చిత్రం : ఇరుముడి
రేటింగ్ : 3.75/5
విడుదల: 21 ఆగస్టు 2026
నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయికుమార్, స్వసికా విజయ్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిర, అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్,
స్టంట్స్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్,
ఆర్ట్: భార్గవ. ఎన్
నిర్మాత: నవీన్ యెర్నేని, వై.రవి శంకర్
నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
మాస్ మహారాజ్ రవితేజ నటించిన చిత్రం ‘ఇరుముడి’. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత రవితేజ నుంచి వచ్చిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటించగా, కుమార్తె పాత్రలో కేరళకు చెందిన నక్షత్ర నటించారు. స్వసికా విజయ్, సాయికుమార్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సీరిస్ సమర్పించింది. ఈ సినిమాకు శివ్ చనానా సహ నిర్మాతగా వ్యవహరించారు. మాస్ మహరాజా రవితేజకు సక్సెస్ వచ్చి చాలా యేళ్ళయ్యింది. దాంతో ఆయనకో హిట్ వస్తే బాగుండు అని ఇటు ఫ్యాన్సే కాదు… అటు సినిమా రంగంలోని వారూ కోరుకున్నారు. అలాంటి సమయంలో కాస్తంత భిన్నంగా ‘ఇరుముడి’ ప్రచార చిత్రాలు ఉండటంతో, ఈ మూవీతో రవితేజ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. రవితేజ హీరోగా ‘ఇరుముడి’ అనే టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇందులోని పాటలు, ట్రైలర్లో చూపించిన ఫ్యామిలీ ఎమోషన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. కచ్చితంగా రవితేజకి ఇది కమ్‌బ్యాక్ సినిమా అవుతుందని అందరూ భావించారు. మాస్ సినిమాలకి పెట్టింది పేరు రవితేజ. ఆయన్ని సహజమైన ఓ కథలో చూసి ఎంత కాలమైందో! దర్శకులంతా ఆయన శైలి వాణిజ్యాంశాలున్న కథలతోనే సినిమాలు చేయడంతో అవి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు దర్శకుడు శివ నిర్వాణ ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో వేసిన ‘ఇరుముడి’ చేశారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ.. రవితేజ ఖాతాలో ఓ మంచి హిట్ పడి చాలా కాలమైంది. దీంతో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లోనూ గతంలో ఉన్నంత ఆసక్తి, అంచనాలు కనిపించడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత రవితేజ నటించిన ఓ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయిందంటే అది ‘ఇరుముడి’ అనే చెప్పాలి. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరి ఇంతటి హైప్ మధ్య ఈ శుక్రవారం (ఆగస్ట్ 21,2026) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’ ఎలా ఉంది? ఈ చిత్రంలో రవితేజ హిట్‌ట్రాక్ ఎక్కడా లేదా రవితేజ ఇదివరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఉందా లేదా? మరి ఆ అంచనాలను ‘ఇరుముడి’ అందుకుందా? లేదా? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో చూద్దాం…
