ప్రముఖ తమిళ చలనచిత్ర దర్శకులు, పదహారేళ్ల వయసు, సీతాకోకచిలుక, ఆరాధన వంటి ఎన్నో కళాత్మక కమర్షియల్ చిత్రాల సృష్టికర్త, ఎందరో నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని వెండితెరకు పరిచయం చేసిన దిగ్దర్శకులు భారతీరాజా ఇకలేరు అన్న విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. కళామతల్లికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాద్ రావు, కార్యదర్శి సురేష్ కొండేటి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం అని పేర్కొన్నారు. 1941 జులై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు. ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ‘మంగమ్మగారి మనవడు’కు కథను, ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడురమ్’ సినిమాలో భారతీరాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. గతేడాదిలో ఆయన తనయుడు, నటుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుంగిపోయారు. ఈ విషాదం తర్వాత చాలామంది ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. కుమారుడు మనోజ్ హఠాన్మరణం చెందడం భారతీరాజాను తీవ్రంగా కలిచి వేసింది. ఆపై రెండు మూడు నెలల్లోనే ఆ ఆవేదనతో అనారోగ్యం బారిన పడిన ఆయన హాస్పిటల్లో నెల రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని మూడు నెలల క్రితమే ఇంటికి వచ్చి అక్కడే చికిత్స పొందుతున్నారు. సడన్‌గా బుధవారం ఉదయం సమస్య తీవ్రం కావడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన భారతీరాజా అధికంగా తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించగా తెలుగులో చాలావరకు రీమేక్ అయ్యాయి. అంతేగాక కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని చిత్రాలు స్ట్రెయిట్‌గా తెలుగులో తీసి ఇక్కడా అదే ఆదరణ దక్కించుకున్నారు. ఆయన శిష్యులు అనేకమంది దర్శకులుగా మారారు. వారిలో తెలుగు నుంచి సీనియర్ వంశీ వంటి వారు ఉన్నారు. రాధ, రాధిక, రేవతి, ముచ్చర్ల అరుణ, కార్తీక్ వంటి నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. నాటి వర్ణ వివక్షను ఎదురొడ్డి చిత్రసీమలో నిలిచిన భారతీరాజా అనతి కాలంలోనే దేశం గర్వించే దర్శకుడిగా ఎదిగారు. కొన్నాళ్ల క్రితం దర్శకత్వానికి రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన పలు చిత్రాల్లోనూ నటించారు. చివరగా మోహన్ లాల్ ‘తుడరుమ్’ చిత్రంలో నటించారు. ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా గారి మరణం భారతీయ సినిమాకు తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాపం తెలిపారు.
దర్శకుడు భారతీరాజా మృతికి ఫిలిం క్రిటిక్స్ సంతాపం
