కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్ పూత్ హీరోయిన్ గా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ ను నెగిటివ్ షేడ్స్ ఉన్న లేడీ పాత్రలో చూపించడం జరిగింది. హీరోయిన్‌గా ఆ సినిమా పాయల్ కి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ ఒక్క సినిమా హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ తో పాటు దర్శకుడు అజయ్ భూపతికి మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. పాయల్ రాజ్ పూత్ పదుల కొద్ది సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకుంది. హీరో కార్తికేయ కూడా చాలా సినిమాల్లో నటించాడు. దర్శకుడు అజయ్ భూపతి కి కూడా మంచి క్రేజ్ దక్కింది కానీ ‘మహాసముద్రం’ సినిమాను తీసి పోగొట్టుకున్నాడు. ‘ఆర్‌ఎక్స్ 100’తో స్టార్స్ అయిన ఆ ముగ్గురు కూడా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దర్శకుడు అజయ్ భూపతి హీరో దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటే, పాయల్ రాజ్ పూత్ హీరోయిన్ పాత్రలు లేక దిక్కులు చూస్తుంది. కార్తికేయ కూడా ఓ మోస్తరు సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను నెట్టుకు వస్తున్నాడు. ఇలాంటి సమయంలో కార్తికేయ సూపర్ హిట్ మూవీ ’ఆర్‌ఎక్స్ 100’ సీక్వెల్ ను ప్రకటించాడు. తాజాగా ఆయన నటించిన ‘బెదురులంక 2012; ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సూపర్ హిట్ మూవీ ‘ఆర్‌ఎక్స్ 100’ పార్ట్ 2 ను రూపొందించబోతున్నట్లుగా ప్రకటించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా కూడా కార్తికేయ పేర్కొన్నాడు. ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసిన తాను కొన్ని సినిమాల ఎంపిక విషయంలో తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నాడు. కథ మరియు ఇతర విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఇక ముందు సినిమాలను కమిట్ అవుతాను అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు.
‘ఆర్‌ఎక్స్ 100’కు సీక్వెల్!
