(కైకాల సత్యనారాయణ 1935-2022)
తెలుగు చిత్రసీమ వరుసగా మహామహులైన నటదిగ్గజాలను కోల్పోతూ తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకం వీడిన క్షణాలను మరచిపోకముందే నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ‘నేను సైతం వెళ్ళిపోతున్నాను’ అంటూ శాశ్వతంగా పరిశ్రమకు వీడ్కోలు చెబుతూ ఇక సెలవంటూ మనల్ని విడిచి వెళ్లిపోయారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలకు జీవం పోసిన నవరస నట సార్వభౌముడు సత్యనారాయణ ఇక లేరంటేనే చిత్రసీమ యావత్తు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో తనదైన శైలిలో నటించి మెప్పించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో నేడు (23 డిసెంబర్-2022) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్రసీమ మరో సీనియర్ నటుడిని కోల్పోయినట్లయింది. 1935 జులై 25న జన్మించిన సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. సత్యనారాయణ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, ది గుడివాడ కళాశాల (ఏఎన్ఆర్ కళాశాల) నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సత్యనారాయణ 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో దాదాపు 777 చిత్రాల్లో నటించారు. కళామతల్లికి ఎంతో సేవ చేసి.. భారత పార్లమెంటు సభ్యుడుగా రాజకీయంగా కూడా పేరు తెచ్చుకున్నారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్.వి.రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో సత్యనారాయణ ఒకరు. 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన ఆయన తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు . తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. అతన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ ‘సిపాయి కూతురు’ అనే సినిమాలో ఆయనకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించటానికి ఆసక్తి గల కారణం, అతని రూపు రేఖలు యన్.టి.ఆర్‌ను పోలి ఉండటమే! యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడా కైకాలను గమనించారు. 1960లో యన్.టి.ఆర్ తన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’లో ఆయనకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసి తన నటనతో అందర్నీ మెప్పించారు. సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది బి.విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా ‘కనకదుర్గ పూజా మహిమ’లో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో అతను ప్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు. ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది.
కైకాల సత్యనారాయణ యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడిగా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలను చాలావరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని (కథాకనాయిక) తండ్రి, తాత మొదలైనవి. సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించారు. 1996లో రాజకీయాల్లోకి వచ్చిన సత్యనారాయణ మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ఇక కైకాల నటించిన సినిమాల విషయానికొస్తే… సిపాయి కూతురు (1959) (మొదటి సినిమా). లవకుశ (1963), పాండవ వనవాసం (1965), పరమానందయ్య శిష్యుల కథ (1966), ప్రేమనగర్ (1971), తాతా మనవడు (1973), నిప్పులాంటి మనిషి (1974) – షేర్ ఖాన్, జీవన జ్యోతి (1975), సిరిసిరిమువ్వ (1976), సెక్రటరీ (1976), చక్రధారి (1977), దాన వీర శూర కర్ణ (1977) – భీముడు, యమగోల (1977) -యముడు, శుభలేఖ (1982) – అంకెల ఆదిశేషయ్య, శ్రుతిలయలు (1987) – వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, రుద్రవీణ (1988), నారీ నారీ నడుమ మురారి (1990) – జానకిరామయ్య, సూత్రధారులు (1990) – నీలకంఠయ్య, గ్యాంగ్ లీడర్ (1991) – జైలర్, భైరవ ద్వీపం (1994), ముద్దుల ప్రియుడు (1994), యమలీల (1994) – యముడు, ఘటోత్కచుడు (1995)- ఘటోత్కచుడు, సాహసవీరుడు – సాగరకన్య (1996), సూర్యవంశం (1998), శుభాకాంక్షలు (1998) – సీతారామయ్య, సమరసింహారెడ్డి (1999), మురారి (2001), అరుంధతి (2009), నరసింహుడు (2005) తదితర సినిమాల్లో నటించిన ఆయన నిర్మాతగా ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలు నిర్మించారు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, జీవితకాల సాఫల్య పురస్కారాలు, నంది అవార్డులు, ఉత్తమ చలన చిత్రం – బంగారు కుటుంబం (1994), రఘుపతి వెంకయ్య అవార్డు – 2011లతో పాటు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు, కళా ప్రపూర్ణ , నవరస నటనా సార్వభౌమ తదితర అవార్డులెన్నో ఆయనను వరించాయి. ఇప్పటి వరకు ఆయన 777 సినిమాల్లో విలక్షణమైన పాత్రలను పోషించారు. అందులో 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాలున్నాయి. 200 మందికి పైగా దర్శకులతో పనిచేసిన అనుభవం కైకాల సత్యనారాయణది. ఆయన నటించిన 223 సినిమాలు 100 రోజులు ఆడాయి, 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి, 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి, 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడాయి. కొంతమంది చరిత్రను తిరగ రాస్తారు.. మరి కొంత మంది కొత్త చరిత్రను సృష్టిస్తారు. అలాంటి వారిలో ఒకరు కైకాల. 1996లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1998లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కావూరి సాంబశివరావుపై ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్‌తో సత్యనారాయణకు అనుబంధం ఉంది. ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కైకాల ప్రయాణం కొనసాగింది. కైకాల నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు.. చివరి చిత్రం మహర్షి. నటనపై ఉన్న ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సత్యనారాయణలోని టాలెంట్‌ను ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ గుర్తించి ‘సిపాయి కూతురు’లో అవకాశం ఇచ్చారట. ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో సత్యనారాయణ సినీ జీవితం మలుపు తిరిగింది.. ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించారు. ఆయనకు 2017లో ఫిల్మ్‌ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది. 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది. అంతేకాదు 200 మందికిపైగా దర్శకులతో కైకాల సత్యనారాయణ పనిచేశారు. కైకాల నటించిన 223 చిత్రాలు 100 రోజులు ఆడాయి. సంవత్సరం పైగా 10 సినిమాలు ఆడాయి.. అర్ధశత దినోత్సవాలు జరుపుకున్న సినిమాలు 59 ఉన్నాయి. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేషాభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్రపరిశ్రమతోపాటు, తెలుగువారికి తీరనిలోటు.
