Bholaa Shankar Movie Review in Telugu : భలే..భలే ‘భోళా శంకర్’!

Bholaa Shankar Movie Review in Telugu
Spread the love

(చిత్రం : భోళా శంకర్, విడుదల : 11 ఆగస్టు- 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, ఉత్తేజ్ తదితరులు. దర్శకత్వం : మెహర్ రమేష్, నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర, సంగీతం: మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్).

మెగాస్టార్ సినిమాలు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ పండుగ వాతావరణం ఉంటుంది. ఇక మెగా అభిమానులు అయితే థియేటర్లో వద్ద చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి రికార్డులు కొల్లగొట్టాడు. బాక్సాఫీస్ బరిలోకి దిగి సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు. ఇప్పుడు మళ్లీ ‘భోళా శంకర్’ అనే సినిమాతో వచ్చాడు. థియేటర్స్‌లో మెగాస్టార్ బొమ్మ పడితే.. ఫ్యాన్స్‌కి పండగ కిందే లెక్క. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. వరుస ఫ్లాప్‌లతో ఇండస్ట్రీలో చానాళ్లుగా కనిపించకుండాపోయిన మెహర్ రమేష్‌ని పిలిచి మరీ ‘భోళా శంకర్’ సినిమా ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్. అయితే ‘భోళా శంకర్’ టైటిల్ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్, మేకోవర్ విషయంలో భలే.. భోళా అనేట్టుగానే మెగాస్టార్‌ని చూపించారు దర్శకుడు పైగా కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో సినిమా అంటే మెగాస్టార్‌కి హిట్ పక్కా అనే సెంటిమెంట్ కూడా ఉండనే ఉంది. ‘భోళా శంకర్’ కూడా కలకత్తా బ్యాక్ డ్రాప్ చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మెగాస్టార్ కు జోడీగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం భారీ అంచనాలతో నేడు (11 ఆగస్టు- 20230) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం…

