Saindhav Movie Review in Telugu : ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

Saindhav Movie Review in Telugu :
Spread the love

(చిత్రం : సైంధవ్, విడుదల : 13 జనవరి-2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా తదితరులు. దర్శకత్వం : శైలేష్ కొలను, నిర్మాత: వెంకట్ బోయనపల్లి, సంగీతం: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: ఎస్ మణికందన, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్)

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “సైంధవ్”. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 13 జనవరి-2024న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఎలా వుందో తెలుసుకుందాం…

కథ : సైంధ‌వ్ కోనేరు అలియాస్ సైకో (వెంకటేష్) తన కూతురు గాయత్రి (సారా)తో హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. వారి ఇంటి పక్కన ఉండే మనోజ్ఞ (శ్రద్ధ శ్రీనాథ్) పాపని చూసుకుంటుంది. అయితే.. గతంలో సైంధ‌వ్ కోనేరు చేసిన క్రైమ్ కారణంగా.. అతని పేరు వింటేనే భయపడిపోతారు. అలాంటి గతం ఉన్న సైంధ‌వ్ కోనేరు అన్ని వదిలేసి కూతురి కోసం బతుకుతుంటాడు. కానీ, గాయత్రికి స్పైనల్ మాస్క్యూలర్ ఎంట్రోపీ అనే వ్యాధి వస్తోంది. ఆ వ్యాధి నుంచి పాప బయట పడాలంటే రూ .17 కోట్ల విలువ కలిగిన వైల్ కావాలి. ఆ డబ్బుకోసం సైంధ‌వ్ ఏం చేశాడు ?, తన పాపని రక్షించుకున్నాడా ?..లేదా ?, ఈ క్రమంలో వికాస్ మాలిక్‌ (నవాజుద్దీన్) తో వచ్చిన గొడవ ఏమిటి ?, చివరకు సైంధ‌వ్ తన కూతురు కోసం ఏం సాధించాడు?, ఈ మధ్యలో డా. రేణు (రుహాని శర్మ ), జాస్మిన్‌ (ఆండ్రియా జెరెమియా) పాత్రలు ఏమిటి ? అనేది సినిమా కథ.

విశ్లేషణ: సినిమా మొదటి అరగంట నెమ్మదిగా సాగుతుంది. కానీ ఆ తర్వాత మాత్రం వెంకీ మామతో పాటు స్టోరీ కూడా ఊపందుకుంటుంది. ముఖ్యంగా ‘సైకో ఈజ్ బ్యాక్’ అంటూ విలన్లు గజగజలాడే సీన్లలో ఇంటెన్సిటీ అదిరిపోయింది. ప్రీ ఇంటర్వెల్ సీన్లో విలన్లకి వెంకీ వార్నింగ్ ఇచ్చే సీన్ సినిమాకే హైలెట్. ఇక సినిమా మొత్తం లెక్క మారుతుందిరా నా కొడకల్లారా అంటూ వెంకీ డైలాగ్ చెప్పిన ప్రతి సారీ విజిల్స్ పడటం పక్కా. సెకండాఫ్‌యే సినిమాని నిలబెట్టింది. ఓవైపు యాక్షన్ సీన్లను హోరెత్తిస్తూనే ఎమోషనతో హార్ట్ టచ్ చేశాడు దర్శకుడు. శైలేశ్ తీసుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది. దాన్ని ఇంకా డెవలప్ చేసుంటే సినిమా మరో లెవల్లో ఉండేది. ముఖ్యంగా సైకోను చూసి ఎందుకు అందరూ అంత భయపడుతున్నారు అనేది ఇంకా ఎలివేట్ చేసుంటే బాగుండేది. హిట్ సిరీస్‌లో స్క్రీన్‌ప్లేనే పెద్ద బలం.. సైంధవ్‌కి కూడా అలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉండి ఉంటే వాహ్.. అనిపించేది. డైరెక్టర్ శైలేశ్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్టోరీ లైన్‌ను ట్రైలర్‌లోనే చెప్పేస్తాడు. అంతా చెప్పేస్తే ఇంక ఇంట్రెస్టింగ్ ఏముంది? అనుకునే వారిని తన స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్‌తో ఆకట్టుకుంటాడు. ఇదే ఫార్ములాను హిట్, హిట్ -2కి వాడి సూపర్ హిట్లు అందుకున్నాడు. సరిగ్గా సైంధవ్‌కి కూడా ఇదే ఫార్ములాను ట్రై చేశాడు. స్టోరీ అంతా మనకి తెలిసినా దాన్ని చూపించే విధానంతో కాస్త ఇంప్రెస్ చేశాడు. వెంకటేష్ ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశారు. కామెడీ, యాక్షన్, డ్రామా, సెంటిమెంట్ ఇలా ప్రతి జోనర్‌‌ను టచ్ చేశారు. కానీ సైంధవ్ సినిమాలో మాత్రం వెంకీ మామతో కొత్త ప్రయోగమే చేశాడు శైలేష్. సినిమా మొత్తం హై యాక్షన్ సీన్లు చేయిస్తూనే వెంకీ మార్క్ ఎమోషన్, సెంటిమెంట్‌ను బయటికి తీశాడు. సినిమా మొత్తం చాలా స్టైలిష్‌గా ఉంది. సినిమాలో ప్రధాన కథాంశం, సైంధవ్ పాత్ర, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో మాత్రం దర్శకుడు నిరాశ పరిచాడు. అయితే, సెకెండ్ హాఫ్ లో పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. దీనికితోడు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా వంటి మంచి నటీనటులు ఉన్నా.. వారికి తగ్గట్టు వారి పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదు.

