బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ రూటే వేరు. తను చేస్తున్న చిత్రాలయితేనేమి.. పోషిస్తోన్న పాత్రలయితేనేమి.. వేటికవే భిన్నంగా ఉంటూ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో యశ్‌తో పాటు ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యుమా ఖురేషీ, ఎలిజిబెత్‌గా, నయనతార గంగ పాత్రలో, రెబెకాగా తారా సుతారియా అలరించనున్నారు. మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ కూడా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కియారా టాక్సిక్ సెట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. సెట్‌లోకి అడుగుపెట్టగానే ఎవరికీ ‘హాయ్, హలో’ చెప్పొద్దని దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని కూడా కియారా వెల్లడించారు. ‘‘గీతూ ఒకసారి నాకు ఫోన్ చేసి.. ‘రేపు నువ్వు సెట్‌కి రాగానే పూర్తిగా ఆ పాత్రలోనే ఉండాలి’ అని అన్నారు. సాధారణంగా నేను సెట్‌లోకి రాగానే అందరినీ పలకరిస్తూ హాయ్, ఎలా ఉన్నారు, గుడ్ మార్నింగ్ అని చాలా ఉత్సాహంగా మాట్లాడే మనిషిని. కానీ ఆమె మాత్రం.. ‘ఎలాంటి మర్యాదలు, పలకరింపులు వద్దు. నువ్వు నేరుగా ఆ క్యారెక్టర్ జోన్‌లోకి వచ్చేయాలి. నీ టీమ్‌తో సహా ఎవరికీ హాయ్, హలో చెప్పడానికి వీల్లేదు. పూర్తిగా నీ పాత్రకు సంబంధించే ఆలోచించాలి’ అని చెప్పారు. ఆమెకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోయా’’ అని కియారా తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం కన్నడలో మాట్లాడటం కూడా తనకో పెద్ద సవాలుగా మారిందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఒకే సీన్‌ను మొదట ఇంగ్లిష్‌లో, ఆ తర్వాత కన్నడలో షూట్ చేసేవారని తెలిపారు. షూటింగ్‌కు ముందు రోజు రాత్రంతా కూర్చుని డైలాగులను బట్టీ పట్టాల్సి వచ్చేదని చెప్పారు.
కియారా రూటే వేరు..!
