- చిత్రం: రొమాంటిక్
- విడుదల తేది : అక్టోబర్ 29, 2021
- రేటింగ్ : 4/5
- నటీనటులు:
- ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణ,
- ఉత్తేజ్, సునయన, రమా ప్రభ,
- దేవయాని, మకరంద్ దేశ్ పాండే తదితరులు.
నిర్మాణం: పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి
కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు: పూరి జగన్నాథ్
దర్శకత్వం: అనిల్ పాదురి
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: నరేష్ రానా
ఎడిటర్: జునైడ్ సిద్దికి
ఆర్ట్: జానీ
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్ పై అనిల్ పాదురి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’ తాజాగా నేడు (అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత రెండేళ్లుగా నిర్మాణం లో ఉన్న పూరి జగన్నాథ్ – ఛార్మిల తాజా ప్రొడక్షన్ ఈ చిత్రం. ఆకాష్ పూరికి హీరోగా రెండో సినిమా. ఇన్ స్టాగ్రామ్ బ్యూటీ కేతిక శర్మ ఈ చిత్రం ద్వారా తొలిసారిగా హీరోయిన్ గా పరిచయమైంది. విడుదలకు ముందు ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకునేలా ఉండటంతో పాటిల్ అగ్రతారలు ప్రమోట్ చేయడంతో అందరి దృష్టి ‘రొమాంటిక్’ పై పడింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఎలావుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.. .
‘రొమాంటిక్’ చిత్రం ఆద్యంతం గోవా డ్రగ్ మాఫియా చుట్టూనే తిరుగుతుంది. వాస్కోడి గామా (ఆకాష్ పూరి) ఒక స్ట్రీట్ రఫియాన్. డబ్బు సంపాదించడానికి.. తన బామ్మ (రమాప్రభ) కలను నెరవేర్చడానికి తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకుంటాడు. అందుకు నేరాలను ఎంచుకుంటాడు. అతడితోపాటు, తన చిన్ననాటి స్నేహితుడు అన్నీ గోవాలోని అత్యంత ప్రసిద్ద డ్రగ్ మాఫియా లార్డ్ రోడ్రిగా ముఠాలో చేరడం జరుగుతుంది. కొద్ది కాలం లోనే వాస్కో గోవా అండర్ వరల్డ్ లోకి కింగ్ లా ఎదిగిపోతాడు. ఈ నేపథ్యంలో యువ సంగీత విద్వాంసురాలు అయినా మోనికా (కేతిక శర్మ) అనే యువతి అందాలకు పడిపోతాడు. ఆమెనే తన లోకం అనుకుంటాడు. ఓ డ్రగ్ డీల్ విఫలం కావడంతో వాస్కో రొడ్రిగ్స్ ను చంపుతాడు. అంతేకాక తనకి తాను గా మాఫియా కి రాజు గా ప్రకటించుకుంటాడు. ఈ ప్రక్రియ లో ఆకాష్ ఒక ఎస్ఐ ను చంపుతాడు. ఇదే సమయంలో గోవా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారతాడు. అయితే అతని జోరును ఆపడానికి ఏసీపీ రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ)ను రంగంలోకి దించుతుంది ప్రభుత్వం. వాస్కోని, అతని గ్యాంగ్‌ను అంతం చేయడమే ఆమె లక్ష్యం. గోవార్కర్ రంగంలోకి దిగాక.. వాస్కో లక్ష్య సాధనకు అనేక సవాళ్లెదురవుతాయి. మరి రమ్యకృష్ణ తను అనుకున్న పనిని సాధించిందా? అసలు వాస్కోడి గామా మాఫియాకి రాజుగా ఎందుకు మారాల్సివచ్చింది? వాస్కో-మోనికాల రిలేషన్ షిప్ ఎక్కడికి దారి తీసింది? అనేదే ‘రొమాంటిక్’గా క్లయిమాక్స్..
దర్శకుడు అనిల్ పాదురి సినిమాను తెరకెక్కించిన తీరు బావుంది. మంచి చిత్రంతో ఇండస్ట్రీలో ఎంటరయ్యాడని చెప్పాలి. ప్రధమార్ధంలో వాస్కోడిగామాగా ఆకాష్‌ను పరిచయం చేసిన తీరు.. డ్రగ్స్ దందాలో అతను గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన వైనం ఆసక్తి కలిగించింది. పతాక సన్నివేశాల్ని భావోద్వేగభరితంగా తీర్చిదిద్దిన తీరు.. విషాదాంతపు ముగింపు ప్రేక్షకులను కదలనివ్వకుండా చేసింది.
హీరో ఆకాష్ వాస్కోడి గామా పాత్రలో చక్కటి నటన కనబరిచాడు. అతని కాన్ఫిడెంట్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ హైలెట్ గా ఉన్నాయి. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోయేలా చేశాడు. హీరోయిన్ గా నటించిన ఢిల్లీ భామ కేతికశర్మకు ఇది తొలిచిత్రమే అయినా.. తన అందం, నటనతో అందర్నీ తనవైపునకు తిప్పుకుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్, నటన అన్నీ చాలా డీసెంట్ గా ఉన్నాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రమ్యకృష్ణ ఈ సినిమాకు బ్యాక్ బోన్ అయిందనే చెప్పాలి. ఆమె వాయిస్ ఓవర్ తో ఈ చిత్రం కథ ప్రారంభమవడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. సునయన-ఉత్తేజ్, రమాప్రభ లు వాళ్ల పాత్రల పరిధిమేరకు నటించారు. లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా బాగున్నాయి. అన్నీ మరిచిపోయి క్లైమాక్స్‌ను చూస్తారు. హీరో రామ్ పోతినేని ఉస్తాద్ అవతార్ లో, పూరి జగన్నాధ్ ఒక ప్రత్యేక పాటలో కనిపించి ఉత్సాహం కలిగించారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అందించిన పాటలతో పాటుగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఎడిటింగ్ బావుంది, సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగ్గ స్థాయిలోనే ఉంది. సుందరమైన గోవా బీచ్ లు, అక్కడి కొన్ని ప్రదేశాలు అంతే అందంగా కెమెరాలో బంధించారు. నిర్మాణ విలువలకు లోటేలేదు. మొత్తం మీద ఈ ‘రొమాంటిక్’ యాక్షన్ హంగామాగా అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విశేషంగా అలరించింది.