“సత్యం పలికే హరిచ్ఛంద్రులం , అవసరానికో అబద్దం, నిత్యం నమాజు, పూజలు చేస్తాం , రోజూ తన్నుకు చస్తాం! ” . అప్పుడెప్పుడో వచ్చిన సినిమా పాట ఇది, ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పరిస్థితి చూస్తే ఈ పాటే గుర్తుకు వస్తుంది. పోటీ ఉండాలని ఒకరు, ఏకగ్రీవం కావాలని ఇంకొకరు, ఒకటే ప్యానల్ ని గెలిపించాలని మరొకరు, ఈ వాదనలకి తోడుగా ఒకరిపై ఒకరు నిందలు,ఆరోపణలు వగైరా!వగైరా!”మా” లో నెలకు పైగా ఇదే గోల, పోనీ ఎన్నికలు ముగిశాయి, గోల కూడా ముగుస్తుంది అని అనుకుంటే, అంతలోనే కోర్టులు, కేసులు అంటూ కొత్తరకం రంకెలకు తెర లేపడం! బయటికి ఎన్ని చెప్పినా “మా”లో ఈ పరిస్థితి కి ప్రధాన కారణం మాత్రం “ఈగో” అన్నది అందరికీ తెలిసిన సత్యమే ! ఆ “ఈగో” ఎవరి మధ్య అన్నది కూడా బహిరంగ రహస్యమే! కొంతమంది అగ్ర నటులు చిన్నా చితకా నటీనటులను పావులుగా వాడుకుంటున్నారని ఈ సారి “మా”ఎన్నికలు చెప్పకనే చెప్పినట్లయింది. మరి ఈ సమస్యలకి పరిష్కారం ఏమిటని ఎవరిని అడిగినా ఒకటే సమాధానం “సినీ పెద్దలు”. మరయితే ఈ “సినీ పెద్దలు” ఎవరు?ఎక్కడుంటారు?సమస్యని ఎప్పుడు తీరుస్తారు?అన్నది మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్న! అయితే “మా” లో ఇలాంటి సమస్యలకి మూల కారణమే ఆ”సినీ పెద్దలు” అనే ప్రచారమూ లేకపోలేదు! “మా” ఎన్నికలనేవి కేవలం పని చేయడానికి మాత్రమే కాదు, రెండేళ్లలో ఎవరి బలం పెరిగింది ? ఎవరి బలం తగ్గింది? అనేది కూడా తెలుసుకోవడానికి అని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి! ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన సభ్యులు రాజీనామా చేసి”మేము విష్ణు ఆధ్వర్యంలో పని చేయలేం, బయట నుండి ప్రశ్నిస్తాం ” అని అనడం వింతగా అనిపిస్తుంది, వాళ్ళని గెలిపించింది పనిచేయడానికే తప్ప ప్రశ్నించడానికి కాదుకదా! గెలిచిన వారు పని చేస్తే చాలు , ప్రశ్నించే బాధ్యతని వాళ్లని గెలిపించినవారు చూసుకుంటారు! “మా”అనేది “సేవా సంస్థ” అంటారు,శక్తి వంచన లేకుండా పని చేస్తామంటారు, తీరా గెలిచాక ఫలానా వ్యక్తి అండర్ లో పని చేయలేమంటే ఎలా? పని చేయడం వేరు, సేవ చేయడం వేరు. సాకులు చెప్పి సేవ నుంచి తప్పుకోవడం సమంజసం అనిపించుకోదు! రెండు ప్యానల్స్ పోటీలో ఉన్నప్పుడు “మా” సభ్యులు వాళ్లకి నచ్చిన వాళ్ళను ఎన్నుకుంటారు, కలసి పనిచేయలేమనుకునేవారు అసలు పోటీలోనే నిలబడకూడదు! ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి తెలియవనుకుంటే పొరపాటే ! అన్నీ వాళ్ళకి తెలుసు! ఇదంతా చూసాక ఎవరో అజ్ఞాతవ్యక్తి వీరి వెనుక ఉండి ఈ “డ్రామా” మొత్తం నడిపిస్తున్నారన్నది మాత్రం సుస్పష్టం గా తెలుస్తుంది! ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల మితిమీరిన మాటలు, ఏడుపులు, వాళ్ళ ఓవర్ యాక్షన్ వాళ్ళపై వికారాన్నే కలిగించాయి తప్ప సానుభూతి ని ఏమాత్రం కలిగించలేకపోయాయి! ఈటీవీ ప్రభాకర్ ,ఉత్తేజ్ లాంటి నటులు వారి స్థాయికి మించి మాట్లాడటం విడ్డురం! అసలు వాళ్ళ ఏడుపులు చూస్తుంటే గెలిచిన వెంటనే రాజీనామా చేయమంటున్నారని కడుపుమంట తో ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. నటీనటులందరిదీ ఒకటే కుటుంబం అంటారు, విభేదాలు లేవంటారు, అయితే ఇవన్నీ కేవలం మాటలేనని ఈ “మా’ ఎన్నికలు మరోసారి రుజువు చేసాయి! ఆ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఓ టీవీ చానల్ యాంకర్ మొట్టమొదటి సారిగా “లోకల్-నాన్ లోకల్ ” విషయాన్ని తెర పైకి తెచ్చాడు, అప్పట్లో ఈ అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా! పోటీ లో ఉన్న అభ్యర్థి తన గెలుపు కోసం అన్ని అస్త్రాలుని ప్రయోగిస్తాడు, అందులో భాగమే ఈ “లోకల్-నాన్ లోకల్ ఇష్యు ! ఈ మాత్రం దానికి ఇంత రాదాంతం అనవసరమే! ఒక సమస్యని పరిష్కరించాలంటే మనసుంటే చాలు, అదే సమస్యని తీవ్రతరం చేయాలంటే వంద సాకులు రెడీగా ఉంటాయి! ప్రకాష్ రాజ్ ప్యానల్ రెండో దానిని ఎంచుకోవడం దురదృష్టకరం! ఆదికాలం నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎటొచ్చి ఆ పోరు “మా” లోనూ కొనసాగడం భాదాకర విషయం! అగ్ర నటులు మధ్య ఉన్న
పోరు గెలుపోటములు లేకుండా “డ్రా” గా ముగియాలని ఆశిద్దాం! ముందుగా చెప్పుకున్న సినిమా పాటలో ప్రకాష్ రాజ్ నటించడం కొసమెరుపు! –
— మురళి మద్ది