తెలంగాణ పల్లెల్లో వున్న సంప్రదాయం, కట్టుబాట్లు, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆచారాల గురించి చెప్పే కథలతో వస్తున్న సినిమాలకు టాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రేక్షకుల ముందుకొస్తున్న భావోద్వేగమయిన కథలు సహజంగానే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కుటుంబం కానీ, గ్రామం కానీ, లేదా ఎక్కడ అయినా, అందరూ కలిసి ఉంటే అదే ఒక ‘బలగం’ అవుతుంది అనే చెప్పే కథతో వచ్చిన తాజా చిత్రమిది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన ఈ ‘బలగం’ చిత్రంతో ‘జబర్దస్త్’ టీవీ షోతో బాగా పాపులారిటీ సాధించిన నటుడు వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామం లో ఈ సినిమా కథ మొత్తం జరుగుతుంది. భీమ్స్ సిసిరోలియో దీనికి సంగీతం సమకూర్చగా, కాకర్ల శ్యామ్ ఈ చిత్రంలోని పాటలన్నీ రాసాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పక్కా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తక్కువ సినిమాలొచ్చాయని చెప్పొచ్చు. `ఫిదా`, `లవ్ స్టోరీ` వంటి కొన్ని చిత్రాల్లో కొంత ఆవిష్కరించారు. కమర్షియల్‌గా చూపించే ప్రయత్నమే చేశారు. కానీ మొదటిసారి ఓ పూర్తి స్థాయి తెలంగాణ గ్రామీణ సంస్కృతి, యాస, కట్టుబట్ట, కట్టుబాట్లని ఆవిష్కరిస్తూ వచ్చిన చిత్రం ఈ `బలగం. ఈ సినిమా విడుదలకి ముందే నిర్మాత దిల్ రాజు చాలా మందికి చూపించాడు అంటే, అతనికి ఈ సినిమా మీద ఎంత నమ్మకం ఉందో ఇట్టే అర్ధమవుతోంది. ఈ నెల 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం….
కథలోకి…
ఈ సినిమా కథ అంతా తెలంగాణ లోని ఓ పల్లెలో జరుగుతుంది. కొమరయ్య (సుధాకర్ రెడ్డి) అనే ముసలాయన ఆ గ్రామంలో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, హాస్యోక్తులు విసురుతూ, తెల్లవారు జామునే అందరినీ నిద్రలేపుతూ తన పొలంలోకి వెళ్లి వస్తూ ఉంటాడు. అతడికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంటుంది. కొమరయ్య మనవడు (పెద్ద కొడుకు కుమారుడు) శైలు (ప్రియదర్శి) అప్పు చేస్తాడు,పెళ్లి చేసుకొని వచ్చిన కట్నం డబ్బుతో ఆ అప్పు తీర్చేయాలి అని అనుకుంటాడు. కానీ తాత కొమరయ్య మరణించడంతో అది కాస్తా వాయిదా పడుతుంది. కొమరయ్య కూతురు కొన్నేళ్లుగా పుట్టింటికి రాదు, కానీ కొమరయ్య చనిపోయాడు అని తెలుసుకున్న వెంటనే, తండ్రి శవాన్ని చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చివాలుతుంది. అలాగే సూరత్ లో వున్న కొమరయ్య చిన్న కొడుకు, కోడలు కూడా తండ్రి మరణించాడు అనగానే వచ్చేస్తారు. కొమరయ్య అల్లుడు, పెద్ద కొడుకు మోహ మొహాలు చూసుకోకుండా కూర్చుంటారు, వాదించుకుంటారు, కొట్టుకుంటారు. మూడోరోజు పిండం పెడతారు. గ్రామంలో ఉన్నవారంతా ఊరి బయటకి వచ్చి పిండం పెట్టి కాకి కోసం ఎదురుచూస్తారు. కాకి వస్తుంది కానీ పిండం ముట్టదు. గ్రామ పెద్దలు కొమరయ్యకి ఏమి కోర్కెలు ఉన్నాయో అవి తీరిస్తే కాకి వచ్చి ముట్టుకుంటుందని కొడుకులకి, అల్లుడికి చెబుతారు.ఇంతకీ.. కొమరయ్య కి కోర్కెలు ఏమున్నాయి? గ్రామ పెద్దలు కొమరయ్య కుటుంబానికి ఎలాంటి హెచ్చరిక చేశారు? ఇంతకీ నాన్న, మామల మధ్య గొడవేంటి? కుటుంబంలో ఉన్న గొడవలేంటి? కాకి ఎందుకు ముట్టలేదు? కొమురయ్య మనసులో ఏముంది? కాకి వచ్చి పిండం తినటానికి ఆ కుటుంబం చివరికి ఏమి చేసింది అన్నదే ‘బలగం’ కథ.
