>స్టార్ కిడ్స్‌లో బెస్ట్ లుక్, చక్కని స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ జాన్వీకి సరైన హిట్ మాత్రం రాలేదు. అప్పుడెప్పుడో 2018లో ‘ధడక్‌తో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. మొదట్నుంచీ శ్రీదేవి కూతురు కాబట్టి ఈమెకు బాలీవుడ్లో అదనపు ఇమేజ్ ఉంది. మొదటి సినిమా నుంచే అందరి దృష్టి ఆమెపై పడింది. గుంజన్ సక్సేనా, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలీ, భవాల్ లాంటి సినిమాలతో పెర్ఫార్మెన్స్ పరంగా ఎదిగినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫలితం లేకుండా పోయింది. స్టార్ ఇమేజ్ ఉన్నా సరైన స్టోరీ సెన్స్ లేకపోవడం.. ఎంచుకున్న సినిమాలు ప్రజల మైండ్‌సెట్‌కు కలిసిరాకపోవడం లాంటివి ఆమె కెరీర్‌ను ఎదగకుండా ఆపేసాయి. అయితే 2024 చివర్లో తెలుగులో అడుగు పెట్టిన జాన్వీకి ఇక్కడ అదృష్టం కలిసొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన దేవర బ్లాక్‌బస్టర్ కావడంతో సౌత్ ఆడియన్స్‌లో జాన్వీకి క్రేజ్ పెరిగిపోయింది. ఆమె లుక్, పాత్ర బాగానే కనెక్ట్ అయ్యాయి. తెలుగులో మంచి ఆఫర్లు కూడా రావడం మొదలయ్యాయి. రామ్ చరణ్‌తో ప్రస్తుతం ‘పెద్ది’లో నటిస్తుంది. కానీ అదే సమయంలో హిందీలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2025లో ఆమె నటించిన హోమ్ బౌండ్, పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కీ తులసి కుమారి సినిమాలు వరుసగా విడుదలై భారీగా నిరాశ పరిచాయి. తక్కువ గ్యాప్‌లో మూడు సినిమాలు రావడం కూడా ఇమేజ్‌పై ప్రభావం చూపించింది. హోమ్ బౌండ్ కథ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో దృష్టి ఆకర్షించి.. భారత్ తరఫున ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కావడం కొంత ఊరట కలిగించినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆడలేదు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కీ తులసి కుమారి సినిమాలు దారుణంగా ముంచేసాయి. సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ లాంటి యువ హీరోలు కూడా జాన్వీ కోరుకున్న హిట్ ఇవ్వలేకపోయారు. ఇక నుంచి జాన్వీ కెరీర్ సెట్ అవ్వాలంటే కొత్త దిశలో ఆలోచించాల్సిందే. కేవలం గ్లామర్ లేదా సెంటిమెంట్ రోల్స్ కాకుండా.. కంటెంట్ బలంగా, ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సినిమాలు ఎంచుకోవాలి. సౌత్‌లో దేవరలా ఒక్క మంచి సినిమా హిందీలో పడితే కొత్త దారులు తెరుచుకుంటాయి. పెద్ది ఆడితే సౌత్‌లో అమ్మడి రేంజ్ పెరిగిపోవడం ఖాయం.
జాన్వీ కపూర్ : ‘పెద్ది’పై ఆశలెన్నో..!
