వరుస మరణాలతో విషాదంలో ఉన్న టాలీవుడ్ కు ప్రముఖ ఎడిటర్ జి జి కృష్ణారావు మృతి రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది . 300 పైగా చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి ఎందరెందరో శిష్య ప్రశిష్యులను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన జి .జి. కృష్ణారావు (87) ఈరోజు బెంగళూరులోని ఆయన స్వగృహంలో తృది శ్వాస విడిచారు. ఆదుర్తి సుబ్బారావు, కళాతపస్వి కె. విశ్వనాథ్, దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు, జంధ్యాల వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి మూడుసార్లు ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు అందుకున్న కృష్ణారావు మరణం పట్ల “తెలుగు ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ ” తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు సంతాప తీర్మానాన్ని ఆమోదిస్తూ ” నేటితరం ఎడిటర్స్ లో చాలామంది ప్రముఖులు ఆయన శిష్యులే. ఎడిటింగ్ శాఖకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిన ప్రముఖులలో జి.జి. కృష్ణారావు గారు ఒకరు. ఆయన మరణంతో తెలుగు ఫిలిం ఎడిటర్స్ శాఖ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ” అంటూ సంతాప తీర్మానాన్ని ప్రకటించారు తెలుగు ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వరరావు ( చంటి), ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె వెంకటేష్.
ఎడిటర్ జి జి కృష్ణారావు మృతికి తెలుగు ఎడిటర్స్ అసోసియేషన్ సంతాపం!!