కథ : బతుకుతెరువు కోసం టాక్సీ నడుపుతున్న శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలిసి కోలకతాకి వస్తాడు. చెల్లెలు కీర్తి సురేష్‌ని బాగా చదివించి ఆమెకు మంచి భవిష్యత్ ఇవ్వాలని తాపత్రయపడతాడు. అదే సందర్భంలో శంకర్‌కి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువే. అన్యాయం జరిగితే సహించడు. ఆడపిల్లకి ఆపద వచ్చిందంటే అక్కడ శంకర్ టాక్సీ ఉంటుంది. కలకత్తాలో అమ్మాయిల కిడ్నాపులు కలకలం సృష్టిస్తాయి. ప్రభుత్వం, పోలీసులు కూడా ఆ మాఫియాను కట్టడి చేయలేకపోతాయి. మాఫియా హెడ్ అలెగ్జాండర్ (తరుణ్ అరోరా)ను ఎవ్వరూ పట్టుకోలేకపోతారు. సిటీలో జరిగే కిడ్నాపుల వెనుక ఉన్న క్రిమినల్స్ గురించి సిటీలోని డ్రైవర్లందరికీ అవగాహన కల్పిస్తారు పోలీసులు. దీంతో ఓ గ్యాంగ్‌లోని వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం అందిస్తాడు శంకర్. ఆ తరువాత శంకర్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు శంకర్ కలకత్తాకు ఎందుకు వచ్చాడు? దాదాగా ఉండే భోళా శంకర్.. శంకర్‌గా ఎలా మారాడు? మహా లక్ష్మీకి శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? వీళ్లద్దరికీ ఆ మాఫియాతో ఉన్న కనెక్షన్ ఏంటి? చివరకు శంకర్ ఆ మాఫియాను ఎలా తుదముట్టించాడు? ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో శంకర్ ఆ మాఫియాని టార్గెట్ చేస్తాడు. అసలు శంకర్ ఆ మాఫియాని ఎందుకు టార్గెట్ చేశాడు?, గతంలో ఆ మాఫియాతో అతడికున్న సంబంధం ఏమిటి?, ఈ మధ్యలో లాయర్ లాస్య(తమన్నా)తో శంకర్ ట్రాక్ ఏమిటి?, చివరకు శంకర్ ఆ మాఫియాని అంతం చేశాడా ?, లేదా ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ : ‘వేదాలం’ సినిమాకి ‘భోళా శంకర్’ రీమేక్ కాగా.. తెలుగులో చాలా మార్పులు చేశారు. కథలో మెయిన్ ప్లాట్‌ని డిస్ట్రబ్ చేయకుండా.. చిరంజీవి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అవన్నీ ‘భోళా శంకర్’లో రంగరించారు దర్శకుడు మెహర్ రమేష్. మాసూ.. క్లాసూ మాత్రమే కాదు.. మెగాస్టార్‌లో కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. కామెడీ టైమింగ్ పండిందంటే నెక్స్ట్ లెవల్ అనేట్టుగానే ఉంటుంది. ‘భోళా శంకర్’లో మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ . సినిమా ఆద్యంతం హాయిగా అలా అలా సాగిపోతూ వినోదాన్ని పంచింది. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు.. పాటలు అభిమానులనే కాదు.. ప్రేక్షకులనూ అలరించాయి. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో.. మెగా ఎంటర్ టైన్మెంట్ తో పాటు బరువైన ఎమోషన్స్ తో వచ్చిన ఈ భోళా శంకర్ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ ఆసక్తి కలిగేలా నడిపించాడు. ఈ సినిమాలో ప్రధానంగా కొన్ని ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకున్నాయి. శంకర్ – మహాలక్ష్మి పాత్రలు, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు ఆద్యంతం అలరించేలా నడిపించడంలో దర్శకుడు మెహర్ రమేష్ మంచి మార్కుల్ని కొట్టేశాడు. అయితే.. కథ కొంచెం నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ.. కథనం విషయంలో చాలా స్లోగా ప్లేను సాగించాడు. ప్రథమార్థం అలా సాగిపోయి చిత్రం ద్వితీయార్ధానికి వచ్చే సరికి పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అయితే.. కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ తో సాగిన కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. అయితే.. సెకండాఫ్ లో కూడా కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. దీనికితోడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. విలన్స్ – హీరో మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా ఇంకా బలంగా ఉండాల్సింది. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తో పాటు కథలోని మెయిన్ కోర్ ఎమోషన్ కూడా పండింది. . అలాగే మెగాస్టార్ పాత్రలోని షేడ్స్ ను, తమన్నాతో సాగే సీన్స్ ను , ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని ఎమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో మెగాస్టార్ చిరంజీవి ఇరగదీశారు. ప్రతీ సన్నివేశంలోనూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా మెగాస్టార్ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి. హీరోయిన్ గా నటించిన తమన్నా తన గ్లామర్, నటనతో మరోసారి అలరించింది. చిరంజీవి-కీర్తి సురేష్‌ల మధ్య సెంటిమెంట్ సీన్‌లకు సినిమాకి ప్లస్ కాగా.. తమన్నా మిల్కీ అందాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. డాన్స్‌లో చిరంజీవి గ్రేస్ అండ్ స్టైల్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. తమన్నా కూడా డాన్స్‌లో ఇరగదీసింది. ఇక చెల్లి పాత్రకు కీర్తి సురేష్ జీవం పోసింది. అతిధి క్యారెక్టర్ లో నటించిన సుశాంత్ ఆకట్టుకున్నాడు. కీర్తి సురేష్ తండ్రిగా కీలక పాత్రలో నటించిన మురళీశర్మ పెర్ఫార్మెన్స్ బేషుగ్గా ఉంది. యాంకర్ శ్రీముఖి కి చెప్పుకోతగ్గ క్యారెక్టర్ పడింది. కనిపించేది కొద్దిసేపే అయినా కీర్తి సురేష్ ఫ్రెండ్ గా ఆమె అందంతో పాటు నటనలో కూడా ఒకే అనిపించింధి. ఇతర పాత్రల్లో కనిపించిన రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, గెటప్ శీను తదితర నటీనటులు తమతమ పాత్రలకున్న పరిధి మేరకు నటించి ఆయా పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నీకల్ విషయాలకొస్తే.. దర్శకుడు మెహర్ రమేష్ టేకింగ్ మెచ్చుకోలుగా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన సంగీతం ఓకే అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల్లో మరింత ఆకట్టుకునేలా ఉంది. డడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ప్రతీ సన్నివేశాన్ని తన కెమెరాలో ఎంతో అందంగా బంధించాడు. ఎడిటింగ్ వర్క్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే చాలా బాగున్నాయి. మొత్తం మీద ‘భోళా శంకర్’ అంటూ వచ్చిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ అండ్ ఇమేజ్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. మెహర్ రమేష్‌కి మంచి కమ్ బ్యాక్ మూవీ ఇది.

Related posts

Leave a Comment