సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం : నిర్మాత ఆర్.బి చౌదరి మృతి

A great tragedy in the film industry: Producer R.B. Chowdhury passes away
Spread the love

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, తమిళ్ హీరో జీవా తండ్రి ఆర్. బి. చౌదరి మరణించారు. మంగళవారం ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా చిత్రసీమ దిగ్బ్రాంతికి గురైంది. ఆర్. బి. చౌదరి పూర్తిపేరు.. రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. ఆయన చిత్రపరిశ్రమలోకి రాకముందు ఉక్కు ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలో పనిచేశారు. 1989లో ఆర్.బి.చౌదరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మలయాళంలో పలు సినిమాలు చేశాక.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ను స్థాపించి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 99 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో 100వ సినిమాగా ‘మకుటం’ తెరకెక్కుతోంది. విశాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం సెట్స్ పై ఉంది. ముఖ్యంగా తెలుగులో సూపర్ గుడ్ ఫిల్మ్స్ .. ఎన్నో మంచి విజయాలను అందించింది. ‘పుదు వసంతం’ సినిమాను తెలుగులో ‘నవ వసంతం’ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమాతోనే ఆర్.బి. చౌదరి టాలీవుడ్ కి ఎంటర్ అయ్యారు. ఆ తరువాత సుస్వాగతం, సూర్యవంశం, రాజా, శీను, నువ్వు వస్తావని, సింహరాశి, నిన్నే ప్రేమిస్తా, సంక్రాంతి, అందాల రాముడు, అన్నవరం, తరుణ్ నవ వసంతం, రచ్చ, గోరింటాకు, ఇష్క్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలను నిర్మించారు. ఆర్. బి. చౌదరికి నలుగురు కుమారులు. సురేష్, జీవన్, జితన్ రమేష్, జీవా. సురేష్.. తండ్రిలానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. జీవన్.. తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నాడు. రమేష్.. 2010 లో విద్యార్థి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆశించిన విజయం దక్కక ప్రస్తుతం సోదరుడితో కలిసి బిజినెస్ చేస్తున్నాడు. చివరి కుమారుడు జీవా.. కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతోన్నాడు. ఆర్. బి. చౌదరి మరణించారు అన్న వార్త తెలియడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తోన్నారు.

ఆర్.బి చౌదరి మరణం దిగ్భ్రాంతికరం : పవన్ కళ్యాణ్

ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని చౌదరి గారు నిర్మించారు. ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

Related posts