దర్శకుల చేతుల మీదుగా జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ పుస్తకం ఆవిష్కరణ!

GR Maharishi's 'Morning Show' book was launched by the directors!
Spread the love

సినిమా అంటే చాలామందికి ఒక ఎమోషన్. చిన్నప్పటి నుంచీ చూసిన సినిమాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటారు. కొందరు మాత్రమే ఆ స్పందనను రికార్డ్ చేస్తారు. అలా.. సుదీర్ఘ కాలంగా సినిమా జర్నలిస్ట్ గా తనకున్న అనుభవాలు, అనుభూతులతో పాటు చిన్నప్పటి నుంచీ తను చూసిన సినిమా విశేషాలు, సంగతులను గురించి విపులంగా వివరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ అనే పుస్తకాన్ని రాశారు. యాభై యేళ్లుగా తను చూసిన సినిమాలతో పాటు పరిశ్రమలోని మార్పులు, కథ, కథనాల్లో వచ్చిన మార్పులను గురించి ఆలోచనాత్మక విశ్లేషణతో ఆయన రచించిన ఈ పుస్తకాన్ని జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దర్శకుడు కుమారస్వామి(అక్షర) ప్రచురించారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆత్మీయ అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘‘ షరతులు వర్తిస్తాయి సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్న కుమార స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. కుమారస్వామి ఎంతో కష్టపడి, నిబద్ధతతో ఈ పుస్తక ముద్రణ కోసం శ్రమించారు. అంతకంటే ఎక్కువగా తన షరతులు వర్తిస్తాయి సినిమా కోసం కృషి చేశారు. త్వరలో విడుదల కాబోతోన్న ఆ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక జిఆర్ మహర్షి గారితో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది. వారు చిన్న తనం నుంచీ చూసిన సినిమాల సంగతులను తనకే సొంతమైన ఒక సెటైరికల్ వేలో రాశారు. ఈ పుస్తకం కేవలం సినిమా విశేషాలను గురించి మాత్రమే కాదు.. అనేక ఆలోచనలను కలిగించేలా ఉంది. ఒక్కసారి చదవడం మొదలుపెడితే.. ఇంక ఆపలేం. అంత గొప్పగా మహర్షి గారు ఈ పుస్తక రచన చేశారు. సాహిత్యం, సంస్కృతి కలయికే సినిమా. ఏ సినిమా కథైనా మొదట పుట్టేది పేపర్ పైనే. అలా సాహిత్యం ద్వారానే సినిమా మొదలవుతుంది. ఆ కథ రాసిన రచయితే మొదటి ప్రేక్షకుడు. అందుకే సాహిత్యం లేనిదే కళ కూడా లేదు అంటాను. ఈ పుస్తకం ద్వారా ఇప్పటి వరకూ సినిమా రంగంలో వచ్చిన అనేక మార్పులను మనకు పరిచయం చేశాడు రచయిత. ఆయన హాస్య చతురత గురించి అందరికీ తెలుసు. నవ్విస్తూనే.. సడెన్ గా ఒక గొప్ప వాక్యంతో ఆకట్టుకుంటాడు. సినిమా అనే కాకుండా సాహిత్యాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఇలాంటి పుస్తకాన్ని మనందరి ముందుకూ తెస్తున్న కుమార స్వామిని మరోసారి అభినందిస్తూ.. సెలవు..’’ అన్నారు.
దర్శకుడు సాగర్ కే చంద్ర మాట్లాడుతూ.. ‘‘ ముందుగా దర్శకుడుగా పరిచయం అవుతున్న కుమార స్వామికి కంగ్రాట్యులేషన్స్. మేం ఇంతకు ముందు కలిసి పనిచేశాం. ఆయన దర్శకుడుగా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జిఆర్ మహర్షి గారితో నాకు మంచి పరిచయం ఉంది. నా కథకు సంబంధించి ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు దీనికి క్లారిటీ ఎవరిస్తారా అని కుమారస్వామిని అడిగాను. అతనే నాకు ఈయన్ని పరిచయం చేశాడు. మహర్షిగారు చెప్పిన మార్పులు నా కథకు చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు చేస్తోన్న సినిమా కథే అది. ఇక ఈయన పుస్తకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన కొడుకు పెళ్లి సందర్భంగా కొన్నాళ్లు మా ఫ్లాట్ లో సామాన్లు పెట్టుకుంటా అంటే ఓకేఅన్నాను. సామాన్లు అంటే ఏంటో అనుకున్నా.. దాదాపు రెండు వేల పుస్తకాలున్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పుస్తకాలు పంపించిన తర్వాత నాకు ఫోన్ చేసి ఆ పుస్తకాలను జాగ్రత్తగా చూసుకోవాలని.. పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్న ఆడపిల్ల తండ్రిలా జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతం నేనూ ఆ పుస్తకాలు చదివే పనిలో ఉన్నాను. ఈ మార్నింగ్ షో బుక్ ప్రతి ఒక్కరూ చదవాలి. సినిమాలకు సంబంధించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. ఓ యాభై యేళ్ల సినిమా పరిణామం కూడా ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఇలాంటి బుక్ ను అందించిన జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదికకు కుమార స్వామికి మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నాను.. ’’ అన్నారు.