కథ : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, సీలేరు ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సీలేరు సమీపంలోని పొల్లూరు అనే ఓ మారుమూల గ్రామంలో నివసించే ఒక సాధారణ అరటి రైతు త్రినాథ్ (రవితేజ). అయ్యప్పస్వామికి పరమ భక్తుడు. మద్యం లేకపోతే పూట గడవదు కానీ, ఏటా అయ్యప్ప మాల ధారణ చేసి ఎంతో పవిత్రంగా దీక్ష చేస్తుంటాడు. అదంతా ప్రాణానికి ప్రాణమైన కూతురు కోసమే. కావేరి (ప్రియ భవానీ శంకర్)తో పెళ్లి తర్వాత నాలుగేళ్లకు కలిగిన కూతురుకి మణికంఠ (నక్షత్ర) అని పేరు పెడతాడు. కూతురు ఐదో తరగతి పాస్ అయ్యిందని ఊళ్లో అందరికీ భోజనాలు పెడతాడు. ఎవ్వరికీ భయపడని తను, తన కూతురినీ అలాగే పెంచుతుంటాడు. చుట్టు పక్కల ఏం జరిగినా, ఏం చూసినా.. భయం లేకుండా నాన్నకు చెప్పాలంటాడు. నాన్న చెప్పినట్టుగానే ప్రతిదీ చెవిలో వేస్తుంటుంది మణికంఠ. అదే ఊరిలో ఉండే గురుస్వామి (సాయికుమార్) ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఆయన కూతురు గాయత్రిని కూడా త్రినాథ్ సొంత కూతురులానే చూసుకుంటాడు. ఆరో తరగతికి వచ్చిన తన కూతురు మణెమ్మను, గాయత్రితోనే పట్టణంలోని హైస్కూల్ కు పంపుతాడు. త్రినాథ్ అయ్యప్ప మాల వేసిన తర్వాత తాను చదువుకుంటున్న స్కూల్లో జరుగుతున్న ఓ సంఘటన గురించి తెలుస్తుంది మణికంఠకు. ఆ విషయాన్ని ఎలాగైనా నాన్నకు చెప్పాలని ప్రయత్నిస్తుంది. అంతలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఏదో జరగకూడనిది జరుగుతుంటుంది. అక్కడ చదువుకునే నలుగురు అమ్మాయిలు రకరకాల కారణాలతో చనిపోతారు. వారి మరణాలకు కారణం ఏమిటీ? అదే స్కూల్ లో చదువుకోవడానికి వెళ్ళిన త్రినాథరావు కూతురుకు ఎలాంటి అనుభవం ఎదురైంది? తన కళ్లముందు ఏది జరిగినా తండ్రికి వెంటనే చెప్పేసే మణెమ్మ అక్కడి దారుణాన్ని ఎందుకు వెంటనే చెప్పలేకపోయింది? దాని పర్యవసానం ఏమిటీ? ఇంతకీ మణి చెప్పాలనుకున్న ఆ విషయం ఏమిటి? త్రినాథ్‌కు తెలియకుండా ఊళ్లో, స్కూల్లోనూ జరుగుతున్న సంఘటనలు ఏమిటి? మరి త్రినాథ్‌కు వాటి గురించి ఎప్పుడు ఎలా తెలిసింది? అది తెలిసేలోపు జరిగిన పరిణామాలు ఎలాంటివనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ : ఈ మధ్య యువ దర్శకులు ఆడ పిల్లల పెంపకం, వాళ్ల పరిరక్షణలో కుటుంబం, సమాజం బాధ్యతని తెలియజెప్పే కథలతో సినిమాలు తీస్తుండడం ఓ మంచి పరిణామం. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆడపిల్లలను భయంతో కాకుండా, ధైర్యంగా పెంచాలన్న అంశం ఈ సినిమాలో కీలకం. నేటి సమాజానికి ఎంతో అవసరమైన ఈ అంశాన్ని దర్శకుడు ఎంతో ప్రభావవంతంగా చెప్పారు. తెలుగులో అగ్ర కథానాయకుల సినిమా అనగానే కథతో సంబంధం లేని హీరోయిజం, ఇతర వాణిజ్యాంశాల హంగామానే ఎక్కువగా కనిపిస్తుంటుంది. రవితేజ సినిమాలంటే మరీనూ! కానీ, అందుకు పూర్తి భిన్నంగా, కథకు తగ్గ భావోద్వేగాలతో నిజాయతీగా రూపొందింది ‘ఇరుముడి’. తండ్రీకూతుళ్ల బంధం చుట్టూ అల్లుకున్న కథ ఇది. థ్రిల్‌ని పంచే నేర నేపథ్యం, బలమైన సామాజికాంశాల మేళవింపుతో సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అయ్యప్ప మాల, భక్తి నేపథ్యం సినిమాని మరింత ప్రత్యేకంగా మార్చాయి. సరికొత్త నేపథ్యం, అర్థవంతమైన పాత్రలు, బలమైన రచన కారణంగా ప్రేక్షకుడిపై గాఢమైన ప్రభావం చూపిస్తుంది. అన్నీ పక్కాగా కుదరడంతో భావోద్వేగాలు బలంగా పండాయి. సినిమాకి కీలకమైన థ్రిల్లింగ్ అంశాలూ ప్రభావం చూపించాయి. