ఆలేరు : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ ఎపిసోడ్ అంతా పొలిటికల్, ఫ్యామిలీ డ్రామా అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ కొట్టిపారేశారు. భవిష్యత్తులో అందరూ కలిసిపోతారని జోస్యం చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ .. కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడా? నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని స్థితికి చేరుకున్నాడా? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారని తేల్చి చెప్పారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిదే కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా? కేటీఆర్‌ను కవిత వెనకేసుకురావడం పెద్ద డ్రామా…మొదట కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావు లను టార్గెట్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదేమైనా కవిత సస్పెన్షన్ ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అని కామెంట్ చేశారు. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కవితే అంగీకరించారని, గతంలో కవిత… మాజీ మంత్రి జగదీశ్ రెడ్డినీ విమర్శిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కానీ కుటుంబ సభ్యులైన హరీష్ రావు, సంతోష్ రావుపై ఆరోపణలు చేయగానే సస్పెండ్ చేశారని నీలం పద్మ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో హరీష్ రావు పనిచేస్తున్నారని కవిత మాట్లాడటం రాజకీయ ఆజ్ఞానానికి నిదర్శనమన్నారు. 2018లో కొడంగల్ ఇన్చార్జిగా రేవంత్ రెడ్డి ని వోడగొట్టేందుకు హరీష్ రావు వందల కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. నిజంగా హరీష్ రావును రేవంత్ రెడ్డి గారు కాపాడాలనుకుంటే… కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు విచారణ చేస్తారు? కాళేశ్వరం అవినీతిలో హరీష్ ది పెద్ద చెయ్యి అని విమర్శించారు.
కవిత ఎపిసోడ్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ