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ షరతులు వర్తిస్తాయి అనే సినిమాతో దర్శకుడుగా మారిన కుమార స్వామికి అభినందనలు. అతన్నుంచి ఓ మంచి సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. జిఆర్ మహర్షితో నాది సాహిత్య పరిచయమే. కానీ ఇలాంటి సభల్లో మాట్లాడాలంటే కాస్త కష్టంగా ఉంటుంది. పుస్తకం చదివిన వాళ్లు ఓ రకంగా, చదవని వాళ్లు మరో రకంగా మాట్లాడతారు. ఈ రెండూ కాక తమిళ నటుడు రాధారవి తరహాలో మాట్లాడేవారూ ఉంటారు. నేను ఆ టైప్. ఈ పుస్తకానికి మార్నింగ్ షో అనే టైటిల్ పెట్టడం చూస్తేనే మహర్షికి సినిమా పట్ల ఎంత మమకారం ఉందో అర్థం అవుతుంది. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని కోరుకుంటున్నాను .. ’’ అన్నారు.
దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ.. ‘‘ జి ఆర్ మహర్షి గారి వ్యాసాలు చూస్తుంటాను. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో చంద్రమోహన్ నటిస్తే ఎలా ఉండేది అంటూ ఆయన రాసిన ఒక వ్యాసం నచ్చి ఆయనను కాంటాక్ట్ అయ్యాను. సినిమా గురించి ఎన్నో విశేషాలు చెబుతూ ఉండేవారు. ముఖ్యంగా మంచి కాస్టింగ్ కుదిరితే సగం సక్సెస్ అయినట్టే అని ఆయన చెప్పిన మాట అక్షరాలా నిజం. ఈ పుస్తకం ద్వారా మహర్షి గారి సమగ్ర సినిమా ఆలోచనలు మరింత ఎక్కువమందికి చేరతాయని ఆశిస్తున్నాను.. ’’ అన్నారు.
కవి సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘‘ సినిమా, సాహిత్యం కలిసే ప్రయాణం చేయాలి. మంచి సాహిత్యం ఉన్న సినిమాలే ఎక్కువ కాలం గుర్తుంటాయి. జీఆర్ మహర్షి చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఒక వ్యక్తికి సినిమా పట్ల ఇంత లోతైన అవగాహన ఉండటం గొప్ప విషయమైతే.. దాన్ని పదిమందికి తెలియచెప్పాలనుకోవడం ప్రశంసనీయమైన విషయం. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలని కోరుకుంటున్నాను.. ’’ అన్నారు.
మార్నింగ్ షో పుస్తక రచయిత జీఆర్ మహర్షి మాట్లాడుతూ.. ‘‘ ఇలా ఎక్కువమంది ఉండే సభల్లో మాట్లాడటం నాకు కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కొన్నాళ్ల క్రితం వేర్వేరు ఫ్లోర్స్ లో ఒక కవిత సభ, ఒక కథ సభ జరుగుతోందట. ఇక్కడికి వెళ్లాల్సిన గెస్ట్ లు అక్కడికి అక్కడికి వెళ్లాల్సిన గెస్ట్ లు ఇక్కడికి వెళ్లారట. అయినా రెండు సభలూ విజయవంతం అయ్యాయి అని ఒక కథ రాశాను. అలాంటి కన్ఫ్యూజన్ ఇక్కడేం లేకపోవడం సంతోషం. నిజానికి మా అబ్బాయి పెళ్లి కూడా అలాగే జరిగింది. కింద ఫ్లోర్ లో మా అబ్బాయి పెళ్లి, పైన ఫ్లోర్ లో వేరే వారి పెళ్లి జరిగింది. మా గెస్ట్ లు అక్కడికి వెళ్లి గిఫ్ట్స్ ఇచ్చి వచ్చారు. ఇలాంటి హాస్యం జీవితంలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది మనకు. ఇక ఈ పుస్తకం విషయానికి వస్తే.. నాకు చిన్నప్పటి నుంచీ విపరీతమైన సినిమా పిచ్చి ఉంది. వారం రోజులు ప్రయత్నిస్తే ఒక్క రూపాయి ఇచ్చేవాళ్లు. ఆ రూపాయితో సినిమా