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ సహజమైన పాత్రలో కనిపించడం సినిమాకి మరింతగా కలిసొచ్చింది. ఆరంభ సన్నివేశాలు మామూలుగానే అనిపించినా, కథానాయకుడు మాల ధరించడం నుంచి సినిమా ఓ కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరిస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో పాటు కథలో కీలకమైన తండ్రీ కూతుళ్ల బంధం చుట్టూ అల్లిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రతి ఆడపిల్లను తన కూతురుగా భావించే కథానాయకుడు, తండ్రి చెప్పినట్టుగా ఏం జరిగినా చెవిన వేసే కూతురు పాత్రల రూపకల్పన కట్టిపడేస్తాయి. కథానాయకుడికి పెరిగే శత్రువులు, ఊరు పక్కన అడవిలో ప్రమాదకరంగా సంచరిస్తున్న ఓ ముఠా, అమ్మాయిల అనుమానాస్పద మరణాలు, స్కూల్లో జరిగే పరిణామాలు కథలో ఉత్కంఠని పెంచుతూ వెళ్తాయి. అనూహ్యమైన మలుపులతో థ్రిల్లింగ్‌గా సాగే ద్వితీయార్ధం, పతాక సన్నివేశాల్లో పండిన గాఢమైన భావోద్వేగాలు అప్పటివరకూ కనిపించిన లోటు పాట్లన్నింటినీ మరిచిపోయేలా చేస్తాయి. ప్రతినాయకుడి అంతంతో ఏ సినిమా అయినా ముగిసిపోతుంది. ఆ తర్వాత తెరపై ఏం చూపిస్తున్నా పట్టించుకోకుండా లేచి పోయే ప్రేక్షకులే ఎక్కువ. కానీ, అలా ప్రేక్షకులు సీట్లో నుంచి లేవకుండా చివరి వరకూ చూసేంతగా భావోద్వేగాలు ఇందులో పండాయంటేనే ఈ సినిమా ఏ మేరకు ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా ప్రారంభమైన కాసేపటి నుంచే త్రినాథ్, అతని ఊరు, కుమార్తెతో అతనికి ఉన్న బాండింగ్ వంటివి ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఆడపిల్ల ఎవరైనా తనకు కూతురు లాంటిదే అనే త్రినాథ్ మైండ్‌సెట్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్టాఫ్ అరగంట బాగా వాడుకున్నారు. ఆ తర్వాత ఊరిలో ఏదో ఒక సమస్య ఉంటున్నట్లు చూపిస్తూనే, అసలు సమస్య ఏంటో అర్థం కాకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఫస్టాఫ్ అంతా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్‌తో, వారి బాండింగ్‌తో సరదా సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ మొదలయ్యాక అప్పటివరకు ఉన్న జానర్ షిఫ్ట్ అయినట్లుగా ఒక్కసారిగా థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులను ఎవరూ ఊహించని విధంగా రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించిన క్రూషియల్ ట్విస్టులన్నీ ముందే సోషల్ మీడియాలో లీక్ అయిపోతున్న క్రమంలో, వాటిని లీక్ కాకుండా చూసుకోవడంలో దర్శకుడు మొదటి సక్సెస్ సాధించాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ చాలా వేగంగా, ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు. నిజానికి ఇది ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌తో కూడుకున్న కథ కావడంతో, దాన్ని పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప కథలో ప్రేక్షకుడు లీనమవ్వలేడు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని దర్శకుడు ముందు నుంచే తండ్రీకూతుళ్ల ఎమోషన్, వారి మధ్య బాండ్ క్రియేట్ చేసిన విధానం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా త్రినాథ్ క్యారెక్టర్, ఆడపిల్లల పట్ల అతని అభిప్రాయాలు, తన కూతుర్నే కాదు ఏ ఆడపిల్లనైనా కూతురిగా భావించి కష్టం వస్తే అండగా నిలబడే