ఇంటర్నెట్ వ్యవస్థను యువత జాగ్రత్తగా వినియోగించుకుంటూ పురోగతిని సాధించాలని లేని పక్షంలో మనకు తెలియకుండానే క్రైమ్ కార్నర్లో ఇరుక్కుపోతారని టీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి తెలియజేశారు. రూం టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఓ హోటల్లో ‘మి అండ్ మై డిజిటల్ వరల్డ్’ అనే ప్రచార కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సుమతి మాట్లాడుతూ గతంలో విద్యార్థులకు ఫోన్లు వద్దంటూ తల్లిదండ్రులు నివారించే వారని, అయితే ప్రస్తుతం అన్ని అవసరాలకు ఇంటర్నెట్ వినియోగిస్తున్నందువల్ల దాని వాడకం ఎక్కువైందని పేర్కొన్నారు. మన పిల్లలు ఇంటర్నెట్లో ఎలాంటి సైట్స్ను వినియోగిస్తున్నారు. వారి స్నేహితులు ఎవరనే విషయాన్ని మాత్రం తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. -ఒక్కోసారి అగంతకులు ఫేక్ అకౌంట్స్ను క్రియేట్ చేసి స్నేహం ముసుగులో అమాయక యువతులను మోసం చేస్తూ తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని ఇలాంటి సంఘటనలను. దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్తో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. మనది యంగ్ ఇండియా అని అందువల్ల దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని, యువతరం ఆకర్షణకు లోనుకాకుండా వాస్తవంలో ఉంటూ ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కాగా ఇంటర్నెట్ ద్వారా యువతులకు కలిగే ఉపయోగాలు, నష్టాలను తెలియజేస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టామన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజేష్, ప్రోగ్రాం ఆఫీసర్ సరిత.. మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యువత ఇంటర్నెట్ వ్యవస్థను జాగ్రత్తగా వినియోగించుకుంటూ పురోగతిని సాధించాలి : టీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి
