ఈమధ్య సినిమాల ప్రచారాలు కొంచెం విచిత్ర ధోరణిలోనే వెళుతున్నాయని చెప్పుకోవచ్చు. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా చిత్ర నిర్వాహకులు కూడా వైవిధ్యంగా ఉండటం కోసమని ఏకంగా స్మశానవాటికలోనే తమ సినిమా టీజర్ లాంచ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్ లాంచ్ చేస్తున్నాం అని ఆ చిత్ర పీఆర్ విూడియా వాళ్ళకి మెసేజ్ లు పంపాడు. ఈ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా ఇంతకు ముందు విడుదలై ఘన విజయం సాధించిన ‘గీతాంజలి’ కి సీక్వెల్ గా వస్తోంది. ఇందులో అంజలి ప్రధానపాత్రలో నటించింది. శివ తుర్లపాటి దీనికి దర్శకుడు, కోన వెంకట్ కథని సమకూర్చారు, ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగం అయ్యారు. ఇంకా ఇందులో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ ఇంకా చాలామంది నటీనటులు నటించారు. ఈ సినిమా నటి అంజలికి 50వ సినిమా కావటం ఆసక్తికరం. ఈసారి ప్రచారాలు వినూత్నంగా ఉండాలని చిత్ర నిర్వాహకులు అనుకు న్నారేమో, అందుకని ఈ చిత్ర ప్రచార చిత్రాలు బేగంపేట లోని స్మశానవాటికలో చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమా నేపధ్యం హర్రర్ అవటం, ఇందులో దెయ్యాలు, ఆత్మలు లాంటివి ఉండటం మూలాన, స్మశానంలో ప్రచారం చెయ్యాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
స్మశానంలో ‘గీతాంజలి మళ్లీ వచ్చేసింది’ టీజర్ లాంచ్ కార్యక్రమం!?