మనస్తత్వం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఉంది. అంతేకాకుండా అయ్యప్ప భక్తులు, కామన్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ థియేటర్లలో ఇంటర్వెల్ తర్వాత మొదలయ్యాక ఒక రకమైన భక్తి మూడ్‌లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత కథను థ్రిల్ మూడ్‌లోకి నడిపించిన విధానం కూడా సరిగ్గా బ్లెండ్ అయింది. క్లైమాక్స్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులందరూ ఎమోషనల్ అయ్యేలా, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులందరూ ఆలోచనలో పడేలా, కొందరిని కన్నీరు పెట్టించేలా ముగించిన విధానం సినిమాకి చాలా ప్లస్ అయింది. మాస్ మహారాజా రవితేజను అయ్యప్పమాల నేపథ్యంలో చూపిస్తామని ప్రకటించినప్పటి నుంచే ‘ఇరుముడి’పై ఆసక్తి మొదలైంది. రవితేజ మాస్ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన భక్తి నేపథ్యాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఎలా డీల్ చేశారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఈ విషయంలో దర్శకుడు తనదైన మార్క్ చూపించారు. అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని తీసుకుని ఓ కుటుంబ కథను రాసుకున్న ఆయన.. దానికి క్రైమ్ ఎలిమెంట్‌ను జోడించి కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచారు. ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కథకు తగ్గట్టుగా మిక్స్ చేయడం సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లను దర్శకుడు బలంగా రాసుకున్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేయడంతో పాటు.. పిల్లలను ఎలా పెంచాలి, వారి విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అనే విషయాలను ఇందులో చర్చించారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. భక్తి నేపథ్యం ఉన్నప్పటికీ ‘ఇరుముడి’ పూర్తిగా భక్తి చిత్రంగా మారిపోలేదు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. రొటీన్ స్టోరీనే అయినా.. స్క్రీన్‌ప్లేను నడిపించిన విధానం ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప పాటలు, భక్తి సన్నివేశాలను కథలో మిళితం చేసిన విధానం సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది. స్కూల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టే టీచర్ సన్నివేశంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత రవితేజ ఎంట్రీ, భార్య-కూతురితో ఆయనకున్న అనుబంధం, కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలు ఫస్టాఫ్ సాగుతుంది. అయితే ఫస్టాఫ్ పూర్తిగా పాజిటివ్‌గా ఉందని చెప్పలేం. ముఖ్యంగా స్కూల్ ఎపిసోడ్స్‌లో కొన్ని సన్నివేశాలు ఒకే తరహాలో రిపీట్ కావడం, కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ లోపాలను అయ్యప్ప పాటలు, భక్తి సన్నివేశాలు కొంతవరకు కవర్ చేశాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. పాత్రల మధ్య సంఘర్షణ, ఎమోషనల్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కథను ముందుకు తీసుకెళ్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉంది. సినిమాకు సంబంధించిన ప్రధాన ఎమోషన్‌ను