విశ్లేషణలోకి…
ఏ సినిమాకైనా ఎమోషన్ ముఖ్యం. అది పండితే అది ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. దానికి భాషభేదం ఉండదు. ఆ భావోద్వేగాలు కనెక్ట్ అయితే ఆ కథతో ట్రావెల్ చేస్తాడు ప్రేక్షకుడు. దానితో మమేకమై వెండితెరపై జరిగే అనుభూతులను తాను పొందుతుంటాడు. సినిమాలో తనే జీవిస్తాడు. అలాంటి భావోద్వేగాల సమాహారంగా ఈ `బలగం` చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించాడు దర్శకుడు వేణు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది. ఈ సినిమాలో కథే హీరో, కాకినే హీరోయిన్. కాకీనే సినిమాని నడిపిస్తుంది. మనుషుల్లో ఉన్న స్వార్థాలను బయటపెడుతుంది, చిన్న గాలికే చెదిరిపోయే మానవ సంబంధాలను ప్రశ్నిస్తుంది. అంతేకాదు సినిమాలో మనమే ఉన్నట్టు, మన చుట్టూతే సినిమా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతటి సహజంగా, అంతటి భావోద్వేగంతో, అంతటి ఫన్‌తో ఈ సినిమాని రూపొందించాడు దర్శకుడు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫక్తు తెలంగాణ చిత్రం ఇది. `కాకి` చుట్టూ అల్లుకున్న కథ. కాకీ చాటున మానవీయ విలువలను, కుటుంబ అనుబంధాలను, మానవత్వపు మమకారాన్ని కలగలిపి తెలంగాణ పల్లె జీవితాన్ని ఆవిష్కరించిన కథ. తాత కొమురయ్య పాత్ర పరిచయంతో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఓ వైపు తాత చనిపోయాడనే విషాదం ఉన్నా, దాన్ని ఫన్నీ వేలో చూపించిన తీరు మాత్రం బాగుంది. ఊర్లల్లో వ్యక్తి చనిపోతే ఇరుగుపొరుగు ఆడలక్కలు ఏడుపులు, కూల్ డ్రింక్‌ల కోసం చేసే ఓవర్ యాక్టింగ్ ని ఫన్నీ వేలో చూపించడం నవ్వులు పూయిస్తుంది. మరోవైపు తాత చచ్చిపోయిండన్న బాధ లేకుండా కాబోయే భార్యని ప్రియదర్శి సైగలతో మ్యానేజ్ చేసే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మందు కోసం, ముక్క కోసం ఇరుగు పొరుగు వాళ్లు ఎదురుచూడటం వంటి సన్నివేశాలు కామెడీగా లైటర్ వేలో చూపించారు. అయితే సినిమా ఫస్టాప్ మొత్తం పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడం, కొమురయ్య మరణంపైనే సాగుతుంది. కాకీ ముద్ద ముట్టడానికి సంబంధించిన సన్నివేశాల సాగతీత కూడా కొంత బోర్ ఫీలింగ్ తెప్పిస్తుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు సిల్లీగానూ అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుంది. 11రోజుల కార్యక్రమం(పెద్ద కర్మ) రోజు కుటుంబంలోని చిన్న చిన్న మనస్పర్థలను, కలహాలను, మనసులో దాగున్న బాధలను బయటపెడుతూ బుర్రకథ చెప్పిన తీరు బాగుండటమే కాదు, సినిమాకి అదే ఆయువు పట్టుగా నిలిచింది. అది కుటుంబ సభ్యులను కదిలించి వారిలో మార్పు తేవడమేకాదు, థియేటర్లలో కూర్చొన్న ప్రేక్షకులని కూడా కదిలిస్తుంది. గుండెబరువెక్కిస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. తెలంగాణ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. వేణు ఎల్దండి మనకి ‘జబర్దస్త్’ షో లో ఒక కమెడియన్ గా తెలుసు, అలాగే అప్పుడప్పుడూ సినిమాల్లో