చూడ్డంతో పాటు ఇంటర్వెల్ లో కొనుక్కునేవాళ్లం. అలాగే చిన్నప్పుడు సినిమాల్లో ఎన్టీఆర్ విన్యాసాలు విపరీతంగా నవ్వు తెప్పించేవి. ఆ హీరోలు అలా ఎలా ఎగిరి గంతేస్తారు అని ఆశ్చర్యంతో చూసేవాణ్ని. విఠాలాచార్య సినిమాల్లోలాగా మంత్రాలు నేర్చుకుని మా హిందీ సార్ ను రామ చిలుకను చేయాలని ప్రయత్నించేవాడిని. భాషతో సంబంధం లేకుండా కదిలే బొమ్మలైనా చూడటం నాకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే యాభైయేళ్లుగా ఇంకా ఇంకా సినిమాలు చూస్తూనే ఉండాలనిపించేలా చేసింది. కాకపోతే ఒకప్పుడు సినిమా చూస్తే ఒక ఎమోషనల్ బాండ్ కనిపించేది. ఇప్పుడు అది మిస్ అయింది. నాకు ఏ ఊరైనా వెళితే.. ఆ ఊరిలో ఎన్ని సినిమా థియేటర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడమే అన్నికంటే ఎక్కువ ఇష్టమైన పని. ఓ సారి సినిమా చూడ్డానికే 19యేళ్ల వయసులో మైసూర్ వెళ్లాను. నైట్ షో చూసిన తర్వాత ఆటోలు దొరక్క, అడ్రెస్ గుర్తు లేక ఇబ్బంది పడ్డాను. ఇలాంటి ఇబ్బందులు చాలానే పడ్డాను. కానీ ఏ రోజూ సినిమా చూడొద్దు అన్న భావన కలగలేదు. షోలే సినిమాను ఇప్పటికి ఒక వెయ్యి సార్లు చూసి ఉంటాను. ఆ సినిమాలోని ప్రతి కదలికగా నాకు కంఠతా వచ్చు. 1970ల నుంచి 1990ల తర్వాత వరకూ సినిమా రంగంలో వచ్చిన అనేక మార్పులను ఈ పుస్తకంలో రాశాను. కథల పరంగా, టెక్నికల్ గా, నటీ నటుల పరంగా ఇలా ఎన్నో మార్పులు చూసిన తెలుగు సినిమా పరిణామ క్రమాన్ని రాశాను అని చెప్పలేను కానీ.. చాలా వరకూ రికార్డ్ చేశాను. ఇది కేవలం నాకు తెలిసిన అంశాలే కాక తెలుసుకుని రాసిన అంశాలు కూడా పొందుపరచబడిన పుస్తకం. వ్యంగ్యం అనేది నాకు తెలియకుండానే నాలో ఏర్పడ్డ లక్షణం. అక్కడక్కడా నవ్వించినా.. ఎన్నోసార్లు ఆలోచింపచేస్తుందీ పుస్తకం. ఏదో ఆశించి కాదు కానీ.. నా అనుభవాలు, సినిమాతో నాకు ఉన్న అనుబంధాన్ని తెలిపే ఈ పుస్తకం మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇక చివరగా ఈ పుస్తకం కోసం కుమార స్వామి ఎంతో టైమ్ కేటాయించాడు. టైమ్ కు రాదేమో అని నిన్నటి వరకూ చాలా టెన్షన్ పడ్డాను. బట్ నా టెన్షన్ ను కూడా తనే తీసుకుని ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి కారణం కుమార స్వామి. అతనికి కృతజ్ఞతలు చెబుతూ.. దర్శకుడుగా అతను రూపొందించిన షరతులు వర్తిస్తాయి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ’’ అన్నారు.
జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదిక ప్రతినిధి కుమారస్వామి(అక్షర) మాట్లాడుతూ.. ‘‘సాహిత్యం, సాంస్కృతిం రెండూ గొప్ప ప్రయాణాలు. ఈ రెండు చోట్లా నేను ఉండటానికి కారణం సాహిత్యమే. జమిలి లక్ష్యానికి తగ్గట్టుగానే ఈ పుస్తకాన్ని ప్రచురించాం. ఇక్కడికి వచ్చిన గెస్ట్ లందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ మార్నింగ్ షో మీ అందరు చదివి ఆదరిస్తారని కోరునుకుంటున్నాను.. ’’ అన్నారు.

Related posts

Leave a Comment