సెన్సిబుల్ దర్శకుడిగా పేరున్న శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’తో మాస్ సినిమాలు డీల్ చేయడంలో కూడా దిట్ట అని నిరూపించుకున్నాడు. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. ఒరిజినల్ సోల్ మిస్సవ్వకుండా శ్రీకాంత్ తన టేకింగ్‌తో కథను నడిపిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిని హీరోగా పెట్టి ‘పెద కాపు’ అనే ఓ అవుట్ అండ్ అవుట్ రా, రస్టిక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ నుంచి మొన్న రిలీజైన గ్లింప్స్ వరకు ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే వచ్చాయి. ఓ సామాన్యుడు సంతకం అంటూ మేకర్స్ సినిమాను ప్రమోట్ చేస్తూ జనాల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ‘పెదకాపు’ సినిమాను ఈ నెలాఖరులో 28న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్రమోషన్‌ల వేటను కొనసాగిస్తున్నారు. ప్రమోషన్‌లలో భాగంగా తొలుత ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్లు శ్రీకాంత్ అడ్డాల ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇస్తూ ప్రకటించాడు. భగవంతుడే లోకమంతా నిండి ఉన్నప్పుడు, భగవంతుడే అంతా తానై ఉన్నప్పుడు.. ఇక ధర్మం ఏంటి? అధర్మం ఏంటి? పాపం ఏంటి? పుణ్యం ఏంటి?. మరి మనిషి అనుభవం మాట, సామాన్యుడికి తగిలే దెబ్బల మాట సంగతేంటి?. సామాన్యుడిగా మనిషి ఎప్పుడు దు:ఖం నుండి సుఖంలోకి చీకటి నుండి వెలుగులోకి రావాలనే అనుకుంటాడు. ఎదగాలని తపన పడతాడు. అప్పుడు అలా ఎదగాలి అనుకునేవాడికి, ఎదగనివ్వనోడికి.. తన దారిన తాను పోయేవాడికి, ఆ దారే మూసేసి తొక్కేయ్యాలనుకునే వాడికి మధ్య యుద్ధం తప్పదంటూ ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. చూస్తుంటే ఇదేదో కులాల ఆధిపత్యాలు, రాజకీయాలు, వర్గ పోరాటాల చుట్టూ ఈ కథ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇంత వివాదాస్పద స్జబెక్ట్‌ను టచ్ చేస్తున్నాడంటే శ్రీకాంత్ అడ్డాల సాహసానికి మెచ్చు కోవాల్సిందే. గతంలోనూ ‘ముకుందా’ సినిమాలో ఇలా రాజకీయ నేపథ్య కథను ఎంచుకున్నా.. దానిని చాలా సున్నితంగా, విమర్శలకు తావివ్వకుండా తెరకెక్కించాడు. కానీ ‘పెదకాపు’ మాత్రం అలా అనిపించడం లేదు. టైటిల్, గ్లింప్స్‌ల నుంచి విమర్శలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి.
పెదకాపు: శ్రీకాంత్ అడ్డాల సాహసానికి మెచ్చు కోవాల్సిందే..!