నటీనటులు ఎలా చేశారంటే… ఈ సినిమాలో విక్టరీ వెంకీ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎమోషనల్ సీన్లతో ఏడిపించడం వెంకీకి కొత్తేం కాదు. కానీ ఇందులో కొన్ని సీన్లలో వెంకటేష్‌ని చూసినప్పుడు ఆడియన్స్‌కి తెలీకుండానే గుండె బరువెక్కిపోతుంది. ముఖ్యంగా తన కూతురిని కాపాడుకోలేకపోతున్నాననే బాధ గుండెను కోసేస్తున్నా నవ్వుతూనే తన పాపతో మాట్లాడే సీన్ వేరే లెవల్‌లో ఉంది. ఫ్యాన్స్ తన నుంచి ఏం కోరుకుంటారో అది నూటికి నూరు శాతం ఇచ్చారు వెంకటేష్. యాంగ్రి మ్యాన్‌గా కనిపిస్తూనే తల్లడిల్లిపోయే తండ్రిగానూ ఒదిగిపోయారు. సైంధవ్ కోనేరు అనే సైకో పాత్రలో వెంకటేష్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. వెంకటేష్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ స్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో వెంకటేష్ చాలా బాగా నటించాడు. అతిధి పాత్రలో నటించిన ఆర్య కూడా మెప్పించాడు. మరో కీలక పాత్రలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించింది. జాస్మిన్‌ పాత్రలో ఆండ్రియా జెరెమియా ఒదిగిపోయింది. డా. రేణుగా రుహాని శర్మ నటన కూడా బాగుంది. జిషు సేన్‌గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాష్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఒదిగిపోయారు. దర్శకుడు శైలేష్ కొలను రాసుకున్న యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నాయి. ఇక సినిమాలో మరో హైలెట్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన. బాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో గొప్ప పాత్రలు చేసిన నవాజుద్దీన్‌కి ఇదే తొలి తెలుగు సినిమా. ఇక దీనికి ఆయనే ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవాజుద్దీన్ బాగా ఆకట్టుకున్నారు. డైలాగ్ డెలివరీ కానీ ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా భయపెట్టడం కానీ ఇలా ప్రతి సీన్‌లోనూ తన యాక్టింగ్ టాలెంట్ చూపించారు. ఇక సినిమాలో కామెడీ బాధ్యతను కూడా నవాజుద్దీన్‌యే చూసుకున్నారు. ఇక మనో పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ సరిగ్గా సరిపోయింది. వెంకటేష్‌, పాపతో ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. ఇక డాక్టర్ పాత్రకి ఉన్నంత పరిధిలో రుహానీ కూడా న్యాయం చేసింది. ఇక వెంకీ ఫ్రెండ్ మానస్ పాత్రలో తమిళ హీరో ఆర్య కనిపించారు. రెండు మూడు ఫైట్ సీన్లు మాత్రమే ఆర్యకి ఉన్నాయి. ఇక నవాజుద్దీన్ గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ క్యారెక్టర్‌లో ఆండ్రియా చాలా స్టైలిష్‌గా కనిపించింది. ఇక చివరిగా వెంకటేష్ కూతురు గాయత్రిగా బేబీ సారా నటన అందరినీ ఆకట్టుకుంది. చిన్నారి యాక్టింగ్ చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది.

సాంకేతిక విభాగం : దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ అదిరింది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం ఓకే అనిపించింది. ఐతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాత వెంకట్ బోయనపల్లి పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. ‘సైంధవ్’ అంటూ వచ్చిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. మొత్తం మీద వెంకటేష్ ఫ్యాన్స్ ఓసారి లుక్కేయొచ్చు!!

Related posts

Leave a Comment