నటుడిగా కూడా చూస్తాము. కానీ మొదటి సారి ‘బలగం’ అనే ఈ సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కానీ మొదటి సినిమా ఒక మంచి కథతో రావటం విశేషం. బలగం అనే సినిమా ఒక భావోద్వేగానికి చెందినది, తెలంగాణ పల్లె జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే కథ. ఊరి వాతావరణం, మనసులో ఏ కల్మషం లేని మనుషులు, వారి మనస్తత్వాలు గొప్పగా చూపించిన దర్శకుడు వేణు తన ప్రతిభని చాటాడు. కాకి చుట్టూ, లేదా చనిపోయిన కొమరయ్య చుట్టూ కథ అల్లాడు. ఆ చిన్న కాకిని పట్టుకొని వేణు ఒక గ్రామానికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించి ఒక మానవీయ విలువలను, కుటుంబ అనుబంధాలను అద్భుతంగా తన సినిమాలో ఆవిష్కరించాడు. ఆ చావులోనే హాస్యాన్ని పండించాడు, దానిలోనే భావోద్వేగాలను చూపించాడు, ఏడిపించాడు, నవ్వించాడు. ఊరి మనషులకు ఉండే పంతాలు, పట్టింపులను చక్కగా చూపించారు. అవన్నీ చాలా సహజంగా ఉంటాయి. మనకి తెర మీద ఒక కథ కనిపిస్తూ ఉంటుంది, పాత్రలు కనిపిస్తాయి, వారి జీవన శైలి కనిపిస్తుంది. కొమరయ్య లాంటి తాత దాదాపుగా ప్రతి గ్రామంలోని ఇంట్లో ఉంటాడు. ఎందుకంటే తాతే కదా ఎప్పుడూ ముందు లేచేది, అందరినీ లేపేది. అందరూ అదే తాత మీదే కదా విసుక్కునేది, జోక్స్ వేసేది కూడా. పొద్దున్నే వచ్చి నిద్ర లేపితే ‘పొద్దున్నే ఎందుకు అలా కాకిలా అరుస్తావ్’ అని అంటాం కదా, కానీ అలాంటి తాత కోసం మనవడు క్లైమాక్స్ లో ఎంత పెద్ద తప్పు చేశాను, నా స్వార్ధం కోసం తాత చావుని వాడుకున్న, ఇంక తాత కనిపించడు అని మనవడు ఏడుస్తుంటే చూస్తున్న వాళ్ళ కళ్ళల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. అలాగే గ్రామస్థులు 11 వ రోజు కాకి కనక పిండం ముట్టుకోకపోతే, ఆ కుటుంబాన్ని వెలివేస్తాం అని హెచ్చరిస్తారు. ఆ 11వ రోజు బుర్రకథ చెపుతూ, ఆ కుటుంబం లోని ఒక్కో మనిషి గురించి పాటల రూపంలో ఎలా నడుచుకోవాలో, కుటుంబ గౌరవ మర్యాదలు ఎలా పాటించాలి, బిడ్డల ఆలనాపాలనా ఎలా చూసుకోవాలి, మనుషుల మధ్య ఉండాల్సిన విలువలు, బంధాలు, బాంధవ్యాలు ఒకటేంటి అన్నీ కూలంకషంగా చెప్తారు. అదే విధంగా అన్నదమ్ములు, అన్న చెల్లెల మధ్య ఆప్యాయతల గురించి చెపుతూ అల్లిన ఆ చివరి 15 నిముషాల ప్రతి సన్నివేశం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది, కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఎవరెలా చేశారంటే…
సాయిలు పాత్రలో ప్రియదర్శి పరకాయ ప్రవేశం చేశాడని చెప్పొచ్చు. ప్రియదర్శికి ఇది ఒక మంచి పాత్ర. చాలా చక్కగా ఆ పాత్రలో అమిరిపోయాడు. పెళ్ళి కోసం, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటప్పుడు, మరదల్ని లైన్‌లో పెట్టే సన్నివేశాల్లో అందర్నీ ఆకట్టుకున్నాడు. అందులోనే నవ్వులు పూయించాడు. అతని పాత్రలో కామెడీ, ఎమోషన్, బాధ్యత కనిపిస్తుంటాయి. ఇక ప్రియదర్శి మరదలిగా చేసిన కావ్యా కళ్యాణ్ రామ్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. మామూలు సినిమాలో చూస్తున్నట్టుగా ఇందులో కథానాయిక