కైకాల గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది : నందమూరి బాలకృష్ణ
‘‘కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’
శ్రీ కైకాల గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్
”తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటులు శ్రీ కైకాల సత్యనారాయణ గారు తుదిశ్వాస విడిచారనే విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా కుటుంబానికి శ్రీ సత్యనారాయణ గారు సన్నిహితులు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి అన్నయ్య చిరంజీవి గారితోను, మాతోనూ ఆప్యాయంగా ఉండేవారు. ఇటీవల ఆయనతో మాట్లాడాను. వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకున్నాను.
శ్రీ సత్యనారాయణ గారిని అభిమానులు నవరస నటనా సార్వభౌమ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతినాయక పాత్రలను ఎంత అవలీలగా పోషించారో అదే స్థాయిలో కరుణరస ప్రధానమైన పాత్రల్లోనూ ఒదిగిపోయారు. పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. తెలుగువారికి యమధర్మరాజు అంటే శ్రీ సత్యనారాయణ గారే. ఆ పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా చేశారు. ఏ తరహా పాత్రనైనా ప్రేక్షకుల మెప్పు పొందేలా నటించారు. నిర్మాతగాను మంచి చిత్రాలు అందించారు. లోక్ సభ సభ్యుడిగా ప్రజా జీవితంలో ఉన్నారు. తెలుగుదనం మూర్తీభవించిన శ్రీ సత్యనారాయణ గారు లేని లోటు తెలుగు చిత్రసీమలో తీర్చలేనిది. శ్రీ కైకాల సత్యనారాయణ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
అత్యంత బాధాకరం : జయప్రద
కైకాల సత్యనారాయణ గారి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు ప్రముఖ నటి జయప్రద. ఈ విషాద వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని ఆమె పేర్కొన్నారు. “అడవిరాముడు, యమగోల” తదితర ఎన్నో చిత్రాల్లో కలిసి నటించినప్పటి జ్ఞాపకాలను ఆమె నెమరువేసుకున్నారు. నటనకు నిఘంటువు వంటి సత్యనారాయణ స్థానం తెలుగు చిత్రసీమలో చెక్కు చెదరనిదని జయప్రద అన్నారు. కైకాల కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతి తెలిపారు!!
కృష్ణంరాజు భార్య శ్యామల సంతాపం
కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. “ఈ రోజు కైకాల సత్యనారాయణ గారు కాలం చేశారు అని తెలిసి చాలా బాధ పడ్డాం. ఆయన భార్య కుమార్తెలతో మేమంతా చాలా క్లోజ్ గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మొన్నామధ్య కృష్ణంరాజు గారు ఏం సత్యనారాయణ మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని అంటే ఖచ్చితంగా వస్తానని, మీరు ఒక టైం చూసి చెప్పమన్నారు, అయితే ఆయన మా ఇంటికి రాలేక పోయారు. కైకాల సత్యనారాయణ కృష్ణంరాజు గారితో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించారు. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు, అది పూర్తిస్థాయి కామెడీతో సాగే పాత్ర. అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమే, అలాంటి ఒక లెజెండ్రీ నటుడు ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడు అంటే అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజు అంటూ ఉండేవారు. నవరసాలను పండించగల నవరస నటనా సర్వ భౌమ కైకాల సత్యనారాయణ గారు ఇప్పుడు మనమధ్య లేరంటే బాధగా ఉంది. ఇదే ఏడాది ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ దూరం అవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. కైకాల వారి కుటుంబం అంతా దృఢంగా ఉండేలా ఆ దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
కైకాలకు ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ అంకితం
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మరణం పట్ల ఆయన చివరిగా నటించిన ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ చిత్ర యూనిట్ సంతాపం తెలిపింది. దాదాపు 60ఏళ్ల పాటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన కైకాల సత్యనారాయణ గారు నటించిన చివరి చిత్రం’దీర్ఘాయుష్మాన్‌భవ’. టారస్ సినీకార్ప్ & త్రిపుర క్రియేషన్స్ బ్యానర్స్ పై బొగ్గరం వెంకట శ్రీనివాస్, వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. కార్తీక్ రాజు, మిస్తి చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రంలో తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన యముడి పాత్ర పోషించారు కైకాల సత్యనారాయణ. ”కైకాల సత్యనారాయణ గారు నవరస భరితమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన గొప్ప నటుడు. చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన నవరస నటనా సార్వభౌమడు కైకాల సత్యనారాయణ గారు. మేము నిర్మిస్తున్న ఆయన చివరి చిత్రం ‘దీర్ఘాయుష్మాన్‌భవ’లో కైకాల సత్యనారాయణ గారు యుముడి పాత్రని పోషించారు. ఈ రోజు కైకాల సత్యనారాయణ గారు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ విడుదలకు రెడీ అయ్యింది. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసి జనవరిలో చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటుండగా ఆయన మరణవార్త మమ్మల్ని కలచివేసింది. కైకాల సత్యనారాయణ గారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం” అని నిర్మాతలు తెలిపారు