క్లైమాక్స్‌లో బలంగా క్యారీ చేయడంలో దర్శకుడు మంచి ప్రభావాన్ని చూపించారు. తెలుగులో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి. కాకపోతే కుటుంబ, అయ్యప్ప మాల నేపథ్యంలో ఒక ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘ఇరుముడి’ ప్రత్యేకంగా కనిపిస్తుంది. సినిమా కథ ప్రారంభం ఓ స్కూల్లో టీచర్ సస్పెండ్ అవడంతో మొదలవుతుంది. ఆ తర్వాత కుటుంబం, మణెమ్మతో ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఎప్పుడైతే పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి అనూహ్యంగా చనిపోతుందో, అక్కడి నుంచి కథలో ఉత్కంఠ పెరుగుతుంది. అది విరామానికి వచ్చేసరికి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి, ఎమోషన్ కలిగిస్తుంది. ఈ కథను దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. కథలో మంచి ట్విస్టులు రాసుకున్నారు. అలాగే ప్రీ-క్లైమాక్స్‌కు ముందు కాస్త సాగదీసినట్టుగా అనిపించినప్పటికీ, క్లైమాక్స్‌ను మాత్రం బలంగా రాసుకున్నారు. అదే సమయంలో ఆ క్లైమాక్స్ మనసును కలచివేస్తుంది. ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా కథను దర్శకుడు శివ నిర్వాణ నడిపించారు. అదే సమయంలో ఒక బలమైన సందేశం కూడా ఇచ్చారు. ఆ సందేశం కచ్చితంగా గుర్తుపెట్టుకుని పాటించదగ్గదిగా ఉంటుంది. కూతురంటే ప్రాణంగా భావించే త్రినాథ్, తన పల్లెలోని ప్రతి ఆడ బిడ్డనూ కూతురుగానే భావిస్తాడు. కానీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేక పోవడం, ఆడపిల్లకు అన్యాయం జరిగిందనే తట్టుకోలేక పోవడం అనే బలహీనతలతో అతనికి చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది శత్రువులు తయారవుతారు. వాళ్ళంతా త్రినాథ్ అయ్యప్ప మాల వేసుకుంటే అతనిపై పగ తీర్చుకోవాలని వేచిచూస్తుంటారు. తీరా అతను మాల వేసుకున్న తర్వాత జరగరాని సంఘటనలు ఒక్కొక్కటీ జరిగిపోతాయి. ప్రేక్షకుల ఊహకు కూడా అవి అందనివి! త్రినాథ్ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడంతో సినిమా మొదలై… రకరకాల మలుపులు తిరిగి అతను గురుస్వామిగా మారడంతో కథ సుఖాంతమౌతుంది. అయ్యప్ప మాలలో రవితేజ కనిపించిన ప్రతి సన్నివేశం డివోషనల్ టచ్ తో బాగుంది. మరీ ముఖ్యంగా అయ్యప్పపై పెట్టిన మూడు పాటలు చాలా బాగున్నాయి. పాపులర్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి’ పాట రీమిక్స్ చేయడం ఆకట్టుకుంది. ఆడపిల్ల తండ్రులకు ఈ సినిమా చూస్తున్నప్పుడు భయమేస్తుంది.. అలాంటి కొన్ని మనసును హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్నా కూడా ఇది పక్కా కమర్షియల్ సినిమా. తెలిసిన కథనే కానీ సరికొత్త స్క్రీన్ ప్లేతో చెప్పాడు శివ నిర్వాణ.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆలోచింపచేస్తాయి. ఫస్టాఫ్ అంత సరదా సరదాగా వెళ్ళిపోతుంది. అయ్యప్ప మాలధారణ, భక్తి పాటలు, మధ్య మధ్యలో తండ్రీ కూతుర్ల సెంటిమెంట్.. సెకండాఫ్ మొదలైన తర్వాత గాని అసలు కథ మొదలవదు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఏడిపించాలని ఫిక్స్ అయిపోయి రాసుకున్నాడు శివ నిర్వాణ. ఆడపిల్లను ధైర్యంగా పెంచాలి వాళ్ళలో భయం ఉండకూడదు అనే ఒక మంచి సందేశాన్ని ఈ సినిమాలో చెప్పాడు.
