‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు

maa adyakshudigaa manchu vishnu
Spread the love

హోరాహోరీగా సాగిన ఈ పోరులో మంచు కుటుంబానికే ‘మా’ పీఠం దక్కింది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. విమర్శలు, వివాదాల మధ్య రసవత్తరమైన పోరు సాగిన ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై ఊహించని ఘన విజయం సాధించారు. జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు గెలుపుపొందగా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ అధిక ఓట్లతోవిజయాన్ని కైవసం చేసుకున్నారు. . వైస్‌ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు టీమ్‌ నుంచి పృథ్వీ రాజ్‌ విజయం సాధించారు. మొత్తం మీద ఈసీ మెంబర్స్ గా ప్రకాశ్ రాజ్ 11, మంచు విష్ణు 7 గెలుచుకున్నారు. ‘మా’ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నప్పుడే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుండి జబర్దస్త్ బ్యూటీ అనసూయ, శివారెడ్డి, కౌశిక్, జర్నలిస్ట్ సురేష్ కొండేటి వంటి వారు స్ఫష్టమైన మెజార్టీతో గెలుపొందారు. శివబాలాజీ గెలుపుతో ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు తొలి విజయం అందుకున్నారు. ఆయన ప్యానల్‌ నుంచి జనరల్‌ సెక్రటరీగా పోటీ చేసిన రఘుబాబు, ఎదుటి ప్యానల్‌ జీవితరాజశేఖర్‌ పై గెలిచి అందర్నీ ఆశ్చర్య పడేలా చేశారు. అదే ప్యానల్‌ నుంచి ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం సాధించారు. ఆయనకు ఎదురు నిలిచిన నాగినీడు పరాజయం పాలయ్యారు. ‘మా’ ఎన్నికల ప్రచారం ఎంత హోరా హోరీగా సాగిందో.. ఓట్ల లెక్కింపు కూడా అదే ఉత్కంఠతో కొనసాగుతోంది. మంచు విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెళ్లు హోరా హోరీగా తలపడ్డాయి. జనరల్‌ సెక్రటరీ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత రాజశేఖర్‌, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు పోటీపడ్డారు. ఉత్కంఠ పోరులో రఘుబాబు 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా విష్ణు ప్యానల్‌ నుంచి మాదాల రవి గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి బాబుమోహన్‌ పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన హోరా హోరీ పోరులో శ్రీకాంత్‌ విజయం సాధించారు. ‘మా’ కోశాధికారిగా విష్ణు ప్యానల్‌ నుంచి శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాశ్‌ ప్యానల్‌ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివబాలాజీ ఆధిక్యం సాధించారు. శివబాలాజీకి 316 ఓట్లు రాగా, నాగినీడుకు 284 ఓట్లు పోలయ్యాయి.
కార్యవర్గ సభ్యులు వీరే: మంచు విష్ణు ప్యానెల్‌లో మాణిక్, హరినాథ్ , బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత కార్యవర్గసభ్యులుగా గెలుపొందారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో అనసూయ, సురేశ్‌ కొండేటి, కౌశిక్‌, శివారెడ్డి కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు. మోహన్‌బాబు, మురళీ మోహన్‌, నరేశ్‌ తదితరులు కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. అయితే.. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈసారి ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఏడాది మొత్తంగా 665 మంది ఓటు వేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రకథానాయకులతోపాటు గిరిబాబు, చలపతిరావు, బాబుమోహన్‌, బ్రహ్మానందం వంటి సీనియర్‌ నటులు, రోజా, జయప్రద, జెనీలియా, అఖిల్‌, నాని.. ఇలా ఎంతో మంది సినీ తారలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఎంతో హోరాహోరీగా సాగిన ‘మా’ ఎన్నికలకు పలువురు తారలు దూరంగా ఉన్నారు. ఓటు వేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌బాబు, తారక్‌, ప్రభాస్‌, రానా, నితిన్, నాగచైతన్య, అల్లు అర్జున్‌, శర్వానంద్‌, సునీల్‌, సుమంత్‌, సుశాంత్‌, సత్యదేవ్‌, అల్లు శిరీష్, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, రవితేజ, అనుష్క, రకుల్‌, త్రిష, హన్సిక, ఇలియానా, నిహారికతోపాటు పలువురు తారలు ఓటు వేసేందుకు హాజరు కాలేదు. అయితే, వీళ్లందరూ తమ వ్యక్తిగత కారణాలు, వరుస షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉండటం వల్ల కొంతమంది నటీనటులు పోలింగ్‌కు హాజరు కాలేకపోయినట్లు సమాచారం. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోలింగ్‌ ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 3 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ సమయం పూర్తైన తర్వాత అప్పటికే క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మా ఎన్నికల్లో 600కు పైగా ఓట్లు పోలైనట్లు అంచనా. గతంలో పోల్చితే ఈసారి పోలింగ్‌ శాతం పెరిగింది. 2017-2019 మా ఎన్నికల్లో 442 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్‌ శాతం పెరగడంతో రెండు ప్యానళ్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద ఒక సమయంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రంగా జరుగుతోన్న పోలింగ్‌లో సీనియర్‌, జూనియర్‌ నటీనటులు పాల్గొన్నారు. అయితే, ‘మా’ సభ్యులను ప్రలోభపెట్టేలా పోలింగ్‌ కేంద్రం లోపల కూడా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రకాశ్‌రాజ్-మంచు విష్ణు ప్యానల్స్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గేటు బయట మాత్రమే ప్రచారం చేసుకోవాలంటూ ఇరు ప్యానల్స్‌ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు కలుగచేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. వాళ్లందర్నీ అక్కడి నుంచి పంపించివేశారు. ఈ మొత్తం వ్యవహారం తెలుసుకున్న మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తున్నారు’ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు చెందిన నటుడు సమీర్‌పై ప్రత్యర్థి ప్యానల్‌ వాళ్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ తరఫు నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న నటి హేమ, విష్ణు ప్యానల్‌ తరఫు నుంచి కోశాధికారిగా పోటీ చేస్తున్న శివబాలాజీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘మా’ ఎన్నికల్లో సినీ ప్రముఖులంతా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అగ్రకథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌ తదితరులు ఓటు వేశారు. ఈ సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని చిరంజీవి చెప్పారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడిగా ఎన్నికలు జరగుతాయని అనుకోవడం లేదన్నారు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా తమ ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయమని.. అది వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నట్లు తెలిపారు. కొందరు షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఓటు వేయలేకపోవచ్చని.. దాని గురించి ప్రత్యేకంగా తాను మాట్లాడనన్నారు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని అగ్ర కథానాయకుడు బాలకృష్ణ అన్నారు. ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశానని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రెండు ప్యానెళ్ల ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపించారు. ఇరు ప్యానెల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశా. ఏదేమైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు.. చేసేవాళ్లే. షూటింగ్స్‌లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. ‘మా’ అంతిమ లక్ష్యం నటీనటుల సంక్షేమం. ఎవరు గెలిచినా వారి వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం’’ అన్నారు. రాజకీయాలపై ‘మా’ ప్రభావం ఉండదు అని పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. తాను ఎవరికి మద్దతుగా నిలిచానో చెప్పడం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని ఆయన అన్నారు. అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులని, రాజకీయాలపై ‘మా’ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపవని పునరుద్ఘాటించారు. ‘మా’ ఎన్నికల్లో ఇంత హడావుడి అవసరం లేదన్నారు. ఈ ఎన్నికల వల్ల సినీ ఇండస్ట్రీ చీలిపోవడమనేది ఉండదని చెప్పారు.

Related posts

Leave a Comment