు అతిలోకసుందరి), ఈ దుర్యోధన దుశ్శాసన (ప్రతిఘటన), మాటే మంత్రము (సీతాకోకచిలుక), సుందరి నీవే (దళపతి- తెలుగు వెర్షన్) వంటి సూపర్‌హిట్ సాంగ్స్ పాడారు. ఇక ఈ వార్త విన్న సినీ పరిశ్రమ, సంగీత అభిమానులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎస్. జానకి ఒక చిన్న పాపలా ఆమె పాడగలదు. ఎలాంటి సందర్భాన్నైనా తన గళంలో పలికించగలదు. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50వేలకు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. జానకి మరణంతో టాలీవుడ్‌తో పాటు మొత్తం దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపం ప్రకటించింది.
గానకోకిల జానకి మృతికి ఫిల్మ్ క్రిటిక్స్ సంతాపం
