1984 ఆగస్టు 16న నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్ లాల్, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక పద్ధతులతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి నెల రోజుల వ్యవధిలో దేశంలోని ప్రధాన కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ కూడగట్టి మహోద్యమ రీతిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నిర్వహించి సెప్టెంబర్ 16 1984 న తిరిగి అధికారాన్ని అధిష్టించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు సృష్టించిన చరిత్రను ఆనాటి నుండి ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం గా జరుపుకుంటున్నట్టు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అధ్యక్షులు టి డి జనార్దన్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ కార్యాలయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నందమూరి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన శ్రీమతి ప్రతిభాభారతి, మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీ డీ జనార్ధన్, విశిష్ట అతిథులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ అసెంబ్లీ స్పీకర్ శ్రీమతి ప్రతిభాభారతి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో తాను చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రస్తావించారు. చిన్న వయసులోనే 1983లో తనకు పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసిన ఘనత ఎన్టీఆర్ దే అని చెప్పారు. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కరరావు, గవర్నర్ రామ్ లాల్, శ్రీమతి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రపన్ని ఎన్టీ రామారావుని పదవిచ్యుతున్ని చేసినప్పుడు తామందరం అన్నగారికి అండగా నిలబడ్డామన్నారు. ఆ నెల రోజులలో జరిగిన చేదు సంఘటనలు దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని తెలియచెప్పడానికి తామందరం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ఎదుట పెరేడ్ చేశామని, ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం మేరకు బెంగళూరుకు, మైసూర్ కు, నంది హిల్స్ కు వెళ్లామని నెలరోజుల తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం లభించిందని, ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఎన్టీఆర్ చేసిన పోరాటం వలన కేంద్రం దిగొచ్చిందన్నారు. ఈ మొత్తం ఉదంతంలో నాడు చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఎమ్మెల్యేలందరిని రామకృష్ణ సినీ స్టూడియోలో ఉంచాలన్నది ఆయన ఆలోచనే అని అన్నారు.
మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆనాటి సంఘటనలను మననం చేసుకున్నారు. తనలాంటి సామాన్య దళితులను ఆదరించి అక్కున చేర్చుకొని ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ నీతి నిజాయితీలకు మారుపేరని, అవినీతిని సహించరని, మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ ది అని పేర్కొన్నారు. అటువంటి రాజకీయ నాయకుడు దేశ రాజకీయాల్లో అరుదు అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన ఔన్నత్యం భావజాలం భావితరాలకు తెలియజేయడానికి తన మిత్రుడు సీనియర్ రాజకీయ నాయకుడు టీడీ జనార్దన్ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీని ఏర్పాటు చేసి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన పేరును అజరామరం చేస్తున్నందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వంలోని విశేషాలను వివరించారు. సినీ నటుడిగా ఉంటూ చేయి విరిగిన సందర్భాల్లో కూడా నిర్మాతకు నష్టం రాకూడదనే భావంతో ఎన్టీఆర్ గారు అలాగే షూటింగ్ లలో పాల్గొనేవారున్నారు. 1984 ఆగస్టు సంక్షోభం తమ కుటుంబానికి వ్యక్తిగతంగా ఓ పీడకల లాంటిది అన్నారు. తమ మాతృమూర్తి అనారోగ్యం పాలైన సందర్భంలోనే తమ తండ్రిగారు ఎన్టీఆర్ అమెరికాలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు పదవిచ్యుతున్ని చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. తమ వివాహాలకు కూడా తమ తండ్రి హాజరు కాలేదని ఆ సమయంలో ఆయన ప్రజలతోనే ఉండడం తమకు ఎప్పటికీ గర్వకారణం అని అన్నారు.
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు టిడి జనార్ధన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించి ఎన్టీఆర్ ఆశీస్సులతో చిన్నతనంలోనే కృష్ణా జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షునిగా కాగలిగానని ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఎన్టీఆర్ చంద్రబాబు గార్ల ప్రోత్సాహంతో తొమ్మిదేళ్లు ఆప్కాబ్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా పనిచేశానన్నారు ఇక పార్టీ పరంగా అనేక బాధ్యతలు నిర్వహించాల,ని పార్టీ తనకు తల్లి లాంటిదని అన్నారు.
తనకు తెలుగుదేశం పార్టీ ద్వారా గుర్తింపు గౌరవం అందించిన ఎన్టీ రామారావు గారి రుణం తీర్చుకోవడానికి, ముఖ్యంగా సినీ నటుడిగా రాజకీయ నాయకుడిగా, పరిపాలన దక్షకుడిగా, ఎన్టీరామారావు గారి జీవితంలోని మహోన్నత ఘట్టాలను శాశ్వతంగా గుర్తుండి పోయేందుకు ఆయన శతజయంతి సంవత్సరంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ సినీ చరిత్ర, భావజాలం, పాలన విజయాలపై ఇప్పటివరకు 7 గ్రంథాలు వెలువర్చామని, వీటన్నింటినీ ఇంగ్లీషుతో సహా ఇతర ప్రాంతీయ భాషల్లోకి అనువదించి ప్రచురిస్తున్నట్లు తెలిపారు.
క్రిందతేడాది సెప్టెంబర్ 16న “1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం – సజీవ చరిత్ర” అనే గ్రంధాన్ని జర్నలిస్టు విక్రమ్ పూల తో కలిసి రచించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, శ్రీ ఎం .వెంకయ్య నాయుడు శ్రీ ఎన్.ఇంద్రసేనారెడ్డి, శ్రీ అయ్యన్నపాత్రుడు తదితరుల సమక్షంలో ఆవిష్కరించినట్లు తెలిపారు. తెలుగుదేశం చరిత్రలో ఈ సంఘటనకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఈ సంఘటన తర్వాత దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పులు వచ్చాయని అంతటి ప్రాముఖ్యం కలిగిన సంఘటనను డాక్యుమెంట్ చేయడం ఎంతో సంతృప్తి కలిగిస్తుందన్నారు.
అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితానికి సంబంధించిన విశేషాలు ప్రముఖులతో ఇంటర్వ్యూలు అందిస్తున్నామని ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా బ్లాగ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తామని, తమకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, సహాయ సహకారాలు ఉన్నాయని.. యువనేత శ్రీ నారా లోకేష్ తమకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కమిటీ సభ్యులు విక్రమ్ పూల, భగీరథ,మధుసూదన రాజు, శ్రీపతి సతీష్, మండవ సతీష్, వెంకట్రావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు, హేమ సుందర్, బిక్కీ కృష్ణ, సాయి జ్యోతి, ప్రకాశం తదితరు పాల్గొన్నారు.