ఎవరెలా చేశారంటే.. రవితేజ అనగానే మాస్ పాత్రలే ఎక్కువగా గుర్తొస్తాయి. ఇందులోనూ ఆయన శైలి మాస్ ఉంది కానీ, అది నేల విడిచి సాము చేస్తున్నట్టుగా అనిపించదు. ఓ సహజమైన పాత్రలో ఆయన ఒదిగిపోతే ఆ ప్రభావం ఎలా ఉంటుందనే ఈ సినిమా చాటుతుంది. చాలా రోజుల తర్వాత రవితేజ కంటెంట్ ఉన్న సినిమా చేశాడు. అయ్యప్ప భక్తుడిగా చాలా బాగున్నాడు. అవలీలగా భావోద్వేగాలు పండించారాయన. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఆయన నటన హైలైట్. సాయికుమార్‌తో కలిసి చేసిన ప్రీ క్లైమాక్స్, ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలతో మరింత కదిలిస్తాడు. ఒక మిడిల్ క్లాస్ ఆటో డ్రైవర్ కమ్ రైతుగా రవితేజ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇప్పటివరకు మాస్ లేదా పోలీస్ పాత్రలలో చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలోని త్రినాథ్ పాత్రతో సులభంగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా రిలేటబుల్ పాత్ర కావడం అతనికి బాగా కలిసివచ్చింది. కెరీర్లో కచ్చితంగా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించాడు. సాధారణ మధ్యతరగతి తండ్రి త్రినాథ్ పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా అన్ని రకాల సన్నివేశాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తండ్రిగా భావోద్వేగాలను పలికించిన సన్నివేశాల్లో రవితేజ నటన మెప్పిస్తుంది. రవితేజ తన మాస్ ఇమేజ్ను పక్కన పెట్టి పూర్తిగా ఎమోషనల్ క్యారెక్టర్లో నటించారు. త్రినాథ్ పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఒకవైపు ఎమోషనల్ తండ్రిగా, మరోవైపు మద్యానికి బానిసైన వ్యక్తిగా, అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడిగా, చివర్లో ఒక తండ్రిగా.. తన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ అన్నింటినీ రవితేజ చాలా పరిణతితో కనబరిచారు. త్రినాథ్ భార్య కావేరిగా ప్రియ భవానీ శంకర్ మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో సహజంగా నటించింది. కావేరి పాత్ర చాలా హుందాగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, భావోద్వేగాలను తన నటనతో చక్కగా చూపించింది. ఆ పాత్ర ఈ సినిమాకు కావాల్సిన ఎమోషన్‌ను యాడ్ చేసింది. ఇక కుమార్తె పాత్రలో కనిపించిన నక్షత్ర నటనకు కూడా మంచి మార్కులు పడతాయి. ఈ సినిమాకు బేబీ నక్షత్ర ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఆమె పాత్ర చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతుంది. కీలక సన్నివేశాల్లో నక్షత్ర అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనతో కట్టిపడేసింది. ఆ పాప తనదైన శైలిలో కొన్ని చోట్ల కళ్లతోనే నటిస్తూ తండ్రితో ఎమోషన్‌ను పండించిన విధానం అభినందనీయం. రవితేజకీ, చిన్నారి నక్షత్రకీ మధ్య సన్నివేశాలే సినిమాకి బలం. గురుస్వామి పాత్రలో చేసిన సాయికుమార్ పాత్ర ఆయనకు చాలా కొత్తగా, అదే సమయంలో ప్రభావవంతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఆ పాత్రకు దర్శకుడు రాసుకున్న ఒక మలుపు కూడా కథకు బలాన్ని చేకూర్చింది. గురుస్వామి పాత్రలో సాయి కుమార్ అనుభవం కనిపిస్తుంది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. ఆయన