ఉండదు, కానీ సహజంగా ఉంటుంది. ఆమె పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఆమె చెప్పే రెండు మూడు మాటల వలన, ఆమె తండ్రి తన నడవడి మార్చుకుంటాడు. కొమురయ్యగా సుధాకర్‌రెడ్డి కాసేపే అయినా అలరించారు. మామగా మురళీధర్, తండ్రిగా జయరాం చక్కటి నటన కనబరిచారు. రచ్చ రవి కామెడీ సహజధోరణీలో సాగింది. అతడికి ఇలాంటి పాత్రలు కొట్టినపిండే. రెండు నిముషాలు ఆగుతావా అంటూ ఒక చిన్న మేనరిజమ్ తో అందరినీ నవ్విస్తాడు. కొమురయ్య నాకేం చెప్పలే, నేనేం వినలే అంటూ అలరించాడు. రూప లక్ష్మి, విజయలక్ష్మి, వేణు పాత్రలు ఓకే అనిపిస్తాయి. సినిమాలో ప్రతి పాత్ర అలరిస్తుంది. ఈ సినిమాలో ఎక్కువమంది కొత్త వారు నటించారు. అసలు వాళ్లంతా నటులా, లేక సహజంగా ఆ గ్రామంలో వున్న మనుషులని యధావిధిగా ఇందులో పెట్టరా అన్నంత సహజంగా నటించారు. అక్కడ పాత్ర మాత్రమే కనపడుతుంది తప్ప, అది ఎవరు చేసారు అన్నది కనిపించదు, అంతలా ఆ పాత్రలో ప్రతి ఒక్కరు ఇమిడిపోయారు. అలాగే దర్శకుడు వేణు కమెడియన్ గా అందరికీ పరిచయం కాబట్టి తన మార్కును టైలర్ నర్సిగా అలరించాడు.
టెక్నీకల్ విషయాల కొస్తే…
ముందుగా చెప్పుకోవలసింది భీమ్స్ సిసిరోలియో సంగీతం గురించి. అయన అందించిన సంగీతం, బీజీఎం సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి. తెలంగాణ పల్లెని గుర్తు చేసేలా కాసర్ల శ్యామ్ పాటలు హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. ఈ పాటలే సినిమాకి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తాయి. పాటల్లో తెలంగాణ సాహిత్యం, వాణి, బాణీ, సంప్రదాయం అన్నీ కలగలిపి పరవళ్ళు తొక్కాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పాట కన్నీళ్లు తెప్పిస్తుంది. పాటలు అన్నీ కూడా వినసొంపుగా వున్నాయి. ఆచార్య వేణు కెమెరా వర్క్ సూపర్ గా ఉంది. తెలంగాణని, కల్చర్‌ని, అందులోని ప్రతి మూవ్‌మెంట్‌ని స్పష్టంగా చూపించారు. చాలా చోట్ల కెమెరానే మాట్లాడుతుంది. కెమెరానే కథ చెబుతుంది. పల్లె వాతావరణం, ఆ గ్రామ ప్రజల గుండె చప్పుడుని చక్కగా చూపించాడు. పచ్చని పొలాలు, చెట్లు, రచ్చ బండ ఇవన్నీ చూడటానికి చాలా సహజంగా వున్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. మొత్తమీద ‘బలగం’ అనే సినిమా తెలంగాణ గ్రామంలో వున్న సంప్రదాయం, కట్టుబాట్లు, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆచారాలు గురించి చెప్పే భావోద్వేగమయిన కథ. నూటికి నూరుపాళ్లు ఇది తెలంగాణ పల్లె జీవిత కథ. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా!
(చిత్రం : బలగం, విడుదల తేదీ : మార్చి 3, 2023, రేటింగ్ : 3/5, దర్శకత్వం: వేణు ఎల్దండి,నిర్మాత: హర్షిత్ రెడ్డి-హన్షిత, సమర్పణ : శిరీష్, నటీనటులు: ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, రూప లక్ష్మి, వేణు ఎల్దండి, విజయలక్ష్మి తదితరులు. ఛాయాగ్రహణం: ఆచార్య వేణు, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, పాటలు : కాసర్ల శ్యామ్)