టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ కన్నుమూశారు. కళాతపస్వీ దర్శకులు కె. విశ్వనాథ్ కన్నుమూసిన ఘటననుంచి ఇంకా తేరుకోకముందే ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ అనారోగ్యంతో చెన్నైలో తన స్వగృహంలో తుది శ్వాసవిడిచారు. ఇటీవలే కేంద్రం ఆమెకు మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌తో గౌరవించింది. ఈ అవార్డు స్వీకరించక ముందే.. వాణీ జయరామ్ కన్నుమూయడంతో చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె పాట సమ్మోహన పరుస్తుంది..పరవశింపచేస్తుంది..ఒక్కసారి వింటే తృప్తి కలగదు..మళ్లీ మళ్లీ అదే పాట వినాలనిపిస్తుంది…కోయిల కూసినట్టు, గలగలా గోదారి పరుగులు పెట్టినట్టు, గంగమ్మ ఉరకలెత్తి వచ్చినట్టు…ఆమె పాట అనేక భావాలను మోసుకొస్తుంది…తన గానమృతం తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ఆమె మరెవరో కాదు స్వర సరస్వతి వాణీ జయరాం. వాణీ జయరామ్ వాణీ.. పాటకు ప్రాణం పోస్తుంది…