క్యారెక్టర్ లోని ట్విస్ట్ ను జీర్ణించుకోవడం కాస్తంత కష్టమే. గురుస్వామిగా బాగా సెట్ అయ్యారు. అలాగే అజయ్ ఘోష్ పాత్ర కూడా కావాల్సిన క్యూరియాసిటీని పెంచింది. మలయాళ నటి శ్వాసిక తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా… భిన్నమైన పాత్రలే ఆమెకు లభిస్తున్నాయి. ఇదీ ఆ కోవకు చెందిదే. ఎమ్మెల్యే పాత్రలో నటించిన రమేశ్ ఇందిర పాత్రలు కథలో కీలకం. ఆ పాత్రల్ని డిజైన్ చేసిన తీరు, అందులో వాళ్ల నటన చాలా బాగుంది. ‘జబర్దస్త్’ ఫేమ్ కొమరంకి అతని ఇమేజ్ కి భిన్నమైన రోల్ దొరికింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన మార్క్ చూపించాడు. సీరియస్ సన్నివేశాల్లోనూ మెప్పిస్తూ పాత్రకు న్యాయం చేశాడు. ఇతర ప్రధాన పాత్రలను సురభి ప్రభావతి, రమేశ్ ఇందిర, మీసాల లక్ష్మణ్, కిశోర్ కుమార్, కసిరెడ్డి రాజ్ కుమార్, రమణ భార్గవ్ తదితరులు చేశారు. ఆయా పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
టెక్నీకల్ విషయాలకొస్తే… జీవి ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ఆయన స్వరపర్చిన పాటలు బాగున్నాయి. సినిమా ప్రారంభంలో వచ్చే ‘ఇరుముడి’ పాట, సెకండాఫ్‌లో వచ్చే ‘మల్లె పూల’పాటు అయ్యప్ప భక్తులకు పూనకాలు తెప్పిస్తాయి.అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే మూడు పాటలూ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాలాలో… పాటతోపాటు, పతాక సన్నివేశాల్లో భాగంగా వచ్చే పాట భావోద్వేగాల మోతాదుని మరింత పెంచేందుకు దోహదం చేశాయి. గడిచిన మూడు వారాల వ్యవథిలో తెలుగులో వచ్చిన అతని నాలుగో సినిమా ఇది. ఆయన మ్యూజిక్కు మంచి మార్కులు పడతాయి. అలాగే ‘మల్లెపూల పల్లకి’ పాట థియేటర్లో ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. ఆయన చేసిన నేపథ్య సంగీతం కూడా సినిమా కథకు, కథ మూడ్‌కు తగ్గట్టుగా కుదిరింది. విష్ణు విజువల్స్ సినిమాకి మరో బలం. సీలేరు ప్రాంతాన్ని చూపించిన తీరు, థ్రిల్‌ని పంచే సన్నివేశాల్లో లైటింగ్ కట్టిపడేస్తుంది. అక్కడక్కడా తర్కానికి అందని విధంగా అనిపించినప్పటికీ దర్శకుడు శివ నిర్వాణ రచనే సినిమాకి ప్రధానబలం. తన కలం బలంతో తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త సినిమాని చూపించారు. అనుకున్న భావోద్వేగాల్ని తెరపైకీ బలంగా తీసుకొచ్చారు. దర్శకుడు శివ నిర్వాణ తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా, సుత్తి లేకుండా ప్రేక్షకుల మెదడుల్లో ముద్రపడేలా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. సంభాషణలు చాలా సింపుల్‌గా ఉన్నాయి. సినిమా కోసం ఎంచుకున్న రియల్ లొకేషన్లు కూడా రియలిస్టిక్ ఫీల్ తీసుకురావడంలో ఉపయోగపడ్డాయి. సినిమా నిడివి కూడా తక్కువగా ఉండడం బాగా కలిసొచ్చింది. విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో లేనంత ప్రెస్ లొకేషన్స్ ఇందులో ఉన్నాయి. ఈ లొకేషన్స్ అన్నీ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. సీలేరు ప్రాంతంలో తీసిన చిత్రమిది. అన్ని ఒరిజినల్ లొకేషన్స్ కావడంతో కథ నిజంగా అక్కడే జరుగుతున్నట్టుగా అనుభూతిని కలిగించింది. ఎడిటింగ్ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
