చిత్రం : మిస్టర్ మిడిల్ క్లాస్
(రేటింగ్ :3/5)
నటీనటులు:
శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్,
సునీల్, రఘుబాబు, వెన్నెల కిషోర్,
పృథ్వీరాజ్, మురళీధర్ గౌడ్ తదితరులు
సంగీత దర్శకుడు: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: ‘గరుడవేగ’ అంజి
ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాణం: బ్లూజె క్రియేషన్స్
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ జంటగా నటించిన సోషియో ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. శ్రీకాంత్ చాలాకాలం తర్వాత ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఈ చిత్రానికి ప్రముఖ కామెడీ డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. బ్లూ.జే క్రియేషన్స్ బ్యానర్‌పై జీకే చందు నిర్మాణంలో తెరకెక్కింది. అలీ, సునీల్, రఘుబాబు, బాబూమోహన్, ధనరాజ్, వెన్నెల కిషోర్, పృథ్వీ, మురళి గౌడ్, కరుణ భూషణ్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. తెలుగు కామెడీ లెజెండ్ నటకిరీటి పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ మొదటిసారిగా వేంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ దగ్గరగా ఉండే అంశాల్లో మిడిల్ క్లాస్ జీవితం, కుటుంబ బంధాలు, భక్తి, హాస్యం ప్రధానమైనవి. ఈ నాలుగు అంశాలను ఒకే కథలో మేళవిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం జూలై 17, 2026 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంతవరకు కనెక్ట్ అయింది? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం…
కథ : ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు వెంకటరమణ (శ్రీకాంత్). వేంకటేశ్వరస్వామికి వీర భక్తుడు. తన భార్య పద్మావతి (లయ), తండ్రి ఏడుకొండలు (మురళీధర్ గౌడ్), చెల్లి (కరుణ), బావ (భూపాల్), పిల్లలతో కలిసి ఉంటాడు. వీళ్లంతా ఓ హోటల్ నడిపిస్తూ అది బాగా సాగినా మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతాడు. చివరికి జాబ్ కూడా పోయి వేంకటేశ్వరస్వామిని తిట్టుకొని తనని చంపేయమని సెక్యూరిటీ గార్డ్ గా చేరి గుడి మెట్ల మీద నిద్రపోతాడు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ.. ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వేంకటేశ్వర స్వామినే నిందిస్తాడు. భక్తుడి ఆవేదన విన్న స్వామి (రాజేంద్రప్రసాద్) ప్రత్యక్షమై, కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తాడు. అయితే అవి నకిలీవి (గిల్టీ నగలు) అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై బుక్ ఇచ్చి అందులో ఏం రాస్తే అదే జరుగుగుతుంది అని కొన్ని కండీషన్స్ పెడతాడు. అసలు ఆ బుక్ ఏంటి? ఆ బుక్ కి ఉన్న కండీషన్స్ ఏంటి? ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? వాళ్ళ కుటుంబం జీవితం ఎలా మారింది? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ : దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తన మార్క్ కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని మలిచారు. రెండువేల దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ సినిమాలను గుర్తుచేస్తూనే, నేటి ప్రేక్షకులను సైతం ఎంగేజ్ చేసేలా కథను నడిపించారు. సినిమా ప్రారంభంలో మధ్యతరగతి కష్టాలను చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కథను పూర్తి వినోదాత్మక ట్రాక్‌లోకి మళ్లించారు. మొదటి భాగంలో మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలను చాలా సహజంగా చూపించారు. ప్రస్తుతం కూడా వేలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, బ్యాంకు లోన్లు, పిల్లల ఫీజులు వంటి అంశాలు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతాయి. దేవుడు ప్రత్యక్షమయ్యే సన్నివేశాల తర్వాత సినిమా పూర్తిగా ఫాంటసీ మోడ్‌లోకి వెళ్తుంది. ముఖ్యంగా మాయా పుస్తకం కాన్సెప్ట్ ఆసక్తిని పెంచుతుంది. అయితే రెండో భాగంలో కథ కొంతవరకు ఊహించదగ్గ విధంగా సాగుతుంది. పుస్తకం ఒకరి నుంచి మరొకరి చేతికి మారడం, దాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో కుటుంబ ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజ్ చేసే ప్రయత్నం దర్శకుడు చేశారు. ఓపెనింగ్ తోనే వెంకటరమణ కష్టాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూపించి కాస్త ఎమోషనల్ చేస్తారు. ఆ మిడిల్ క్లాస్ కష్టాలకు కనెక్ట్ అవ్వాల్సిందే. వేంకటేశ్వరస్వామి భూమి మీదకు వచ్చే గ్రాఫిక్స్ బాగుంటాయి. ఆయన ఇచ్చే నగలతో కాసేపు కామెడీ బాగానే నడిపించారు. ఆ తర్వాత బుక్ ఇచ్చిన దగ్గర్నుంచి కథ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఆ బుక్ తోనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఆ బుక్ చేతులు మారడం, ఆ బుక్ లో రాసినవి జరగడం, మనిషి అత్యాశకు పోవడం, దేవుడి రాతనే మార్చాలని చూడటం, యముడి రావడం.. ఇలా కాస్త ఆసక్తిగా మనిషి ఆశ, అత్యాశ, ద్వేషం, బాధ, గర్వం.. లాంటి లక్షణాలు చూపిస్తూ సరదాగా సాగుతుంది పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్ లోకి టర్న్ తీసుకున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు సగటు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతాయి. ఈ మధ్యకాలంలో ఈ తరహా కామెడీ కమ్ మిడిల్ క్లాస్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు తక్కువే. అన్ని సినిమాల్లో మాదిరి హీరో ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. కామన్ మ్యాన్‌కు ఉండే అన్ని కష్టాలు ఇతనికి ఉంటాయి. ఓ మాములు కామన్ ఆడియన్స్ కూడా ఈ కనెక్ట్ అయ్యేలా ఫస్ట్ హాఫ్‌లో సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. ఓ సందర్భంలో రెస్టారెంట్ పెట్టి లాస్ అయిన హీరో.. స్వామివారిని నిందిస్తాడు. దీంతో భగవంతుడు ప్రతక్షమై అతినికి కొన్ని వరాలు రూపంలో కొన్ని వస్తువులు ఇస్తాడు. మొత్తంగా అత్యాశ, డబ్బు చుట్టే ప్రపంచం మొత్తం తిరుగుతుందనే సందేశాన్ని ఇచ్చాడు దర్శకుడు. సెకండాఫ్‌లో హీరో దగ్గర ఉండే పుస్తకం కోసం విలన్స్ ప్రయత్నించడం వంటివి బాగున్నాయి. వెన్నెల కిషోర్ చేసిన ‘అఖండ’ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్‌లో ‘ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం’ అనే ఒక మంచి సందేశం పాటు, పార్ట్-2 కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం.
నటీనటుల పనితీరు : మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. బాధ, ఆవేదన, కుటుంబం కోసం తపించే తండ్రి పాత్రలో మంచి నటన కనబరిచారు. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ భార్య పాత్రకు జీవం పోసింది. రాజేంద్రప్రసాద్ మొదటిసారి చేసినా వేంకటేశ్వరస్వామి పాత్రలో ఒదిగిపోయారు. స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణ మాత్రం రాజేంద్రప్రసాద్ అని చెప్పాలి. వెంకటేశ్వరస్వామి పాత్రలో ఆయన ఎలాంటి అతిశయోక్తి లేకుండా, సింపుల్‌గా నటించి ప్రేక్షకుల్లో భక్తి భావనను కలిగిస్తారు. సునీల్ నెగెటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో, ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రఘుబాబు, వెన్నెల కిషోర్ తమ కామెడీతో అలరించారు. రఘుబాబు, పృథ్వీ, కరుణా భూషణ్, భూపాల్, బాబు మోహన్, చైల్డ్ ఆర్టిస్టులు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. ముఖ్యంగా దేవుడు ప్రత్యక్షమయ్యే విజువల్స్ ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగినట్టుగా ఉంది. దేవుడు-కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. శ్రీవారిపై వచ్చే రెండు భక్తి గీతాలు, దేవుడు-కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా బాగున్నాయి. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ పాతకాలపు సోషియో ఫాంటసీ నవ్వులను, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను గుర్తుచేసే చిత్రం. ఎలాంటి అశ్లీలత లేకుండా, వారాంతంలో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడానికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్. పూర్తిగా మాస్ కమర్షియల్ సినిమా కాదు. అలాగే పూర్తిగా భక్తి చిత్రం కూడా కాదు. ఇది మిడిల్ క్లాస్ కుటుంబాల జీవితం, భక్తి, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపిన ఒక వినోదాత్మక చిత్రం. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించినా, కుటుంబంతో కలిసి చూడదగిన ఎంటర్టైనర్గా నిలుస్తుంది. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్. భక్తి ప్రధానంగా ఉండే ఫ్యామిలీ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా చూడదగినదే.
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ మూవీ రివ్యూ : వినోదాల విందు!
